జన గణన వాయిదా

ABN , First Publish Date - 2021-01-17T04:51:28+05:30 IST

కరోనా కారణంగా జనాభా లెక్కల గణన వాయిదా పడింది. గత ఏడాది జూన్‌, జూలై నెలల్లో నిర్వహించాల్సిన గణన వాయిదా పడుతూ వస్తోంది.

జన గణన వాయిదా
జనాభా లెక్కల శిక్షణ కోసం ముద్రించిన పుస్తకాలు


 వ్యాక్సినేషన్‌ తరువాత ప్రారంభించే యోచన 

కలెక్టరేట్‌ : కరోనా కారణంగా జనాభా లెక్కల గణన వాయిదా పడింది. గత ఏడాది జూన్‌, జూలై నెలల్లో నిర్వహించాల్సిన గణన వాయిదా పడుతూ వస్తోంది. దీనిపై గత ఫిబ్రవరిలో జిల్లా స్థాయి అధికారులకు మొదటి విడత శిక్షణ కూడా ఇచ్చారు. కిందిస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో కరోనా వైరస్‌ వ్యాపించింది. అప్పటినుంచి ఈ తంతు నిలిచిపోయింది. సాధారణంగా పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. 2011లో నిర్వహించిన లెక్కల ఆధారంగా ఇప్పుడు జాబితాలు తయారు చేస్తారు. అయితే 2021కి సంబంధించి జనాభా లెక్కల గణనపై కరోనా ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి శిక్షణకు అవసరమైన ఆరు రకాలు పుస్తకాలు కూడా ముద్రించింది.  లెక్కలు, ఇళ్ల జాబితా బ్లాక్‌ వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.  ఇదిలా ఉండగా  ఈ సారి మాన్యువల్‌గా  కాకుండా ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌ లేదా, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధానంగా సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొవాల్సి ఉంది.  ఉపాధ్యాయులతో కాకుండా ఈ సారి సచివాలయం సిబ్బంది ద్వారా ఈ లెక్కలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రక్రియ మొదలవుతున్న తరుణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడం వల్ల ఎక్కడిక్కడ ఆ ప్రక్రియ నిలిచి పోయింది. కొవిడ్‌ పూర్తిగా నిర్మూలన అయిన తరువాత జనాభా లెక్కలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విష యం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు వద్ద ప్రస్తావించగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి ఆయిన తరువాత ఈ జనాభా లెక్కలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. 

 

Updated Date - 2021-01-17T04:51:28+05:30 IST