పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాల్సిందే

ABN , First Publish Date - 2020-05-18T11:15:57+05:30 IST

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 203ను స్వాగతిస్తున్నట్లు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తెలిపారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాల్సిందే

కేసీఆర్‌తో జగన్‌ లాలూచీ పడితే సీమకు తీరని ద్రోహం చేసినట్లే

ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకే జీవో 203 తెచ్చారా?

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి


కడప, మే 17 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 203ను స్వాగతిస్తున్నట్లు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తెలిపారు. ఆదివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు కోరల్లో చిక్కుకున్న సీమకు సాగునీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాల్సిందేనన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్య సంబంధాలు, ఆర్థిక లావాదేవీల కారణంగా (సామర్థ్యం పెంపు) ఆగిపోతే రాయలసీమకు జగన్‌ తీరని ద్రోహం చేసినట్లేనన్నారు. మన వాటా నీళ్లను తీసుకెళుతుంటే కేసీఆర్‌ ఒప్పుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఆయన నిజస్వరూపం తెలిసిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భూభాగంలో ఉమ్మడి రాష్ట్రాలు ప్రాజెక్టులను నెలకొల్పాలని తొలుత తలపోశారు.


మన వాటాగా రూ.60 నుంచి రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. పోతిరెడ్డిపాడు నుంచి మన వాటా నీటిని తీసుకెళ్లేందుకే కేసీఆర్‌ ఒప్పుకోలేదు. అదే తెలంగాణ భూభాగంలో ఉమ్మడి ప్రాజెక్టును నిర్మించి ఉండింటే అక్కడ నుంచి నీటిని తీసుకోనిచ్చేవారా అంటూ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని, సీమ ప్రజల కోసం  సుప్రీంకోర్టులో మంచి న్యాయవాదిని నియమించాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే జీవోనెంబరు 203ను తెరపైకి తెచ్చారన్న చర్చ జనాల్లో జరుగుతోందన్నారు. సీఎం జగన్‌ జిల్లాలో రూ.1300 కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని, కొత్త ప్రాజెక్టులకు బదులు గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను పూర్తి చేస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకోవచ్చన్నారు. గండికోటలో 20 టీఎంసీల నీటిని నింపుతానని గత ఏడాది వైౖఎస్‌ జయంతి రోజున జగన్‌ ప్రకటించి కేవలం 10 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి మాట తప్పారన్నారు. విపరీతంగా మద్యం ధరలు పెంచి పేదలపై అదనపు భారం మోపారని తెలిపారు. ఐదేళ్ల పాటు మద్యం నుంచి భారీగా ఆదాయాన్ని పిండుకుని ఎన్నికలకు ముందు డిసెంబరులో పులివెందులలోనే మద్య నిషేధాన్ని ప్రకటిస్తారేమోనని ఆయన జోస్యం చెప్పారు. కరెంటు బిల్లులను ఇష్టారాజ్యంగా పెంచారన్నారు. లాక్‌డౌన్‌తో చీనీ, మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

Updated Date - 2020-05-18T11:15:57+05:30 IST