కురిసిన వాన

ABN , First Publish Date - 2020-06-02T09:50:02+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన కురిసింది.

కురిసిన వాన

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 1: జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో  కూడిన కురిసింది. గుంతకల్‌, రాయదుర్గం, గుమ్మగట్ట, కణేకల్లు, నల్లమాడ, కంబదూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల్లో వర్షం కురిసింది. అలాగే తలుపుల,  కదిరి మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీచాయి. పగటి పూట ఎండ వేడిమికి ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షం పడటంతో కాస్త ఉపశమనం పొందారు. 


కళ్యాణదుర్గం టౌన్‌: కళ్యాణదుర్గం ప్రాంతంలో సోమవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దురదకుంట గ్రామంలో ఓ రేకుల షెడ్డు కూలిపోగా, రేకులు గాలి బీభత్సానికి ఎగిరిపోయాయి. పట్టణంలోని పార్వతినగర్‌, మారెంపల్లి కాలనీల్లో రేకులతో కూడిన ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. సిద్దప్పవంక వీధిలో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అదేవిధంగా గూబనపల్లి గ్రామంలోని లోతట్టు ప్రాంతంలో నీరు ఇళ్లలోకి చేరాయి. గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడింది. 


ఉరవకొండ: మండల పరిధిలోని రాకెట్ల గ్రామంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలుల భీభత్సానికి పలువురు రైతులకు చెందిన అరటి తోటలు నేలకొరిగాయి. గాలులు వేగంగా రావడంతో పది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. రైతులు సురేష్‌,  నారప్ప, సుధాకర్‌, రవీంద్రకు చెందిన పొలాల్లో అరటి తోటలు నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.లక్ష దాకా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


బెళుగుప్ప: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దుద్దేకుంట, శీర్పి, ఎర్రగుడి, బెళుగుప్ప, గంగవరం, తదితర గ్రామాల్లో గాలులు బలంగా వీచాయి. దీంతో పండ్ల తోటలకు నష్టం వాటిల్లి ఉంటుందన్న భయాందోళన రైతుల్లో నెలకొంది. 


కూడేరు:  మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి 42 మీల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు ఏఎ్‌సఓ మమత తెలిపారు. ఖరీ్‌ఫలో పొలాలు సేద్యంపు పనులు చేసుకోవడంతోపాటు పలువురు రైతులు విత్తనం చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.


పెనుకొండ: పట్టణంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఎండకాలంలో వేసవితాపంతో అల్లాడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు. భారీ వర్షం కారణంగా బ్రాహ్మణవీధి, కుమ్మరదొడ్డి, గడంగ్‌వీధి తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  రైతులు మంగళవారం నుంచి ఖరీఫ్‌ సాగు పనులకు సమాయత్తం అవుతున్నారు. 


సోమందేపల్లి: మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దాదాపుగా 2 గంటల పాటు వర్షం కురవడంతో రోడ్లన్న్నీ జలమయమ య్యాయి. పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. గుంతలు నీటితో నిండిపో యాయి. ఖరీఫ్‌లో వర్షాలు ప్రారంభమవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-06-02T09:50:02+05:30 IST