‘పోర్న్‌స్టార్ మార్టిని’ నుంచి ఆర్యాన్ ఖాన్ వరకు.. ఈ ఏడాది గూగుల్‌ థింగ్స్ ఇవే!

ABN , First Publish Date - 2022-01-01T02:25:20+05:30 IST

మరో వత్సరం కరిగిపోతోంది. ఈసారి కూడా కరోనా కలవరం తగ్గలేదు సరికదా.. ఒమైక్రాన్ రూపంలో..

‘పోర్న్‌స్టార్ మార్టిని’ నుంచి ఆర్యాన్ ఖాన్ వరకు.. ఈ ఏడాది గూగుల్‌ థింగ్స్ ఇవే!

న్యూఢిల్లీ: మరో వత్సరం కరిగిపోతోంది. ఈసారి కూడా కరోనా కలవరం తగ్గలేదు సరికదా.. ఒమైక్రాన్ రూపంలో మరో భూతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అయినప్పటికీ నిబ్బరం సడలిపోని ప్రజలు చేదు గురుతులను ఇక్కడే వదిలేసి కోటి ఆశలతో కొత్త ఏడాది లోకి అడుగుపెడుతున్నారు. రారమ్మంటూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు.


సరే.. నిజానికి గడచిన కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈసారి గూగుల్ మీద ఆధారపడడం పెరిగింది. ఈ సువిశాల విశ్వంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా వెంటనే గూగుల్ చెప్పేస్తోంది. కాబట్టే గూగుల్‌పై ఆధారపడే వారు పెరిగిపోయారు. ఎవరు దేని గురించి వెతికినా వాటన్నింటినీ రికార్డు చేసి చెప్పే గూగుల్ తల్లి.. 2021లో జనం ఎక్కువగా దేని గురించి వెతికారో బయటపెట్టేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

 

ఈ ఏడాది అత్యధికంగా వెతికిన మూడింటిలో ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అయితే, రెండోది కొవిన్ గురించి. మూడోది ఐసీసీ టీ20 ప్రపంచకప్ గురించి. ఇందులో మొదటిది, చివరిది క్రికెట్ గురించి. అంటే మిగతా విషయాలతో పోలిస్తే క్రికెట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా కనిపించింది. రెండోది కొవిన్ యాప్‌కు సంబంధించిన సమాచారం గురించి. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యాక టీకాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలా వేయించుకోవాలి? రిజిస్ట్రేషన్ ఎలా వంటి వివరాలను ఎక్కువ మంది తెలుసుకున్నారు.

 

ఇక టాప్ సెర్చ్‌లలో కరోనా మహమ్మారి నిలిచింది. ఏప్రిల్-మే నెలల్లో దేశాన్ని వణికించిన కొవిడ్ గురించి ఎక్కువమంది భారతీయులు వెతికారు. ఆక్సిజన్ స్థాయులను ఎలా పెంచుకోవాలి? ఇంట్లోనే ఆక్సిజన్‌ను ఎలా తయారుచేసుకోవాలి? దగ్గరలో ఆక్సిజన్ సిలిండర్లు దొరకుతాయా? వంటి వాటి గురించి ఎక్కువమంది శోధించారు. కరోనా కారణంగా ఏర్పడిన భయం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆందోళనను ఇది తెలియజేస్తోంది.


సెలబ్రిటీలకు ఏం జరిగినా అది పెద్ద వార్తే. కాబట్టే వారికి చీమ కుట్టినా అది బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోతుంది. దీంతో వారికి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత అభిమానుల్లో కనిపిస్తుంది. అలా ఈసారి గూగుల్ థింగ్స్‌లో నిలిచాడు బాలీవుడ్ స్టార్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ వార్త.. ఒక్క సినిమా రంగానికే పరిమితం కాలేదు. రాజకీయంగానూ పెను ప్రకంపనలు సృష్టించింది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆర్యన్ ఖాన్ గురించి ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఎక్కువమంది వెతికారు.

 

అలాగే, షెహనాజ్ గిల్, పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా, ఇటీవల నటి కత్రికా కైఫ్‌ను పెళ్లాడిన విక్కీ కౌశల్ గురించి ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేశారు. అలాగే, టోక్యో ఒలింపిక్స్, నీరజ్ చోప్రా గురించి కూడా సెర్చ్ చేశారు. ఈ ఏడాది ఓటీటీలో అత్యధిక సినిమాలు విడుదల కావడంతో వాటి గురించి ఎక్కువమంది వెతికారు. ముఖ్యంగా దేశం దృష్టిని ఆకర్షించిన తమిళ  సినిమా ‘జై భీమ్’ గురించి తెలుసుకునేందుకు ఎక్కుమంది ఆసక్తి కనబరిచారు. ఆ తర్వాత ఎక్కువగా శోధించింది ‘షేర్షా’, అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ గురించే.

 

 ఆహారం విషయానికి వస్తే ‘మేథీ మటర్ మలాయ్’, ‘మటర్ పన్నీర్’, ‘చికెన్ సూప్’ వంటి వాటిని గురించి ఎక్కువమంది వెతికారు. ఇక డ్రింక్స్ విషయానికి వస్తే ‘పోర్న్‌స్టార్ మార్టిని’ కోసం ఎక్కువ మంది గూగుల్‌లో వెతికారు.  

Updated Date - 2022-01-01T02:25:20+05:30 IST