‘వాయిదా’ వసూళ్లు!

ABN , First Publish Date - 2020-09-27T08:34:55+05:30 IST

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) ఫస్టియర్‌ పరీక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు...

‘వాయిదా’ వసూళ్లు!

  • రేపటి నుంచి జరగాల్సిన డీఎడ్‌ పరీక్షలు
  • అనూహ్యంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులు
  • అక్రమ అడ్మిషన్లను సక్రమం చేసే వ్యూహం 
  • 20 వేల మంది కోసం ప్రభుత్వ పెద్దలతో పైరవీలు
  • అక్రమ అడ్మిషన్‌కు వెయ్యి చొప్పున వసూలు
  • కొన్ని జిల్లాల్లో ఒక్కో కాలేజీ నుంచి 50 వేలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) ఫస్టియర్‌ పరీక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. అభ్యర్థులందరూ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఇంతలోనే ఉన్నట్టుండి ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌-19 వ్యాప్తి ఎక్కువగా ఉందని, అందుకే వాయిదా వేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి ఇప్పటికే నీట్‌ సహా పలు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో డీఎడ్‌ను కేవలం కరోనా కారణంగానే వాయిదా వేశారా? లేక ఈ ‘వాయిదా’ వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు తెరమీదికి వచ్చాయి. డీఎడ్‌ ఫస్టియర్‌ పరీక్షల వాయిదాకు ప్రైవేట్‌ డీఎడ్‌ కాలేజీల కరస్పాండెంట్ల అసోసియేషన్‌ ప్రభుత్వ పెద్దలతో నెరిపిన పైరవీలు, కొందరు వ్యక్తుల తెరవెనుక మంత్రాంగమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేర్చుకున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించేలా మార్గాన్ని సుగమం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ పెద్దలపై తెచ్చిన ఒత్తిళ్లు ఫలించాయని, ఈ క్రమంలో తొలి అడుగుగా పరీక్షలను వాయిదా వేశారని తెలుస్తోంది.


విషయం ఏంటంటే..

2018-20 డీఎడ్‌ బ్యాచ్‌కి సంబంధించి ప్రైవేట్‌ డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో 20 వేల మంది అభ్యర్థులను పలు కాలేజీలు చేర్చుకున్నాయి. వాస్తవానికి డీసెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పించాలి. అయితే, 2018-20 బ్యాచ్‌ అడ్మిషన్ల విషయంలో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను.. అసలు కౌన్సిలింగే లేకుండా, డీసెట్‌లో క్వాలిఫైకాని వారితో భర్తీ చేశారు. ఇలా చేర్చుకోవడంపై పాఠశాల విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జీవో 30 ఉల్లంఘన కిందకే వస్తుందని.. డీఎడ్‌లో ప్రవేశాలకు డీసెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అని, కానీ.. 20 వేల మంది విషయంలో జీవోను పాటించలేదని, ఆయా అభ్యర్థులను రాటిఫై చేసేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి డీసెట్‌ క్వాలిఫై కానివారి అడ్మిషన్లను కూడా రాటిఫికేషన్‌తో అనుమతిస్తున్నా, రూల్స్‌కు విరుద్ధంగా భర్తీ చేసుకోవడాన్ని అనుమతించబోమన్నారు. ఈ క్రమంలో ఫస్టియర్‌ పరీక్షలకు సంబంధిత విద్యార్థుల నుంచి ఫీజులు కూడా కట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురై.. కాలేజీ యాజమాన్యాల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  


అధికారుల వాదనకే హైకోర్టు ఆమోదం

ఇక, ఈ వివాదంపై కాలేజీ యాజమాన్యాలు కోర్టుకెళ్లాయి. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ప్రవేశాలు చెల్లబోవని తీర్పునిచ్చింది. డీసెట్‌లో క్వాలిఫై కాని వారు డీఎడ్‌ కోర్సు చేయడానికి అర్హత లేదని స్పష్టం చేసింది. దీంతో మేనేజ్‌మెంట్లు మళ్లీ అప్పీల్‌ చేసుకున్నాయి. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో మేనేజ్‌మెంట్లపై ఒత్తిడి పెరిగింది. ఆయా విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన మేనేజ్‌మెంట్లు పైరవీలకు తెరదీశాయి. ఒక్కొక్క అక్రమఅడ్మిషన్‌కు రూ.1000 చొప్పున కాలేజీ యాజమాన్యాల నుంచి వసూలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే కాలేజీకి రూ.50 వేలు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. తొలుత పరీక్షలను వాయిదా వేయించి, తర్వాత ఆయా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతి పొందాలన్న వ్యూహంతో వారు రాజధానిలోనే ఉండి పైరవీలు సాగిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారిని కలిసి ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా ఎట్టకేలకు పరీక్షలను వాయిదా వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఇలా అడ్మిషన్లు చేసుకోవడం ఇప్పడే కొత్త కాదని 2015నుంచి కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను డీసెట్‌లో పరీక్షలతో సంబంధం లేకుండానే భర్తీచేసుకున్న విషయాన్ని మేనేజ్‌మెంట్లు ఇటీవల విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరాయి. అనంతరం, ఆయన పరీక్షల వాయిదాకు సిఫారసు చేస్తూ పాఠశాలవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఫైలు పంపారు.

Updated Date - 2020-09-27T08:34:55+05:30 IST