సంక్షేమ పథకాలతో పేదరికం దూరం

ABN , First Publish Date - 2022-01-27T06:11:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలు జిల్లాలో పేదరికం నిర్మూలనకు ఎంతగానో దోహదపడుతున్నాయని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు.

సంక్షేమ పథకాలతో పేదరికం దూరం

డ్వాక్రా గ్రూపులకు రూ.595.47 కోట్ల ‘ఆసరా’

రైతుభరోసా కింద 3.8 లక్షల మందికి రూ.306 కోట్లు సాయం

‘చేయూత’ కింద 1.99 లక్షల మంది మహిళలకు రెండేళ్లలో రూ.612.43 కోట్లు  

నాడు-నేడులో భాగంగా 1,131 పాఠశాలల్లో మౌలిక వసతులు

రూ.1,499 కోట్లతో ఏడు భారీ పరిశ్రమలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున


విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలు జిల్లాలో పేదరికం నిర్మూలనకు ఎంతగానో దోహదపడుతున్నాయని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వివరిస్తూ జిల్లాకు కేటాయిస్తున్న నిధుల వివరాలను వెల్లడించారు. 

జగనన్న కాలనీల్లో 60 వేల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించగా ఇప్పటివరకు రూ.54 కోట్లు బిల్లులు చెల్లించామన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పటివరకు 13,917 మందికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేశామన్నారు. వివిధ రకాల సామాజిక పింఛన్ల కింద 4.83 లక్షల మందికి ప్రతినెలా రూ.123.58 కోట్లు అందజేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ ఆసరాలో భాగంగా 4.16 లక్షల డ్వాక్రా సంఘాలకు 2019 నాటికి బ్యాంకుల్లో వున్న రూ.1,184 కోట్ల అప్పును నాలుగు వాయిదాలలో చెల్లించాల్సి ఉండగా...ఇప్పటివరకు రెండు వాయిదాల కింద రూ.599.47 కోట్లు మాఫీ చేశామన్నారు. ఇంకా ‘చేయూత’ కింద 1.99 లక్షల మంది మహిళలకు రెండేళ్లలో రూ.612.43 కోట్లు అందించామన్నారు. బీసీ, ఈబీసీ వర్గాలకు చేదోడు, కాపు నేస్తం పథకాల ద్వారా ఆర్థికంగా సాయమందించామన్నారు. 


నాడు-నేడు కింద రూ.2,081 కోట్లతో 558 విలేజ్‌ క్లినిక్‌లు, 45 అర్బర్‌ హెల్త్‌ సెంటర్లు, 86 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, ఇంకా టీచింగ్‌ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. రైతు భరోసా కింద గత ఏడాది 3.8 లక్షల మందికి రూ.306.25 కోట్లు సాయం అందించామన్నారు. గత ఏడాది సెప్టెంబరులో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ వల్ల 1,844 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో 6,900 మందికి రూ.2.75 కోట్లు పరిహారంగా అందించామన్నారు. యువతలో వృత్తి నైపుణ్యం మెరుగుపరచడానికి విశాఖపట్నం, అనకాపల్లి, అరకులోయల్లో నైపుణ్యాభివృద్ధి కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామని కలెక్టర్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా డిస్ట్రిక్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళిక విధానాన్ని అనుసరిస్తున్న 113 జిల్లాల్లో అవార్డు ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు ఎంపికైన 30 జిల్లాల్లో విశాఖపట్నం వుందని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 5,426 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 6.83 లక్షల నుంచి 6.96 లక్షలకు పెరిగారన్నారు. నాడు-నేడు కింద 1,131 పాఠశాలల్లో రూ.323 కోట్లు ఖర్చుతో తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. రెండో దశలో నాడు-నేడు కింద 687 పాఠశాలల్లో రూ.245 కోట్లతో వసతుల కల్పనకు ప్రతిపాదించామన్నారు. గడచిన ఏడాదిలో రూ.7,417 కోట్ల పెట్టుబడితో 36,248 మందికి ఉపాధి కల్పనకు నిర్ణయించామని, త్వరలో ఈ పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమవుతాయన్నారు. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకం కింద 20,000 యూనిట్లకుగాను ఇంతవరకు 16,507 యూనిట్లకు రూ.478 కోట్లు విడుదల చేశామన్నారు. రూ.92 కోట్లతో రుషికొండలో బీచ్‌ రిసార్ట్స్‌ పునరుద్ధరణ, పాండ్రంకిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం, కృష్ణాదేవిపేటలో రూ.50 లక్షలతో స్మృతి వనం పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. 


ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించే మహిళలు, బాలికల రక్షణకు రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో అభయం ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 1.94 కోట్ల పనిదినాలు కల్పించి కూలీల ఖాతాలకు రూ.434.42 కోట్లు జమ చేశామన్నారు. వీఎంఆర్‌డీఎ ద్వారా రూ.150 కోట్లతో ఎన్‌ఏడీ ఫ్లైవోవర్‌, రూ.36,32 కోట్లతో రోడ్లు, కల్యాణ మండపాలు, జీవీఎంసీలో రూ.61 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల కోసం ఆనందపురం మండలంలోని మూడు గ్రామాల్లో 360 ఎకరాలు సేకరిస్తున్నామని, ఇక్కడ 4,50 ప్లాట్లు అభివృద్ధి చేస్తామన్నారు. చెత్తరహిత నగరాల జాబితాలో విశాఖ నగరం త్రీస్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకుందన్నారు. నగరంలో రూ.410 కోట్లతో 2,703 పనులు చేపట్టగా, వాటిలో రూ.231 కోట్ల విలువైన 1,554 పనులు పూర్తయ్యాయన్నారు. నగరంలో అన్ని ప్రాంతాలకు తాగునీటి కల్పన కోసం రూ.480.75 కోట్లతో మూడు ప్రాజెక్టులు ప్రతిపాదించామని కలెక్టర్‌ వెల్లడించారు. ఏజెన్సీలో అరకులోయ, చింతపల్లి మండల కేంద్రాల్లో గర్భిణుల సౌకర్యం కోసం వసతిగృహాలు ఏర్పాటుచేశామని, ఇంకా 11 మండలాల్లో బర్త్‌ వెయిటింగ్‌ హాల్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు.


కొవిడ్‌ టీకా కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు తొలి డోసు 37.02 లక్షల మందికి, రెండో డోసు 30.54 లక్షల మందికి ఇచ్చామన్నారు. ఇంకా బూస్టర్‌ డోసు 53 వేల మందికి, 15 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలు 1.69 లక్షల మందికి తొలి డోసు అందించామన్నారు. కార్యక్రమంలో నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పి.అరుణ్‌బాబు, కల్పనాకుమారి, రేంజ్‌ ఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, అనకాపల్లి, అరకు ఎంపీలు బీవీ. సత్యవతి, గొడ్డేటి మాధవి, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీలు పీఎన్‌వీ మాధవ్‌, వరుదు కళ్యాణి, డీసీపీ గౌతమిశాలి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-27T06:11:36+05:30 IST