స్థాన బలం

ABN , First Publish Date - 2021-05-14T05:30:00+05:30 IST

‘నేలమీద కుక్కను చూసి భయపడే మొసలి నీళ్ళలో ఉంటే ఏనుగును కూడా పట్టేస్తుంది. తన బలం కన్నా స్థాన బలమే గొప్పది’ అంటాడు వేమన. నిత్య జీవితంలోనూ ఇది కనిపిస్తుంది...

స్థాన బలం

‘నేలమీద కుక్కను చూసి భయపడే మొసలి నీళ్ళలో ఉంటే ఏనుగును కూడా పట్టేస్తుంది. తన బలం కన్నా స్థాన బలమే గొప్పది’ అంటాడు వేమన. నిత్య జీవితంలోనూ ఇది కనిపిస్తుంది. పెంపుడు కుక్క వీధిలోకి వెళ్ళినప్పుడు ఊర కుక్క వెంట పడుతుంది. అది ‘కుయ్యి కుయ్యి’ అంటూ మూలుగుతూ, వేగంగా తన యజమాని పెరట్లోకి వచ్చి పడుతుంది. ఇక అప్పుడు పరుగు మాని, ఊర కుక్క మీదకు తిరగబడుతుంది. అదీ స్థాన బలం. అంటే సామాజిక బలం. తనకు అండగా మరి కొందరు ఉంటారనే ధైర్యమే గొప్ప మనో బలం. అందుకే శారీరక బలంకన్నా మనోబలమే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ధైర్యాన్ని చూపి, శత్రువు పీడ వదిలించుకున్న కోలంకి పిట్ట కథ ఇది.


రాజగృహలోని పక్షిపర్వతం సమీపంలో ఉన్న పొలాల్లో ఒక కోలంకి పిట్ట జీవిస్తూ ఉండేది. అది చాలా చిన్న పిట్ట. రైతులు నేల దున్నినప్పుడు, నాగళ్ళతో దమ్ము దుక్కులు దున్నినప్పుడూ లేచిన మట్టి పెళ్ళల మధ్య నివాసం ఏర్పాటు చేసుకొని, అక్కడ దొరికే క్రిమి కీటకాల్ని తింటూ, కోకిలలా దీర్ఘంగా రాగం తీస్తూ బతికే పిట్ట అది. అందుకే దాన్ని ‘నీటి కోయిల’ అని కూడా అంటారు. ఆ పిట్ట ఒక రోజు మట్టి పెళ్ళల మీద పురుగుల్ని తినడం మానేసింది. అడవిలో దొరికే మంచి పండ్ల మీదకు దాని మనసు మళ్ళింది. వెంటనే అడవిలోకి వెళ్ళి, ఒక చెట్టు కొమ్మ మీద వాలి, నేరేడు పండ్లను తింటూ... ఒక డేగ కంటపడింది. ఆ డేగ వేగంగా వచ్చి కోలంకి పిట్టను పట్టేసింది. 


అంత విపత్కర పరిస్థితిలోనూ కోలంకి తన ధైర్యాన్ని కోల్పోలేదు. ‘ప్రమాదం నుంచి ఎలా తప్పుకోవాలి?’ అని ఆలోచించింది. తనలో తను మాట్లాడుకుంటున్నట్టు... డేగకి వినబడేలా-


‘‘నేనెంత దురదృష్టవంతురాల్ని! ఈ అడవి నా జన్మస్థలం కాదు. అదే నా జన్మస్థానంలో ఉంటే నన్ను పట్టుకోవడం ఈ డేగవల్ల అయ్యేదే కాదు. అక్కడైతే ఈ డేగతో పోరాడి ఓడించేదాన్ని’’ అంది. 


ఈ మాటలు విన్న డేగకు రోషం పొడుచుకొచ్చింది. ‘‘ఓయీ అర్భకా! నీ జన్మస్థానం ఎక్కడో చెప్పు. నిన్ను అక్కడికే తీసుకుపోయి వదిలిపెడతాను. ఆ తరువాత వేటాడతాను. చీల్చుకు తినేస్తాను’’ అంది.


‘‘నాగళ్ళు దున్నిన చేలల్లో ఉన్న మట్టిపెళ్ళలే నా జన్మస్థానం’’ అంది కోలంకి.


‘‘అయితే పద...’’ అని డేగ కోపంతో లేచి, అడవి సమీపంలో, కొండ దిగువన ఉన్న దున్నిన చేలలో కోలంకిని వదిలిపెట్టింది. 


కోలంకి రివ్వున వెళ్ళి ఒక మట్టి పెళ్ళ మీద వాలింది. ‘‘రా! పట్టుకో చూద్దాం!’’ అంటూ డేగను రెచ్చగొట్టింది.


డేగ లేచింది. రెక్కలు దీర్ఘంగా చాచింది. వింటి నుంచి దూసుకొచ్చిన బాణంలా కోలంకి పిట్టవైపు దూసుకొచ్చింది. డేగ తన దగ్గరకు వచ్చేలోపే కోలంకి పిట్ట పైకి లేచి, ఒక పల్టీ కొట్టి, మట్టి పెళ్ళల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోకి క్షణాల్లో దూరిపోయింది. 


డేగ వేగంగా వచ్చింది. కోలంకిని పట్టుకొనే ప్రయత్నంలో తన వేగాన్ని ఆపుకోలేకపోయింది. మట్టి పెళ్ళలను ఢీకొట్టింది. దాని రొమ్ము పగిలింది. అక్కడికక్కడే కూలబడింది.


బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘మాతృభూమిని వదలకుండా... ఉపాయకుశలతతో వ్యవహరిస్తే వృద్ధి కలుగుతుంది. లేకుంటే వినాశనం మిగులుతుంది’’ అని ధర్మోపదేశం చేశాడు. ‘యోగ్యతలేని స్థానాలకు వెళ్ళే వృథా ప్రయత్నాన్ని మానండి’ అని చెప్పిన ఈ సందేశం ‘సకుణోవాద సూత్రం’గా, ‘సంయుత్తా నికాయం’లో ‘మహావగ్గ సుత్తం’గా ప్రసిద్ధి చెందింది.


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST