‘‘శేఖర్గారి సినిమాలకు, నా సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆడియన్స్‌ని థియేటర్స్‌కి తీసుకొచ్చి ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు. అందుకే సినిమా విడుదల కొద్ది రోజులు వాయిదా వేయాలనుకుంటున్నాం. పరిస్థితులు సర్దుమణిగాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సాయి పల్లవి కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహనరావు నిర్మాతలు. ఈ నెల 16న విడుదల కావలసిన ఈ చిత్రం వాయిదా పడింది. దీనికి సంబంధించి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాగ చైతన్య మాట్లాడుతూ ‘‘పది రోజుల క్రితం శేఖర్ కమ్ముల సినిమా చూపించారు. అవుట్‌పుట్ చూసి చాలా ఆనందించా. అయితే గత రెండు వారాలుగా కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. అందుకే ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఇప్పటికే పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాలో ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సినిమా కంప్లీట్ అయింది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. కరోనా ఉదృతి పెరుగుతుండడంతో ఈ సమయంలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని ఆలోచించాం. అందుకే సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని శేఖర్ కమ్ముల అన్నారు. ‘‘సరైన సమయం చూసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని నారాయణ దాస్ నారంగ్ చెప్పారు. పి.రామ్మోహన్రావు, సునీల్ నారంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.