Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోరాడే స్ఫూర్తిని పార్టీ కేడర్‌లో నింపండి!

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

‘కోవూరు’ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు 

బుచ్చి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ


నెల్లూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ‘‘వైసీపీ అరాచకాల వల్ల గెలిచే అవకాశాలు ఉన్నా గెలవలేకపోయాం. ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనే విధంగా సిద్ధంగా ఉండాలనే సత్యాన్ని లోకల్‌ బాడీ ఎన్నికలు మనకు స్పష్టం చేశాయి. బుచ్చి మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ  కేడర్‌, నాయకులు బాగానే కష్టపడ్డారు. రాజకీయాల్లో గెలిస్తేనే మనం పడిన కష్టానికి గుర్తింపు. ఆ విషయాన్ని నాయకులందరూ గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు 2023లో రావచ్చు.. 24లో రావచ్చు.. ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి. అరాచకాలను ఎదుర్కొని పోరాడే స్ఫూర్తిని కేడర్‌లో నింపండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నుంచి తెలుగుదేశం గెలిచి తీరాలి. ఆ దిశగా ఈ రోజు నుంచే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోండి.’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు సూచించారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమీక్షించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బుచ్చి మున్సిపాలిటీలో గెలిచే అవకాశం ఉన్నా వైసీపీ బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల అది చేజారిపోయిందన్నారు. అప్పటికి నాయకులు, కార్యకర్తలు గట్టిగా పోరాడారన్నారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా ప్రజలు మన పార్టీ పట్ల అభిమానం ప్రదర్శించారన్నారు. అసెంబ్లీ ఓట్ల శాతంతో పోల్చితే బుచ్చి ఎన్నికల్లో 3 శాతం ఓట్లు పెరిగడం ప్లస్‌ పాయింట్‌ అన్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ పనిచేయాలన్నారు. ఏ రోజైనా అసెంబ్లీ ఎన్నికలు  రావచ్చు, అరాచక శక్తులు ఆ ఎన్నికల్లో కూడా విజృంభించవచ్చు, వాటన్నింటిని ఎదుర్కొనే విధంగా టీమును సిద్ధం చేసుకోవాలని నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఒక్కటే మీ పనితీరుకు ప్రమాణికం అన్న విషయాన్ని ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలన్నారు. మున్సిపల్‌, జెడ్పీ, పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన వైఫల్యాలను, బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు కోవూరు నియోజకవర్గ నాయకులను ఆదేశించారు. ఈ సమావేశంలో కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బుచ్చి పరిధిలోని టీడీపీ నాయకులు, క్లస్టర్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరించిన నాయకులు, నియోజకవర్గం పరిధిలోని ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.  


Advertisement
Advertisement