కేసీఆర్‌తోనే హైదరాబాద్‌ సురక్షితం

ABN , First Publish Date - 2020-11-22T09:57:58+05:30 IST

సీఎం కేసీఆర్‌ వల్లే హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేకుండా.. ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, దర్శకుడు ఎన్‌.శంకర్‌ అన్నారు.

కేసీఆర్‌తోనే హైదరాబాద్‌ సురక్షితం

హిందూ ధర్మాన్ని పాటిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడుతున్నారు

గ్రేటర్‌లో టీఆర్‌ఎ్‌సను గెలిపించాలి: పోసాని కృష్ణమురళి

ప్రజలను విడగొట్టే రాజకీయాలు చేయొద్దు: ఎన్‌.శంకర్‌ 


పంజాగుట్ట, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ వల్లే హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేకుండా.. ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, దర్శకుడు ఎన్‌.శంకర్‌ అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటేనే మత కలహాలు జరుగుతాయని గతంలో చెప్పుకునే వాళ్లని,  ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అవి తగ్గాయని తెలిపారు. ఆ తర్వాత కేసీఆర్‌ హయాంలోనే శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కావాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సనే గెలిపించాలని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో వారు ‘మీట్‌ ది ప్రెస్‌’లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ హిందూ ధర్మాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారని, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడింది.. వారంటే ఇష్టంలేక కాదని, కొంతమంది పాలకుల తీరుపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసేవారని తెలిపారు.


కేసీఆర్‌ వస్తే ఆంధ్ర ప్రజల భూములు, ఇళ్లు లాక్కుంటారనే ప్రచారం జరిగిందని, కానీ.. ఇన్నాళ్లుగా ఏ ఒక్క ఆంధ్ర బిడ్డపై దాడి జరిగిన దాఖలాలు లేవని అన్నారు. అన్నదమ్ముల్లా సఖ్యతగా ఉంటున్నారని తెలిపారు. ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ నేలకు ఉద్యమ పోరాటం, ఉద్యమ చైతన్యం అన్నీ ఉన్నాయని, అహింసా మార్గం ద్వారా కేసీఆర్‌ తెలంగాణను సాధించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత వేగంగా అభివృద్ధి చెందలేదన్నారు. నగరంలో అద్భుతమైన వాతావరణాన్ని కేసీఆర్‌ సృష్టించారని, రౌడీయిజం, గూండాయిజం వంటి వాటికి తావులేకుండా చేస్తున్నారని ప్రశంసించారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వాటిని ప్రజలే తిప్పి కొడతారని వ్యాఖ్యానించారు. నాణ్యమైన రాజకీయాలు చేయాలని, ప్రజలను విడగొట్టే రాజకీయాలు చేయవద్దని కోరారు. తమ పార్టీ గెలవాలనుకుంటే తమ విజన్‌ ఏంటో చెప్పాలన్నారు. ‘‘మీరు మాట్లాడే భాష బాగాలేదు. వేదాలను పూజించేవారైతే వేద భాషలో మాట్లాడాలి’’ అని శంకర్‌ అన్నారు. 

Updated Date - 2020-11-22T09:57:58+05:30 IST