పంచనామా

ABN , First Publish Date - 2020-07-13T05:58:39+05:30 IST

అనుభవాల పుట్టలో వేలెట్టి జ్ఞాపకాల చీమతో కుట్టించుకున్నోణ్ణి క్షమించండి మిత్రులారా!...

పంచనామా

అనుభవాల పుట్టలో వేలెట్టి

జ్ఞాపకాల చీమతో కుట్టించుకున్నోణ్ణి

క్షమించండి మిత్రులారా!


మీ జీవితాన్ని బహిర్గతం చేస్తున్నవాణ్ణి

మీ అనుమతి పత్రం లేకుండా

మీ జీవన చిత్రం గీస్తున్నవాణ్ణి

వాస్తవాల్ని తవ్విపోస్తున్న వాణ్ణి.


పది పైసలకి బిందెనీళ్లు

ఇంటింటికీ మోసి మోసి

బిడ్డను ఇంజనీరు చేసిన తల్లిని

వృద్ధాశ్రమంలో ఏకశిలా విగ్రహంలా

స్వరపేటిక కోల్పోయిన

మౌన మహర్షిణిలా

సమాధి చేయని జీవచ్ఛవంలా

వయసు చెదపట్టిన మాంసం చెట్టులా

చూడలేకపోతున్నవాణ్ణి.


ఆత్మగొంతుకతో అరుస్తున్నవాణ్ణి

క్షమించండి మిత్రులారా!

నిజస్వరూపాల్ని ఆవిష్కరిస్తున్నవాణ్ణి.


కళని తడి ఆరని మడి చేసి

కలల పంటల కోసం కమిలిపోయి

నిలువెల్లా చెమటగా కరిగిపోయి

ముక్కలు మోస్తున్న రెక్కలతో

దేహం ఇంద్ర ధనుస్సయిన

వృద్ధ కళేబరం

దినం దినం అరిగి అరిగి తరిగిపోతూ

‘ఛీ’త్కారాల ముందు

చేతులు చాస్తూ

ఊపిరి బరువు మోయలేక

ఆయాసాల్ని బ్రతుగ్గా మలచలేక

డాక్టరుకి కన్నతండ్రినని చెప్పుకోలేక

మృత్యురాకని వెతుకుతున్న కళ్లలో

ఎండిపోయిన కలల పొలాలని

చూస్తూ చూస్తూ భరించలేనివాణ్ణి

క్షమించండి మిత్రులారా!


మీ జీవన శ్వేతపత్రాన్ని

ప్రకటిస్తున్నవాణ్ణి

మిమ్మల్ని కడుపులో దాచుకొని

తిమింగిలాల నుండి రక్షించినవాళ్ళు

మీకోసం కోరికల్ని జయించి

చిర్నవ్వు జెండాలెగరేసినవాళ్ళు

సగం బతుకు కష్టాలు మోసి మోసి

సుఖాన్ని మీకు చేరేసినవాళ్ళు

ప్చ్‌... ఏం లాభం

ఏ రోజూ...

బోధివృక్షం నీడకి చేరనివాళ్ళు...


మీ అల్లారు ముద్దు కూతుళ్లని

మీ బంగారు బాతు కొడుకుల్ని

రేపటి మీ అల్లుణ్ణి, కోడల్ని

భవిష్యత్తు నాడి శాస్త్రంలో

చదవలేకపోతున్నవాణ్ణి

క్షమించండి మిత్రులారా!

రేపటి నా దేశాన్ని

ఊహించలేకున్నవాణ్ణి

ఈతకోట సుబ్బారావు

94405 29785


Updated Date - 2020-07-13T05:58:39+05:30 IST