Abn logo
Oct 21 2021 @ 05:30AM

పొటాష్‌.. నో స్టాక్‌

  • ఖరీఫ్‌ పంటలకు ఎరువుల కొరత 
  • ఆర్బీకేల్లో అందని సరుకు
  • రిటైల్‌ డీలర్ల వద్ద నిల్వలు నిల్‌
  • పంటలకు తక్షణం వేయాల్సిన అవసరం
  • 40 లక్షల ఎకరాల్లో వరి సాగు
  • అందులో సగానికి పైగా పొట్ట దశ
  • దిగుబడిపై డెల్టా రైతు ఆందోళన
  • తీవ్రతను గుర్తించని వ్యవసాయ శాఖ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ పంటలకు పొటాష్‌ ఎరువులు వేయాల్సిన సమయంలో కొరత ఏర్పడింది. ఆర్బీకేలు, సొసైటీలు, రిటైల్‌ డీలర్ల వద్ద అందుబాటులో లేవు. పొటాష్‌ ఎరువులు అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట కోతకు వచ్చే లోపు ఎరువు అందించకపోతే దిగుబడి, నాణ్యత తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి డెల్టాల్లో వరితో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో పత్తి, మిర్చి ఇతర పంటలకు కూడా ప్రస్తుతం  వేయాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట దశకు వచ్చిన వరి పైరుకు పొటాష్‌ ఎరువుల వాడకం తప్పనిసరని అంటున్నారు. కానీ రాష్ట్రంలో పొటాష్‌ కంటెంట్‌ ఉన్న ఎరువుల కొరత ఏర్పడింది. మ్యూరెట్‌ ఆఫ్‌ పొటా్‌షతో పాటు 10:26:26, 12:32:16, 14:35:14 వంటి కొన్ని రకాల ఎరువుల్లో పొటాష్‌ ఉంటుంది. ఈ రకాలను ఆర్బీకేలు, సొసైటీలకు సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతున్నా.. ఎక్కడా సరుకు అందుబాటులో లేదని రైతులు చెబుతున్నారు. ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకున్నా పది రోజులకు కూడా అందటం లేదు. సొసైటీల్లో ఇచ్చే పరిస్థితి లేదు. ప్రైవేటు డీలర్ల వద్ద నిల్వలు లేవంటున్నారు. దీంతో పొటాష్‌ ఎరువుల కోసం డెల్టా ప్రాంత అన్నదాతలు గత పక్షం రోజులుగా ఆర్బీకేలు, సొసైటీలు, రిటైల్‌ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పొటాష్‌ ఎరువులు ఎకరానికి కనీసం బస్తా తప్పని సరిగా వేయాల్సి ఉంటుంది. వరి గింజ పాలుపోసుకునే దశ నుంచి ఈనే దశ వరకు పొటాష్‌ ఎకరానికి అరబస్తా అయినా వేయాలి. పత్తి మొక్కలు పూత, పిందె, కాయ ఎదుగుదలకు పొటాషే కీలకం. వరి పైరుకు తక్షణం పొటాష్‌ వేయకపోతే, ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


ఆశించిన ఉత్పాదకత కోసం పొటాష్‌ వాడకం తప్పనిసరి. అయినా వ్యవసాయ శాఖ తీవ్రతను గుర్తించడం లేదని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగులో ఉండగా, అందులో సగానికి పైగా పొట్ట దశలో ఉంది. 13 లక్షల ఎకరాల్లో పత్తి, 4.6 లక్షల ఎకరాల్లో మిర్చి సాగులో ఉన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 22 లక్షల ఎకరాల వరికి తక్షణం 2,500 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ అవసరం ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్బీకేలు, సొసైటీలు, డీలర్ల వద్ద స్టాక్‌ లేకపోవడంతో మార్క్‌ఫెడ్‌ బఫర్‌ స్టాక్స్‌ నుంచి సరుకు ఇప్పించాల్సిన వ్యవసాయ శాఖ ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొటాష్‌ ఉండే ఎరువులు నెల క్రితం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉందని చెప్పిన వ్యవసాయ శాఖ.. డీఏపీ తగ్గించి, కాంప్లెక్స్‌ ఎరువులు ఎక్కువగా వాడమని ప్రచారం చేస్తూనే.. పొటాష్‌ ఎరువుల కొరతను తీర్చడంలో విఫలమైందని రైతు నేతలు విమర్శిస్తున్నారు.


బస్తాపై అదనంగా రూ.100 వసూలు

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో ఎంవోపీ బస్తా రూ.750 లోపు ఉండగా, ఇప్పుడు రూ.వెయ్యికి పెరిగింది. అయినా మార్కెట్‌లో లభ్యత లేదు.  10:26:26,  12:32:16,  14:35:14 రకాల ధరలు అంతకంతకూ పెరిగాయి. ఓ కంపెనీకి చెందిన 10:26:26 రకం 50 కిలోల బస్తా రూ.1,440, 12:32:16 రకం రూ.1,450 ఎమ్మార్పీ ఉండగా, మరో కంపెనీ సరుకు అయితే బస్తా రూ.1,470 ఉంది. ఈ ధరలకు ఆ రకాలు దొరకడం లేదు. తాజా ఎమ్మార్పీతో కొత్త సరుకు రాలేదంటున్నారు.  డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొద్దికొద్దిగా సరుకు బయటపెడుతూ.. బస్తాకు రూ.100పైన అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రేటు పెరిగినా.. సరుకు తగినంత లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. సకాలంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, రబీ పంటలకూ పొటాష్‌ అవసరం ఉన్నాకానీ వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతు నేతలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...