మధుమేహం పేదవాడి శత్రువు

ABN , First Publish Date - 2021-11-29T08:26:06+05:30 IST

మధుమేహ వ్యాధి పేదవాడి శత్రువు అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు....

మధుమేహం పేదవాడి శత్రువు

 జీవితాంతం తోడుండే వ్యాధి

 ఖర్చుతో కూడుకున్న చికిత్స తప్పనిసరి

 ప్రభుత్వాలు సబ్సిడీ అందించాలి

 భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మధుమేహ వ్యాధి పేదవాడి శత్రువు అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. జీవితాంతం తోడుండే ఈ వ్యాధికి ఖర్చుతోకూడిన చికిత్స తప్పనిసరి అని.. రోగిపై ఆర్థిక భారాన్ని మోపే అతి ఖరీదైన వ్యాధి అని వ్యాఖ్యానించారు. ఇన్సూలెన్స్‌, ఔషధాల ధరలు భరించలేని స్థాయిలో ఉంటాయని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ మందులపై సబ్సిడీ అందించాల్సిన అవసరముందన్నారు. ఆదివారం ఆయన ‘అహుజా బజాజ్‌ సింపోజియం ఆన్‌ డయాబెటిస్‌’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన వైద్యఆరోగ్య వ్యవస్థపై భారం అధికంగా ఉంటోందని.. కొవిడ్‌ మహమ్మారి వల్ల ఆ భారం మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఒకప్పుడు మధుమేహం ధనికుల వ్యాధి అనే అపోహ ఉండేది. ఇప్పుడు అది అన్ని వర్గాలకూ పాకింది. ముఖ్యంగా పేదల పాలిటి శత్రువుగా మారింది. ఈ నేపథ్యంలో మధుమేహ చికిత్స విషయంలో.. ప్రభుత్వాలు పేదలకు సబ్సిడీలు ఇవ్వాలి. చికిత్సకు.. మరింత మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు. సగటు మధుమేహ వ్యాధిగ్రస్థుడు.. మందులపై 65ు మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెబుతున్న విషయాన్ని సీజేఐ గుర్తుచేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ప్రధానంగా.. కొమార్బిడిటీస్‌ ఉన్న లక్షల మందిని కొవిడ్‌ బలిగొంది. రక్తంలో చక్కెర(గ్లూకోజ్‌) నిల్వల నియంత్రణపై ఆందోళనతో నిత్యం మథనపడుతుంటారు.


ప్రతినిమిషం.. ప్రతిరోజు ఆందోళనతో జీవిస్తారు. దీనివల్ల వారి సామాజిక జీవితంపై ప్రభావం కనిపిస్తోంది’’ అని వివరించారు. ఊబకాయం సమస్య, వ్యాయామం లాంటి శారీరక కార్యకలాపాలు లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఒత్తిడి కూడా ఈ వ్యాధి రావడానికి కారణమవుతోందని తెలిపారు. ‘‘ఒత్తిడితో కూడుకున్న న్యాయ వృత్తిని కాకుండా మరే ఇతర వృత్తిని ఎంచుకుని ఉంటే.. నేను దీని నుంచి తప్పించుకునేవాడినేమో’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని నెలల వ్యవధిలోనే మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశారని, కానీ దురదృష్టవశాత్తు ప్రాచీన వ్యాధి అయిన మధుమేహానికి శాశ్వత చికిత్సను కనుక్కోలేదన్నారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. మధుమేహానికి సంబంధించి చికిత్సలో దేశానికి ఎంతో సేవలు అందించిన ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్‌ మన్మోహన్‌ సింగ్‌ అహుజా, ప్రొఫెసర్‌ జబిర్‌ సింగ్‌ బజాజ్‌కు జస్టిస్‌ రమణ నివాళులర్పించారు.


Updated Date - 2021-11-29T08:26:06+05:30 IST