జిల్లాలో మరో నాలుగు కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-04-05T10:00:44+05:30 IST

కరోనా వణికిస్తోంది. జిల్లాలో రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శ

జిల్లాలో మరో నాలుగు కొత్త కేసులు

 ఒంగోలు 2, చీరాల, కారంచేడుల్లో ఒక్కో కేసునమోదు

21చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య

ప్రయివేట్‌ వైద్యశాలలకు పాజిటివ్‌ రోగులు

సీరియస్‌ అయితే నెల్లూరులోని కోవిడ్‌ ఆసుపత్రికే

చర్యలను ముమ్మరం చేసిన అధికారులు


కరోనా వణికిస్తోంది. జిల్లాలో రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు ఉండగా కొత్త వారితో కలిపి 21కి చేరింది. వీరిలో ఒకరు రిమ్స్‌లో వైద్యం పొంది పూర్తిగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జి కాగా మరో 20మంది ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు.


శనివారం ఒంగోలులో రెండు, చీరాలలో ఒకటి, కారంచేడు మండలం కుంకలమర్రులో మరొకటి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారే. కుంకలమర్రు, చీరాల, ఒంగోలులో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదు కాగా శనివారం వచ్చిన నాలుగు కేసుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకే ప్రాంతం నుంచి ఈ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటికే ఒంగోలులో హైఅలర్ట్‌ ప్రకటించారు.


ఒంగోలునగరం, ఏప్రిల్‌ 4: కరోనా మహమ్మారి ప్రబలుతోంది. శనివారం మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 21 పాజిటివ్‌ కేసులు జిల్లాలో వెలుగుచూసినట్లైంది. దీంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. కరోనా అటు చీరాల, ఇటు ఒంగోలు ప్రాంతాల్లో తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. జిల్లాలో ఇప్పటి రకు నమోదైన కేసుల్లో సగానికి పైగా ఈ రెండు కేంద్రాల్లోనే నమోదయ్యాయి. కొత్త కేసులు కూడా ఈ ప్రాంతాల నుంచే నమోదు అవుతుండటంతో వైద్యఆరోగ్యశాఖ, కార్పొరేషన్‌, పోలీసు అధికారులు దృష్టంతా ఈ రెండుప్రాంతాలపైనే ప్రధానంగా కేంద్రీకరించి నియంత్రణ చర్యలు చేపట్టారు.


పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ఒంగోలు ఇస్లాంపేటలో రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. వైద్య ఆరోగ్యసిబ్బంది ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు. పాజిటివ్‌ కేసులే కాకుండా అనుమానితులుగా గుర్తించటమో లేక పాజిటివ్‌ కేసులతో సన్నిహితంగా ఉంటూ కొద్దిరోజుల్లో కరోనా లక్షణాలు బయటపడే అవకాశం ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. క్వారంటైన్‌లకు కూడా ఈ రెండు ప్రాంతాల నుంచే అధికంగా నమోదవుతున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాలను అధికారులు  రెడ్‌జోన్‌లుగా ప్రకటించి నియంత్రణ చర్యలు అమలుచేస్తున్నారు. పాజిటివ్‌ కేసులతో వైద్యులు, పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు అనే వివరాలను సేకరించి వారిని కూడా పరీక్షించి క్వారంటైన్‌లకు తరలించేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా క్వారంటైన్‌ బాట పట్టిస్తున్నారు.  వైద్యసిబ్బంది మాత్రం చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 


రిమ్స్‌లోని పాజిటివ్‌ కేసులకు ప్రయివేట్‌ వైద్యశాలల్లోచికిత్స

రిమ్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పాజిటివ్‌ కేసులను ఇక నుంచి ప్రయివేట్‌ వైద్యశాలలకు తరలించనున్నారు. రిమ్స్‌లో కేవలం అనుమానిత రోగులను మాత్రమే ఉంచుకుని కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన రోగులను ఒంగోలులోని కిమ్స్‌, సంఘమిత్ర, నల్లూరి నర్శింగ్‌హోం, వెంకటరమణ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందించనున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అమల్లోకి తేవటం ద్వారా ప్రయివేట్‌ వైద్యశాలల్లో కూడా కరోనా రోగులకు సేవలు అందించాల్సి ఉంటుంది. దీంతో ఈ నాలుగు వైద్యశాలలను గుర్తించి ఇక నుంచి పాజిటివ్‌ రోగులకు ఇక్కడే చికిత్స అందించనున్నారు.


