భలే పండు... బొప్పాయి!

ABN , First Publish Date - 2020-07-13T05:30:00+05:30 IST

ఈ కరోనా కాలంలో అందరికీ రోగనిరోధకశక్తిపై అవగాహన కలిగింది. శరీరానికి ఇమ్యూనిటీ అవసరం ఎంతో తెలిసొచ్చింది. అయితే మందులతోనో కాకుండా... మనం రోజూ తీసుకొనే ఆహారం ద్వారానే రోగనిరోధకశక్తిని మెరుగుపరుచుకోవడం మంచిదంటున్నారు వైద్యులు...

భలే పండు... బొప్పాయి!

ఈ కరోనా కాలంలో అందరికీ రోగనిరోధకశక్తిపై అవగాహన కలిగింది. శరీరానికి ఇమ్యూనిటీ అవసరం ఎంతో తెలిసొచ్చింది. అయితే మందులతోనో కాకుండా... మనం రోజూ తీసుకొనే ఆహారం ద్వారానే రోగనిరోధకశక్తిని మెరుగుపరుచుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. ఆ మెనూలో బొప్పాయి పండు ఉంటే... అది వైరస్‌ల నుంచే కాదు... మరెన్నో రోగాల నుంచీ మనల్ని కాపాడుతుందని మీకు తెలుసా? 


పోషకాలెన్నో... 

బొప్పాయిని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇందులో అనేక పోషకాలు, ఫైబర్‌లతో పాటు... ఫోలేట్‌, బీ6, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌ ఎ, సీ, బీ1, బీ3, ఇ, కే, పొటాషియం ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కేన్సర్‌ కారకాలను అడ్డుకొంటాయి. బొప్పాయి ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. డెంగ్యూ రోగుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచడంలో ఇవి బాగా పనిచేస్తాయంటారు. 


వైరస్‌లపై పోరాటం... 

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు విరివిగా ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, మనకు వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇందులోని సి, ఇ- విటమిన్లు, యాటీ యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాల్లో శ్వాససంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. జ్వరం, గొంతు మంట, నొప్పి, జలుబు వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


కొవ్వును కరిగిస్తాయి... 

ఈ పండులో సి, ఇ విటమిన్లతో పాటు బీటా కెరోటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి శరీరంలో కొవ్వును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. అలాగే బొప్పాయి రక్తనాళాలను శుభ్రం చేసి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 


క్యాలరీలు తక్కువ... 

బొప్పాయిలో సమృద్ధిగా ఉండే పొటాషియం హైబీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు బొప్పాయిలో క్యాలరీలు తక్కువ. కనుక ఈ పండు తింటే బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు.


Updated Date - 2020-07-13T05:30:00+05:30 IST