ప్రతీ నెలా రూ.400 లోపే కరెంటు బిల్లు.. ఈ నెల మాత్రం ఏకంగా రూ.30,999..!

ABN , First Publish Date - 2020-05-18T22:44:24+05:30 IST

పోరుమామిళ్లకు చెందిన సోమయ్య 12 ఏళ్ల క్రితం విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. మీటరు నెంబరు 5172. నెల బిల్లు రూ.500 లోపే వచ్చేది. మార్చి నెలలో రూ.495 చెల్లించాడు. ఏప్రిల్‌లో ఏకంగా రూ.3602 వచ్చింది. బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది

ప్రతీ నెలా రూ.400 లోపే కరెంటు బిల్లు.. ఈ నెల మాత్రం ఏకంగా రూ.30,999..!

గుండె గు‘బిల్లు’.. రూ.వేలల్లో విద్యుత్‌ చార్జీలు

కరోనా కష్టకాలంలో వినియోగదారులకు షాక్‌

ఇంట్లో ఉండి ఎక్కువ కరెంటు వాడారంటున్న అధికారులు

మార్చి నెలతో పోలిస్తే రూ.5 నుంచి 7 కోట్లు అదనపు భారం

ఆందోళనలో సామాన్య ప్రజలు

జిల్లా కంట్రోల్‌ రూం నెంబర్లు 8332969801, 7382623163


కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోరుమామిళ్లకు చెందిన సోమయ్య 12 ఏళ్ల క్రితం విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. మీటరు నెంబరు 5172. నెల బిల్లు రూ.500 లోపే వచ్చేది. మార్చి నెలలో రూ.495 చెల్లించాడు. ఏప్రిల్‌లో ఏకంగా రూ.3602 వచ్చింది. బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది. సోమయ్య ఒక్కడే కాదు.. జిల్లాలో ఇలాంటి వాళ్లు ఎందరో. కరోనా లాక్‌డౌన్‌ కష్టకాలంలో బిల్లు రూపంలో కరెంటు షాక్‌ కొడుతోంది. మార్చి నెలతో పోలిస్తే ఒక్క నెలలో రూ.5 నుంచి 7 కోట్లు వినియోగదారులపై అదనపు భారం పడింది. ఇదేమిటని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జనం ఇంట్లోనే ఉన్నారు. కరెంటు వినియోగం పెరిగింది. ఎవరికైనా సమస్యలు ఉంటే జిల్లా కంట్రోల్‌ రూం నెంబర్లు 8332969801, 7382623163 కాల్‌ చేయాలని సమాధానం ఇస్తున్నారు. కరోనా కష్టకాలంలో షాక్‌ కొడుతున్న కరెంటు బిల్లులపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


కడప జిల్లాలో 11,01,392 విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. అందులో గృహ వినియోగ కనెక్షన్‌లు (డొమెస్టిక్‌) 8,39,196. కమర్షియల్‌ కనెక్షన్‌లు 76,201, పరిశ్రమలు 6777, వ్యవసాయ విద్యుత్‌ వినియోగ కనెక్షన్లు 1,64,246, హెచ్‌టీ కనెక్షన్లు 602, తాగునీటి పథకాలు, వీధి దీపాల కనెక్షన్లు 7284, వివిధ ప్రార్థనా సంస్థలకు కనెక్షన్లు 7064 ఉన్నాయి. లాక్‌డౌన్‌ ముందు అన్ని కేటగిరీల విద్యుత్‌ వినియోగం ద్వారా రూ.97 కోట్ల బిల్లులు వచ్చేవి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతబడ్డాయి. వాణిజ్య దుకాణాలకు తాళం పడింది. ఈ రెండు రంగాల విద్యుత్‌ వినియోగం 75 శాతానికి పైగా తగ్గిపోయింది. వేసవి కావడంతో అగ్రికల్చర్‌ వినియోగం కూడా స్వల్పంగా తగ్గింది. గృహ విద్యుత్‌ వినియోగం కాస్త పెరిగిన మాట నిజమే. అయితే.. వేలల్లో బిల్లులు చూసి సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు.