ఆయా ప్రయివేట్‌ వైద్యశాలల వైద్యులు, సిబ్బందే వీరికి చికిత్స అందించాల్సి ఉంది. కాగా కరోనా పాజిటివ్‌ రోగుల పరిస్థితి విషమంగా ఉంటే వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని కోవిడ్‌ 19 ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని రిమ్స్‌ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఇక నుంచి సీరియస్‌గా రోగులను నెల్లూరుకు, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగులను ఒంగోలులోని నాలుగు ప్రయివేట్‌ వైద్యశాలలో ఉంచి చికిత్స అందజేయనున్నారు. ఒంగోలు రిమ్స్‌లో కేవలం అనుమానిత రోగులను ఉంచి వారికి పరీక్షలు జరిపి నిర్ధారణ జరిగాక ప్రయివేట్‌ వైద్యశాలలకు తరలించనున్నారు. 


కొన్ని క్వారంటైన్‌లు మూత..

జిల్లాలో కరోనా అనుమానిత రోగులను ఉంచేందుకు అధికారులు మొత్తం 22 క్వారెంటైన్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని కేంద్రాలకు మాత్రమే అనుమానితుల సంఖ్య అధికంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లోని క్వారంటైన్‌లకు ఎక్కువగా తరలించాల్సిన అవసరం లేదు. దీంతో వాటిని మూసివేసే దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. శనివారం అద్దంకి క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి 121మందిని పంపించి వేశారు. అద్దంకి ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవటం, క్వారెంటైన్‌లో ఉన్నవారికి ఎలాంటి అనుమానిత లక్షణాలు లేకపోవటంతో 121మందిని ఇళ్ళకు పంపించేశారు. దీంతో అద్దంకిలోని క్వారెంటైన్‌ ఖాళీ అయి పోయింది. కాగా గిద్దలూరు ప్రాంతంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌లు కూడా అంతంతమాత్రంగానే అనుమానితులు ఉంటున్నారు. వీరికి కూడా ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించకపోవటంతో ఈ కేంద్రాన్ని కూడా త్వరలోనే మూసివేయనున్నారు.


కాగా చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో మాత్రం క్వారంటైన్లకు రోజురోజుకీ అనుమానితుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. చీరాల, ఒంగోలులో ఇస్లాంపేట ప్రాంతాల నుంచి పాజిటివ్‌గా తేలిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని, వారి నివాసాలకు చుట్టుపక్కల ఉన్నవారిని క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని క్వారెంటైన్‌లు కిటకిటలాడిపోతున్నాయి. కందుకూరు ఏరియాలో ఉన్న క్వారంటైన్‌లో కూడా ఎక్కువసంఖ్యలోనే అనుమానితులు ఉన్నారు. దీంతో ఎక్కువగా అనుమానితులు వస్తున్న ప్రాంతాల్లో అదనంగా కేంద్రాలను ప్రారంభించి, పాజిటివ్‌ కేసులు నమోదు కాని చోట మూసే దిశగా చర్యలు ప్రారంభించారు. 


నిజాముద్దీన్‌తో సంబంధించిన కేసులు 20.. ఇక్కరే ఇతరులు

జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 21 పాజిటివ్‌ కేసుల్లో 20 కేసులు ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్‌ కార్యక్రమానికి హాజరైన వారు, వారి బంధువులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి నుంచి నమోదయినవే కావటం విశేషం. ఒక్క ఒంగోలు యువకుడే వీరితో సంబంధం లేకుండా ఇతర దేశాల నుంచి వస్తూ కరోనా బారినపడ్డాడు. కాగా ఈ యువకుడు పూర్తిగా కోలుకోవటంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేశారు. రిమ్స్‌లో చికిత్సపొందుతున్న 20 మంది పాజిటివ్‌ రోగుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వీరిలో 8మందిని కిమ్స్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించబోతున్నామని తెలిపారు. 

Updated Date - 2020-04-05T10:00:44+05:30 IST