Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫోన్‌ పట్టుకుంటే పోర్న్‌

  • చైల్డ్‌ పోర్నోగ్రఫీ విచ్చలవిడి వినియోగం
  • నిషేధం ఉన్నా.. ప్రత్యేక లింకుల్లో భద్రం
  • దేశవ్యాప్తంగా ప్రత్యేక నెట్‌వర్క్‌
  • లింకుల ద్వారా అమ్మకాలు
  • యువకులదే ప్రధాన పాత్ర
  • నగరంలోనూ వెలుగుచూస్తున్న కేసులు


నీలిచిత్రాల వీక్షణాన్ని వ్యసనంగా మార్చుకున్న ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లోని గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ కోసం వెతికాడు. నేరమని ఎదురుగా హెచ్చరిక కనిపించింది. అయినా అదే పనిగా చూశాడు. సమాచారం సైబర్‌ క్రైం విభాగానికి అందింది. 


ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఓ యువకుడు ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత ఖాళీగా ఇంట్లోనే ఉంటూ చైల్డ్‌ పోర్నోగ్రఫీని అమ్ముతానని ప్రకటన ఇచ్చాడు. చివరికి సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కాడు. 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : యువకులు కంప్యూటర్ల ముందు కూర్చున్నా.. చేతుల్లో ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు పట్టుకున్నా.. అశ్లీల వీడియోలు చూడటా నికే మొగ్గు చూపుతున్నారు. పోర్నోగ్రఫీ నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సమయంలో కొన్ని దేశాలు ఆ వెబ్‌సైట్లను నిషేధించాయి. అశ్లీల వెబ్‌సైట్లను పూర్తిగా నిషేధించకపోయినా 18 ఏళ్లలోపు వారికి సంబంధించిన పోర్నోగ్రఫీని అయినా ఆపాలని ప్రపంచదేశాలు తీర్మానించాయి. వాటికి సంబంధించిన అన్ని వెబ్‌సైట్లను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బ్లాక్‌ చేసింది. అయినా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో 18ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా పోర్నోగ్రఫీ వైపు మళ్లుతున్నారని తేలింది. ‘వెల్‌కం టు వీడియో’ పేరుతో నిర్వహించే అశ్లీల వెబ్‌సైట్లలో 2కోట్ల50లక్షల మంది మైనర్లకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నాయని సమాచారం. వీటికి సంబంధించి అనేక లింక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.  

కట్టడికి భారీ నెట్‌వర్క్‌

పోర్నోగ్రఫీకి అలవాటుపడిన వ్యసనపరులంతా ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. వాటికి సంబంధించి ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో ఇలాంటి వాట్సాప్‌ గ్రూపులు 5లక్షల నుంచి 6లక్షలకు పైగా ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ లింక్‌ను కామన్‌ స్నేహితుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి చేరవేస్తున్నారు. అందులోనే వీడియోలను షేర్‌ చేసుకుంటున్నారు. కేంద్రం చైల్డ్‌ పోర్నోగ్రఫీని పూర్తిగా కట్టడి చేశాక ఈ వీడియోలకు డిమాండ్‌ పెరిగింది. వీటిని ప్రత్యేక లింక్‌ల్లో భద్రపరుచుకుంటున్నారు. ఏ సెర్చ్‌  ఇంజన్‌లో వెతికినా ఇవి కనిపించవు. ఆయా లింక్‌ల్లో ఉన్న వీడియోలను బట్టి వాటికి ఖరీదు నిర్ణయిస్తున్నారు. ఒక్కో లింక్‌ ఖరీదు రూ.1,000, 2వేల నుంచి రూ.5వేల వరకు పలుకుతోంది. ఉదాహరణకు... ఒక యువకుడు మరో యువకుడి నుంచి చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన లింక్‌ రూ.1,000 కొన్నాడు. ఈ లింక్‌ను కొన్న యువకుడు దాన్ని రూ.2వేల నుంచి 3వేలకు మరొకరికి విక్రయిస్తున్నాడు. పెట్టిన పెట్టుబడి తక్షణమే రావడంతో పాటు లాభం భారీగా కనిపిస్తుండటంతో యువకులు అదే పనిగా ఆన్‌లైన్‌లో అశ్లీలతను అమ్మకానికి పెడుతున్నారు. రెండు రోజుల క్రితం సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కిన సోహెల్‌ అనే యువకుడు కూడా ఇదే పని చేశాడు.  


నిఘాకు వలంటీర్లు

చైల్డ్‌ పోర్నోగ్రఫీ గురించి ఇంటర్నెట్‌లో వెతుకుతున్న ఐపీలను గుర్తించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా వలంటీర్లను నియమించింది. ఇందులో ఇంజనీరింగ్‌ పట్టభద్రులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నవారున్నారు. ఈ వలంటీర్లకు సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ ఒక సాంకేతిక సదుపాయాన్ని కల్పిస్తోంది. దానిద్వారా ఎవరెవరు చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ ఇంజన్లలో వెతుకుతున్నారో తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని సైబర్‌ క్రైం విభాగాలకు వెంటనే అందుతుంది.


నిరంతరం నిఘా

చైల్డ్‌ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. ఇందుకోసం మనదేశంలో హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కంప్యూటర్‌, ట్యాబ్‌, సెల్‌ఫోన్‌ ఇలాంటి వాటిలో ఎలాంటి చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూసినా మొత్తం సమాచారం ఢిల్లీలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలుస్తుంది.- కాగిత శ్రీనివాసరావు, సైబర్‌ నేర పరిశోధన విభాగ ఇన్‌స్పెక్టర్‌

Advertisement
Advertisement