Abn logo
Jun 18 2021 @ 03:51AM

కరోనాకు చెక్‌ పెట్టే మాత్ర!

  • సంవత్సరాంతానికి అందుబాటులోకి వచ్చే అవకాశం
  • దాదాపు రూ.23 వేల కోట్లతో అమెరికా పరిశోధనలు
  • ఫైజర్‌, అటియా ఫార్మా కంపెనీల ఔఫధాలతో ట్రయల్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): డేవిడ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్టులో పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే.. జ్వరం వస్తే పారాసెటమాల్‌ వేసుకోమన్నారు. విటమిన్‌ ట్యాబ్లెట్లు సిఫారసు చేశారు. ఇన్ఫెక్షన్‌ తగ్గుతుందో, పెరుగుతుందో, ఆక్సిజన్‌ అవసరమవుతుందో లేక వెంటిలేటర్‌ పెట్టే స్థాయికి పరిస్థితి విషమిస్తుందో అతనికే కాదు.. డాక్టర్‌కూ తెలియదు. ఇదీ ప్రస్తుతం కరోనా రోగుల పరిస్థితి.

డేవిడ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్టులో పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్‌ వద్దకు వెళ్లి చెప్పగానే యాంటీవైరల్‌ మాత్రలు సిఫారసు చేశారు. అవి వాడగానే లక్షణాలు నెమ్మదించాయి. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితే రాలేదు. 


అమెరికాలోని ప్రముఖ వైద్యుడు ఆంధోనీ ఫౌచీ ఊహిస్తున్న భవిష్యత్తు ఇది. ఇది వట్టి ఊహ కాదు. ఈ ఊహను నిజం చేసే దిశగా అమెరికా 320 కోట్ల డాలర్లతో (దాదాపు రూ.23 వేల కోట్లు) ఒక ప్రాజెక్టును తలపెట్టింది. గత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాక్సిన్లతో వైర్‌సకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్‌ వార్ప్‌స్పీడ్‌ పేరుతో వ్యాక్సిన్‌ కంపెనీలకు భారీగా నిధులు ఇచ్చి అమెరికన్ల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ యాంటీ వైరల్‌ మందులపై పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం గురించి అమెరికా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న యాంటీవైరల్‌ ఔషధాలతో నిర్వహిస్తున్న ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నట్టు వెల్లడించింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఏడాది చివరికే కొవిడ్‌ను నయం చేసే యాంటీ వైరల్‌ మందుబిళ్లలు అందుబాటులోకి వస్తాయి. పాత ఔషధాలతో క్లినికల్‌ ట్రయల్స్‌తోపాటు.. భవిష్యత్తులో మహమ్మారులుగా పరిణమించే వైర్‌సలకు చెక్‌పెట్టే కొత్త ఔషధాలను కనిపెట్టడానికి కూడా ‘ద యాంటీవైరల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ పాండెమిక్స్‌’ సహకరిస్తుందని అధికారులు తెలిపారు.


ఉన్నవాటితో..

ప్రస్తుతం ఇన్‌ఫ్లూయెంజా, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సి వంటి వైర్‌సలకు మాత్రలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. కరోనా మహమ్మారి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోతున్నా దానికి అడ్డుకట్ట వేసే మాత్రలేవీ ఇంతవరకూ రాలేదు. కరోనా వచ్చిన కొత్తల్లో ఈ యాంటీ వైరల్‌ మందులను ఆస్పత్రిపాలైనవారికి ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. కానీ, అవన్నీ విఫలమయ్యాయి. ఎబోలా కోసం తయారుచేసిన రెమ్‌డెసివిర్‌ మాత్రం కొద్దిగా ప్రభావం చూపగలిగింది.  ‘వెనిజులియెన్‌ ఈక్వైన్‌ ఎన్‌కెఫలైటి్‌స వైర్‌స’కు విరుగుడుగా.. 2019లో ఎమొరీ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన మోల్నుపిరవిర్‌ మాత్రలు కూడా తొలి దశలో కొంతవరకూ పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఆస్పత్రిపాలైనవారికి మాత్రం అవి పనిచేయట్లేదని ట్రయల్స్‌లో తేలింది. అప్పుడు శాస్త్రవేత్తలకు ఒక విషయం అర్థమైంది. కరోనా వైర్‌సను అడ్డుకోవాలంటే.. అది వ్యక్తులకు సోకిన తొలినాళ్లలోనే, తనను తాను రెట్టింపు చేసుకునే సమయంలోనే యాంటీ వైరల్‌ మందులు ఇవ్వాలి తప్ప వైరల్‌ లోడ్‌ పెరిగిపోయి ఆస్పత్రిపాలైనవారికిస్తే ఏ ఉపయోగమూ లేదని వారికి తెలిసింది. 


అందుకే.. అలాంటి (వైరస్‌ తనను తాను రెట్టింపు చేసుకోవడాన్ని నిరోధించే) మందును తయారుచేయడం కోసమే ఇప్పుడు అమెరికా ప్రయత్నం మొదలుపెట్టింది. అలాంటివాటిలో.. అటియా ఫార్మా అభివృద్ధి చేసిన ‘ఏటీ-527’ మందు బాగా పనిచేస్తోందని సమాచారం. హెపటైటిస్‌ సి పై ఈ మందు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. అది కొవిడ్‌కు కూడా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో రోచె సంస్థ ఈ మందుపై హ్యూమన్‌ ట్రయల్స్‌ చేయడానికి అటియాతో జట్టు కట్టింది. అలాగే.. ఫైజర్‌ కంపెనీ సార్స్‌ కోసం గతంలో తయారుచేసిన మరో మందులోని మాలిక్యూల్‌ ‘పీఎ్‌ఫ-07321332’ ఆధారంగా రూపొందించిన ఔషధం ఎలుకలపై బాగా పనిచేస్తోందని తేలింది.  ఫైజర్‌ దీనిపై మార్చిలో హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది. వచ్చే నెల నుంచి రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి.

   -  సెంట్రల్‌ డెస్క్‌