రైతుబజార్లలో బంగాళాదుంప మాయం

ABN , First Publish Date - 2020-11-25T06:44:54+05:30 IST

నగరంలోని రైతుబజార్లలో గత మూడు రోజులుగా బంగాళాదుంపల విక్రయాలు నిలిచిపోయాయి. రేటు పెరిగిపోవడం, దానిపై వచ్చే లాభం తగ్గిపోవడం తో డ్వాక్రా సంఘాలు బంగాళాదుంపలను బజార్లకు తీసుకురావడం లేదు. దాంతో బయట ఎక్కు వ రేటు పెట్టి కొనాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతు న్నారు.

రైతుబజార్లలో బంగాళాదుంప మాయం

గిట్టుబాటు కావడం లేదంటున్న అమ్మకందారులు

కొనసాగుతున్న నాసిరకం ఉల్లి విక్రయాలు

పట్టించుకోని అధికారులు


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

నగరంలోని రైతుబజార్లలో గత మూడు రోజులుగా బంగాళాదుంపల విక్రయాలు నిలిచిపోయాయి. రేటు పెరిగిపోవడం, దానిపై వచ్చే లాభం తగ్గిపోవడం తో డ్వాక్రా సంఘాలు బంగాళాదుంపలను బజార్లకు తీసుకురావడం లేదు. దాంతో బయట ఎక్కు వ రేటు పెట్టి కొనాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతు న్నారు.  గత రెండు నెలల్లో బంగాళాదుంపల రేటు కిలో రూ.20 నుంచి 40కి చేరింది. ఈ సరకు మొత్తం కోల్‌కతా నుంచి వస్తుంది. ఇంతకు మందు బస్తాకు 50 కిలోల దుంపలు వచ్చేవి. ఇప్పుడు 48 కిలోలే వస్తున్నాయి. అందులో రద్దు, కటింగ్‌ దుంపలు ఐదు నుంచి ఆరు కిలోల వరకు ఉంటున్నాయి. అంటే బస్తాకు ఎనిమిది కిలోలు పోతున్నాయి. ప్రస్తుతం జ్ఞానాపురం మార్కెట్‌లో బంగాళాదుంపల బస్తా టోకు ధర రూ.1,900. మార్కెటింగ్‌ శాఖ అధికారుల లెక్క ప్రకారం అది 50 కిలోల బస్తా కాబట్టి కిలో రూ.39 పడుతోంది. కిలోకు రెండు రూపాయలు డ్వాక్రా సంఘాలకు మార్జిన్‌ ఇవ్వాలి. అలా చూసుకుంటే కిలో రేటు రూ.41గా నిర్ణయించాలి. కానీ రూ.40 పెడుతున్నారు. దానివల్ల డ్వాక్రా సంఘాలు కిలోకు రూపాయి చొప్పున నష్టపోతున్నారు. ఇదికాకుండా బస్తాకు ఎనిమిది కిలోలు పోతుండడంతో చేతి డబ్బులు పెట్టుకోవలసి వస్తోంది. దాంతో ఈ వ్యాపారం తాము చేయలేమంటూ బంగాళాదుంపలు తేవడం మానేస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖాధికారులు కిలోకు ఇవ్వాల్సిన రెండు రూపాయిల మార్జిన్‌ను మూడు రూపాయలకు పెంచితే తప్ప గిట్టుబాటు కాదని అంటున్నారు.


మూడో రకం ఉల్లిపాయలే గతి

ఉల్లి రేటు ఇంకా దిగి రాలేదు. బయట మార్కెట్‌లో రూ.70 చొప్పున అమ్ముతున్నారు. రైతుబజార్లలో రేటు తక్కువగా వుండాలని రూ.54గా రాస్తున్నారు. డ్వాక్రా సంఘాలు ఆ ధరకు గిట్టుబాటు అయ్యేలా నాసిరకం (మూడో రకం) ఉల్లి తెచ్చి రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. ఆ రేటుకు అంతకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. కొనుగోలుదారులు ఆ ఉల్లిని కొనలేక బయట కిలో రూ.70 పెట్టి కొంటున్నారు. రాయితీ ఉల్లి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ దృష్టి పెట్టి సరైన మార్గదర్శకాలు ఇవ్వనంతవరకు ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.

Updated Date - 2020-11-25T06:44:54+05:30 IST