‘పోస్టు కొవిడ్‌’... ప్రాణాంతకం!

ABN , First Publish Date - 2021-06-21T10:47:32+05:30 IST

సాధారణంగా కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత బాధితులకు నీరసం, గ్యాస్‌ సమస్యలు, తలనొప్పి, కీళ్లనొప్పులు, త్వరగా అలసిపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. వీటితో పాటు యాంగ్జయిటీ, డిప్రెషన్‌, నిద్ర లేమి, చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి.

‘పోస్టు కొవిడ్‌’... ప్రాణాంతకం!

భారీగా పెరుగుతున్న షుగర్‌ లెవల్స్‌

గుండెపోటుతో ఆకస్మిక మరణాలు

బాధితులకు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు  

మోతాదుకు మించి ఆక్సిజన్‌ ఇవ్వడం, అనవసరంగా స్టెరాయిడ్‌ల వాడకం

అనారోగ్య సమస్యలకు కారణాలివే...

ముందు జాగ్రత్తలతో తప్పనున్న ముప్పు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

సాధారణంగా కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత బాధితులకు నీరసం, గ్యాస్‌ సమస్యలు, తలనొప్పి, కీళ్లనొప్పులు, త్వరగా అలసిపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. వీటితో పాటు యాంగ్జయిటీ, డిప్రెషన్‌, నిద్ర లేమి, చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. తగిన మందులు వాడుతూ, జాగ్రత్తలు తీసుకుంటే రెండు మూడు నెలల్లో వీటినుంచి బయటపడొచ్చు. ఇవి కాకుండా చాలామంది పోస్టు కొవిడ్‌లో ప్రాణాంతక సమస్యల బారినపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ భారీగా పెరగడం, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం, బ్లాక్‌ ఫంగస్‌ సోకడం వంటి సమస్యలు నిశ్శబ్దంగా ప్రాణాలు తీసేస్తున్నాయి. కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాత, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన రెండు మూడు రోజుల్లో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.


ఈ ఆకస్మిక మరణాలకు పోస్టు కొవిడ్‌ సమస్యలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన సమయంలో బాధితులకు అవసరం లేకపోయినా ఎక్కువ మోతాదులో ఆక్సిజన్‌ ఇవ్వడంతో పాటు స్టెరాయిడ్‌లు పరిమితికి మించి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల బాధితుల్లో సైటోక్రైమ్‌స్టామ్‌ ఇన్ఫెక్షన్‌లు పెరిగిపోతున్నాయి. ఇది శరీరంలో షుగర్‌ లెవల్స్‌ను భారీగా పెంచుతుంది. సాధారణంగా మన శరీరంలో 140 నుంచి 180 మధ్యలో షుగర్‌ లెవల్స్‌ ఉంటాయి. కానీ సైటోక్రైమ్‌స్టామ్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఈ స్థాయులు 500 నుంచి 650కు చేరుతాయి. దీనివల్ల కిడ్నీ, లివర్‌, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలోకి చేరతారు. కాబట్టి ప్రమాదాన్ని ముందే అంచనా వేయాలి. ఎప్పటికప్పుడు సీఆర్‌పీ, డి-డైమర్‌, ఎల్‌డీహెచ్‌ ఫెరిటిన్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి. కనీసం 3నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 


తరచుగా షుగర్‌ పరీక్షలు 

కొవిడ్‌ నుంచి బయటపడాలంటే స్టెరాయిడ్‌ల వాడకం తప్పనిసరి. ఇవి వాడిన వారిలో 90శాతం మందికి షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. కొంతమందికి స్టెరాయిడ్‌ల వాడకం ఆపేసిన వెంటనే ఇవి అదుపులోకి వస్తాయి. కానీ కొవిడ్‌ రాకముందే షుగర్‌ ఉండి, దానిని గుర్తించనివారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కొవిడ్‌ బారినపడిన ప్రతి ఒక్కరూ రెండు, మూడు నెలల పాటు ప్రతి 15 రోజులకోసారి షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


గుండెపోటుతో మృత్యువాత 

కొవిడ్‌ తగ్గిన తర్వాత వచ్చే సమస్యల్లో గుండెపోటు ప్రధానమైనది. కరోనా సోకిన వారిలో ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటుంది. స్టెరాయిడ్‌లు అధికంగా వాడటంతో శరీరంలో రక్తం గడ్డకడుతుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తున్న కొంతమంది వైద్యులు బాధితులకు రక్తం పలచబడే మందులు ఇస్తున్నారు. ఇది కొంత మేర ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చాలామంది ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. దీనిని ముందుగానే గుర్తించాలంటే డీ-డైమర్‌ పరీక్ష కచ్చితంగా చేయించుకోవాలి. దీనివల్ల రక్తంలో ఇన్ఫెక్షన్‌ ఏ స్థాయిలో ఉందో గుర్తించి ముందుగానే జాగ్రత్త పడవచ్చు. 


బ్లాక్‌ ఫంగ్‌సతో మరీ ముప్పు 

సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ తర్వాత వచ్చే బ్లాక్‌ ఫంగస్‌ ప్రాణాంతకంగా మారింది. ఎంత ఖర్చు చేయడానికయినా సిద్ధంగా ఉన్నవారికి కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి. ఈ చికిత్సకు అవసరమైన యాంపోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉపయోగించే వారి ముక్కు, దాని పైభాగంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రదేశాల్లో ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ పెరుగుతుంది. దీనికితోడు షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండటం దీనికి మరింత శక్తిని ఇస్తుంది. బ్లాక్‌ ఫంగ్‌స కు తేమ, షుగర్‌ న్యూట్రిషన్‌లా పని చేస్తాయి.  ముక్కులో ఉన్నప్పుడే లక్షణాలను గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడినట్లే. 

Updated Date - 2021-06-21T10:47:32+05:30 IST