వలస కార్మికుడికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-13T06:33:25+05:30 IST

ముంబయి వలస కూలీలు జిల్లాకు వస్తుండటంతో ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్గటూర్‌ మండలం గుల్లకోటకు

వలస కార్మికుడికి పాజిటివ్‌

ముంబాయి నుంచి వస్తున్న వారితో కరోనా ముప్పు

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ రవి

హోం క్వారంటైన్‌పై పోలీసుల నిఘా


ఆంధ్రజ్యోతి, జగిత్యాల : ముంబయి వలస కూలీలు జిల్లాకు వస్తుండటంతో ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్గటూర్‌ మండలం గుల్లకోటకు చెందిన వ్యక్తి ఆదివారం జగిత్యాలకు రాగా, అనుమానంతో పరీక్షలు చేస్తే మంగళవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి, ఆయన వెంట వచ్చినవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో ఉంచారు.


దీంతో జిల్లా కలెక్టర్‌ రవి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై మరింత నిఘా పెట్టాలని ఆదేశించారు.  వారికి వైద్య పరీక్షలు చేసి, లక్షణాలు లేనట్లయితే హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆరు నెలల జైలు శిక్ష వేస్తాని హెచ్చరించారు. చేతికి స్టాంపులు వేయాలని, బయట తిరిగితే కేసులు పెట్టాలని ఆదేశించారు. దీనికితోడు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు క్వారంటైన్‌లో ఉండేలా నిఘా పెంచారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు పాజిటివ్‌ కేసులు బయటపడగా, అందులో ముగ్గురు డిశ్చార్జ్‌ కాగా, మరో వ్యక్తి వారం రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో మరో పాజిటివ్‌ రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


వెల్గటూర్‌ మండలం గుల్లకోటకు చెందిన వ్యక్తి (55) ఉపాధి నిమిత్తం ముంబాయి వెళ్లాడు. లాక్‌డౌన్‌ వల్ల అక్కడే చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ఐదుగురితో కలిసి రెండు కార్లలో ఆదివారం జగిత్యాలకు వచ్చారు. అయితే వీరు ముబాయిలో నివసిస్తున్న ప్రాంతంలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉంది. ధర్మపురి మండలం ఆరపెల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ సోకి అక్కడే మరణించాడు. వెల్గటూర్‌ మండలానికి చెందిన ఇద్దరు, గుల్లకోటకు చెందిన ఒకరు, ధర్మపురి మండలం ఆరపెల్లికి చెందిన ఒకరు, మంచిర్యాల జిల్లా ముర్రు మడుగుకు చెందిన ఒకరు, ఇటిక్యాలకు చెందిన ఒకరు, ముంబాయిలో చనిపోయిన వ్యక్తి నివసిస్తున్న ప్రాంతంలోనే ఉంటారు.


భయంతో ఈ ఆరుగురు రెండు కార్లను అద్దెకు తీసుకుని స్వగ్రామాలకు బయలుదేరారు. అక్కడే ఉన్న కొందరు జగిత్యాల జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి ఈ రెండు కార్లు జిల్లాకు చేరుకోగా, పోలీసులు అప్రమత్తమై జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. సోమవారం రక్త నమూనాలు తీసి పరీక్ష కోసం వరంగల్‌కు పంపగా, మంగళవారం ఫలితాలు వచ్చాయి. అందులో గుల్లకోటకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా, మిగిలిన ఐదుగురికి నెగెటివ్‌ వచ్చాయి.


ఇందులో ధర్మపురి మండలం ఆరపెల్లికి చెందిన ఓ మహిళ కూడా ఉంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ముంబాయి నుంచి వచ్చిన ఈ ఐదుగురు జిల్లాకు చేరుకోకముందే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు చేయడంతో ఒకరికి పాజిటివ్‌ బయటపడింది. ఇళ్లకు చేరినట్లయితే ప్రమాదం ముంచుకొచ్చేదని వైద్యాధికారులు పేర్కొన్నారు.


 ముంచుకొస్తున్న ముప్పు

జగిత్యాల, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్‌, బుగ్గారం, ధర్మపురి, కోరుట్ల ప్రాంతాల నుంచి ముంబాయికి ఎక్కువగా వెళ్లారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో జిల్లాకు 1,395 మంది చేరుకున్నట్లు అధికారులు ప్రకటించగా, అనధికారికంగా మరో వెయ్యి మందికి పైగా జిల్లాకు చేరుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ముంబాయిలో ఎక్కువగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ముంబాయి నుంచి వస్తున్న వారి పట్ల ప్రజల్లో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని రెండు, మూడు గ్రామాల్లో ప్రజలు ముంబాయి నుంచి వస్తున్నవారు ఇళ్లలోకి అనుమతించవద్దని ఆందోళన చేశారు.


హోం క్వారంటైన్‌లో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నా వసలకార్మికులు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది నిరుపేదలే ముంబాయికి వెళ్లగా అక్కడ కూడా పూర్తిగా స్లమ్‌ ఏరియాల్లో నివసిస్తుంటారు. స్థానికంగా వారికి సొంత గృహాలు కూడా లేవు. వీరంతా హోం క్వారంటైన్‌లో భౌతిక దూరం పాటించి ఉండేలా పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో రోజురోజుకు ముంబాయి నుంచి వలస కార్మికులు జిల్లాకు చేరుకుంటుండటంతో అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకుంటే జగిత్యాల జిల్లాకు మరింత ముంపు ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Updated Date - 2020-05-13T06:33:25+05:30 IST