Sep 29 2021 @ 00:24AM

Posani: నన్ను విమర్శించు.. కుటుంబం జోలికి రావద్దు!

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ తదితర అంశాలపై వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. పవన్‌కు కౌంటర్‌గా వైసీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. సోమవారం సినీ నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పవన్‌ను విమర్శించారు. పవన్‌ అభిమానులు తనను టార్గెట్‌ చేసి ఆరోపణలు చేస్తున్నారని పోసాని మంగళవారం మరోసారి మీడియా ముందుకొచ్చారు. విమర్శించడాన్ని పవన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గడిచిన 24 గంటల్లో కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్‌ కాదు. కేసీఆర్‌ బహిరంగంగా మిమ్మల్ని హెచ్చరించిన సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు. 


అతనొక నియంత అనుకుంటారు..

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌ జరుగుతుంటే రాత్రి షెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. నేను సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లిపోతా. ఆరోజు 9 గంటల వరకూ పవన్‌ రాలేదు. ఇంటికెళ్లి భోజనం చేస్తుంటే ఆయన ఫోన్‌ చేశారు. ‘ఏవండీ మేము పిచ్చోళ్లమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు?’ అంటూ గట్టిగా అరవడం మొదలెట్టారు. నాకు కోపం వచ్చింది. ‘మీరు 10గంటలకు వస్తే మేము అప్పటివరకూ ఆగాలా? నేను కూడా ఆర్టిస్ట్‌నే. 9గంటల వరకూ చూశా. ‘నువ్వే రాలేదు’ అని కూడా కాస్త గట్టిగానే మాట్లాడాను! ఫలితంగా నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. పవన్‌కల్యాణ్‌ ప్రజల మనిషి కాదు. ఇండస్ర్టీ మనిషి అంతకన్నా కాదు. అతనొక నియంత అనుకుంటారు. కేవలం తనని తాను ప్రేమించుకుంటారు. అలాంటి వ్యక్తి జగన్‌తో పోల్చుకుంటారా? పవన్‌ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీని విమర్శిస్తున్నారు. నేను జగన్‌కు అభిమానిని. ఆయన్ను ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది. మీ అభిమానుల్లా నేను అసభ్య పదజాలంతో మాట్లాడను. మీ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చినందుకు మీ అభిమానులు ఫోన్‌, మెసేజ్‌లతో మాటల దాడులు మొదలుపెట్టారు. వారిని సరైనా దారితో పెట్టండి. మీరు, మీ ఫాన్స్‌ సైకోలు. ఇతర హీరోల ఫంక్షన్‌లకు వెళ్లి ‘పవన్‌.. పవర్‌స్టార్‌’ అని అరుస్తుంటారు. పవన్‌కల్యాణ్‌.. నీ సైకో ఫ్యాన్స్‌కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. రాజకీయాల్లో నా గురించి మాట్లాడు. నన్ను టార్గెట్‌ చెయ్‌. నాది తప్పు అయితే, నీకు దండం పెడతా. నా కుటుంబ సభ్యులను ఈ వివాదంలో లాగొద్దు. పవన్‌కల్యాణ్‌ నా ఇంటి తలుపుకొట్టాడు కాబట్టే నేను నోరు ఎత్తుతున్నాను. ఆయన ఇష్టం  వచ్చినట్లు మాట్లాడవచ్చా.. నేను మాట్లాడకూడదా? నా స్పందనకు ప్రతి స్పందనగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడితే సరే.. నాపై మీ అభిమానుల దాడి ఇలాగే కొనసాగితే.. అవే తిట్లు చిరంజీవి ఇంటికి వెళ్లి తిడతాను. చిరంజీవి నీ తమ్ముడిని అదుపులో పెట్టుకో. 

అబద్ధమైతే చెంప పగలకొట్టండి! 

చిరంజీవి పార్టీ పెట్టి పొరపాటు చేశారు. అందుకు జనం శిక్షించారు. అదంతా అయిపోయింది. ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించకూడదు. పార్టీ పెట్టిన సమయంలో ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే.. ఓ వేదికపై చిరంజీవి కుటుంబం, కూతుళ్ల గురించి కేశినేని నాని తీవ్రంగా విమర్శించారు. కన్నబాబు ద్వారా నాకు ఆ విషయం తెలిసింది. ఏ సంబంధం లేకపోయినా ‘నాని నువ్వు చేసింది తప్పు’ అని నిలదీశాను. దానితో నాని ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ సందర్భంలో ‘పోసాని నా గుండెల్లో ఉన్నాడయ్యా’ అంటూ చిరంజీవి తన సన్నిహితుల దగ్గర అన్నారట. ఆ రోజు మీ ఇంటి బిడ్డలను వేరేవాళ్లు అన్నన్ని మాటలు అంటుంటే పవన్‌ కల్యాణ్‌ అతని అభిమానులు ఏమైపోయారు? ఎక్కడ ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి? అన్నది పవన్‌కు తెలియదు. మరో సందర్భంలో బెల్లంకొండ సురేశ్‌ చిరంజీవిని ఏదో అన్నారని, అభిమానులు ఆగ్రహంతో మాట్లాడారు. ‘ఇది సినిమా ఇండస్ర్టీ విషయం మీకు సంబంధం లేదు’ అని చిరంజీవి వారిని మందలించి పంపించేశారు. ఆ విధానం మీలో లేదు. మిమ్మల్ని మారమని నేను చెప్పడం లేదు. మీరు మారరని నాకు తెలుసు. కాస్త విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోండి. మీరు అలా అంటే.. వీళ్లు ఇంకోలా మాట్లాడతారు. మీరు ప్రస్తావించిన అంశాల్లో ఒకటైనా నిజం ఉందా? పెద్ద హీరో అయిన మీరు అలా అనిపించుకోవడం బాగుందా? మీ రెమ్యునరేషన్‌ ఎంతో కూడా చెప్పలేకపోయారు. ‘కనీసం 10 అనుకోండి’ అన్నారు. 10 కాదు 15 ఇస్తా నాలుగు సినిమాలు చేస్తారా? మీ రెమ్యునరేషన్‌ రూ.50కోట్లు కాదా? అబద్థమైతే నా చెంప పగలకొట్టండి. ఇప్పుడు జరుగుతున్న రాద్దాంతంతో సినిమారంగం నన్ను బ్యాన్‌ చేేస్త, ఒక్క మాట కూడా మాట్లాడను.