గిరిజనుల జీవనం దుర్భరం!

ABN , First Publish Date - 2021-06-21T03:13:21+05:30 IST

తరాలు మారుతున్నా గిరిజనుల తలరాతలు మాత్రం మారడంలేదు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఏళ్ల తరబడి పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు.

గిరిజనుల జీవనం దుర్భరం!
గిరిజనులు నివసిస్తున్న పూరి గుడిసెలు

పూరిగుడిసెల్లోనే నివాసం

మారని తలరాతలు

అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 20: తరాలు మారుతున్నా గిరిజనుల తలరాతలు మాత్రం మారడంలేదు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఏళ్ల తరబడి పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు దరి చేరడంలేదు. దశాబ్దాల తరబడి వారి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. 

ఉదయగిరి మండలంలోని బండగానిపల్లి పంచాయతీ కొత్తపల్లి ఎస్టీ కాలనీలో 27 కుటుంబాల గిరిజనులు నివసిస్తున్నారు. కాలనీ వాసులంతా వ్యవసాయ, ఇతరత్రా కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారే. ప్రభుత్వాలు మారుతున్నా వారి జీవనశైలి, అభివృద్ధిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఇప్పటికీ పూరి గుడిసెల్లోనే జీవనం సాగిస్తూ కట్టెల పొయ్యి మీద వంట తయారు చేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. కాలనీలో కొందరికి మాత్రమే గతంలో పక్కా గృహాలు మంజూరు కాగా, మిగిలిన వారంతా రోడ్డు మార్జిన్‌ ప్రాంతంలో చాలీచాలని స్థలంలో పూరిగుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. 

అందని సంక్షేమ పథకాలు

27 కుటుంబాలు నివసిస్తున్న కాలనీలో గిరిజనులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఆ పథకాలపై వారికి అవగాహన కల్పించి అవి దరిచేరేలా చేయడంలో అధికారులు, సిబ్బంది విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరికి మాత్రమే గతంలో కాలనీలు మంజూరు కావడంతో పక్కాగృహాలు నిర్మించుకున్నారు. మిగిలిన వారంతా పూరిగుడిసెల్లోనే ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నివేశన స్థల పట్టాలు కూడా వారి దరి చేరలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 


ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయాలి

కాలనీలో కొందరికి మాత్రమే గతంలో పక్కాగృహాలు మంజూరు చేశారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నివేశన స్థల పట్టాలు కూడా మా దరి చేరలేదు. కాలనీ వాసులకు ఇంటి నివేశన స్థల పట్టాలు మంజూరు చేసి పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలి.

- ఇండ్ల నరసయ్య


పూరిగుడిసెల్లోనే నివాసం

కాలనీలో 20 కుటుంబాల వరకు పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. తమకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు దరి చేరడంలేదు. ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరేలా చూడాల్సిన అవసరం ఉంది. 

- నల్లు సుజాత







Updated Date - 2021-06-21T03:13:21+05:30 IST