మళ్లీ పట్టాల పంపిణీ వాయిదా

ABN , First Publish Date - 2020-08-13T11:25:21+05:30 IST

నిరుపేదలకు నివేశన స్థల పట్టాలను పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర

మళ్లీ పట్టాల పంపిణీ వాయిదా

అమలాపురం (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు నివేశన స్థల పట్టాలను పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం నాల్గోసారి వాయిదా పడ డంతో లబ్ధిదారుల్లో మళ్లీ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. పట్టాల పంపిణీ మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించలేదు. ఆగస్టు 15న జరిగే పట్టాల పంపిణీ వాయిదా విషయాన్ని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబరులో జరిగే వైఎస్‌ వర్ధంతి లేదా అక్టోబరులో జరిగే గాంధీ జయంతి నాటికి పంపిణీ చేపట్ట వచ్చునని భావిస్తున్నారు.


సుప్రీంకోర్టులో పట్టాల పంపిణీకి సంబంధించి కేసుల విచారణ రీత్యా ఈ వాయిదా అనివార్యమైంది. తొలుత ఉగాదినాడు, తరువాత ఏప్రిల్‌ 14న జరిగిన అంబేడ్కర్‌ జయంతి రోజు, ఆ తర్వాత జూలై 8న జరిగిన వైఎస్‌ జయంతి రోజున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చివరకు ఆగస్టు 15న ముహుర్తం ఖరారు చేసినప్పటికీ కోర్టు వివాదాల నేపథ్యంలో వాయిదా అనివార్యమైందని మళ్లీ ఎప్పుడు పంపిణీ చేసేదీ ప్రభుత్వం త్వరలోనే తెలుపుతుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించడంతో మరోసారి లబ్ధిదారులు నిరుత్సాహానికి గురికావలసి వచ్చింది. పట్టాల పంపిణీ వాయిదా పడడంతో రెవెన్యూ అధికారులు మరోసారి ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-08-13T11:25:21+05:30 IST