నెలలో రూ.5 నుంచి 7 కోట్లు అదనపు భారం

లాక్‌డౌన్‌కు ముందు గృహ విద్యుత్‌ వినియోగం కనెక్షన్‌ల ద్వారా రూ.30 నుంచి 32 కోట్లు వచ్చేదని విద్యుత్‌ శాఖాధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ తరువాత మార్చి నెలలో రూ.34 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌ నెలలో బిల్లులు లెక్కలు చూస్తే రూ.37 కోట్లకు చేరిందని అధికారులు పేర్కొంటున్నారు. అంటే ఫిబ్రవరి నెలతో పోలిస్తే రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు వినియోగదారులపై అదనపు భారం పడినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు కట్టలేమంటూ జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టాల్లో ఉంటే బిల్లుల రూపంలో షాక్‌ ఇస్తున్నారని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో బిల్లు చూసి ఇదెక్కడి న్యాయం అంటున్నారు. రాబోయే రోజుల్లో రేషన్‌ కార్డులను తొలగించేందుకు ఇది కారణమవుతుందని జనం ఆరోపణ.


అధికారుల వాదన ఇలా...

లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో బిల్లు కాస్త పెరిగిపోయింది. దీనికి తోడు మార్చి, ఏప్రిల్‌ రెండు నెలలకు ఒకేసారి బిల్లు తీయడంతో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని అధికారులు అంటున్నారు. ఎంత వినియోగం పెరిగినా రూ.500 నుంచి ఏకంగా రూ.3500 వాడేంత పెరుగుతుందా..? ఇది వినియోగదారుల ప్రశ్న. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో ఉంటే గత నెలలో వచ్చిన బిల్లు కన్నా 25 నుంచి 30 శాతం అదనంగా వచ్చే అవకాశం ఉం ది. రూ.500 చెల్లించే వినియోగదారుడికి రూ.625 -650 వచ్చే అవకాశం ఉంది. మహా అయితే వెయ్యి లోపు రావ చ్చు. ఏకంగా రూ.3500 ఎలా వస్తుందని జనం ప్రశ్నిస్తున్నారు. దీనికి అధికారుల వద్ద సమాధానం లేదు. సాంకేతి క లోపం వల్ల అలా జరిగి ఉండవచ్చు. మండల స్థాయిలో విద్యుత్‌శాఖ ఏఈని కలిసి సమస్య పరిష్కరించుకోండి, అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో విద్యుత్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్‌ రూం 8332969801, 7382623163 కాల్‌ చేసి సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు వందకు పైగా ఫిర్యాదులు వస్తుండడంతో విద్యుత్‌ బిల్లుల పెంపు తీవ్రత ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. 


సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం..: శ్రీనివాసులు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, కడప 

లాక్‌డౌన్‌ వల్ల గృహ విద్యుత్‌ వినియోగం పెరిగి కొంత బిల్లు పెరిగిన మాట వాస్తవమే. రెండు నెలల రీడింగ్‌ ఒకేసారి తీయడం వల్ల కొంత గందరగోళ సమస్య ఉంది. రెండు నెలల యూనిట్లను రెండు నెలలకు  కేటాయించి బిల్లులు వేస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తాం. మే నెలలో వాడిన కరెంటు జూన్‌ లో రీడింగ్‌ తీస్తే ఈ సమస్య ఉండదు. ఎవరికైనా ఎక్కువ బిల్లు వచ్చిందని అనుకుంటే మండల స్థాయి ఏఈని కలిసి పరిష్కరించుకోవచ్చు. అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నెంబర్లకు ఫోను చేసి సమస్య నివృత్తి చేసుకోవచ్చు. సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే సరి చేస్తాం.


రూ.5 వేలు వచ్చింది..: శివారెడ్డి, రాయచోటి

మా మామ కృష్ణారెడ్డి కుటుంబం రాయచోటి పట్టణం ఎస్‌ఎన్‌కాలనీలో ఉంటోంది. మార్చి నెల వరకు కరెంటు బిల్లు సుమారు రూ.750 వచ్చేది. అయితే ఇప్పుడు రూ.4,902 చెల్లించాలని బిల్లు వచ్చింది. అసలే కరోనాతో ఆదాయం లేక ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంత బిల్లు రావడం దారుణం. కరెంటు బిల్లుల విషయంపై ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించాలి.


పేదోడి ఇంటికి రూ.30,999 బిల్లు: పెనుబాకం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్‌, రైల్వేకోడూరు 

నాకు ఇంట్లో రెండు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ మాత్రమే ఉన్నాయి. ప్రతి నెలా విద్యుత్‌ బిల్లు రూ.300 నుంచి 400 మాత్రమే వచ్చేది. అయితే ఈనెల బిల్లు రూ.30,999 వచ్చింది. దీంతో దిక్కుతోచక ఎందుకు ఇంత బిల్లు వచ్చిందని విద్యుత్‌ అధికారులను అడగ్గా మాకు తెలియదని, పైఅధికారులను అడగాలని సమాధానం ఇచ్చారు.  పేదోడినైన నేను ఇంత బిల్లు ఎలా చెల్లించేది. ఇప్పటికైనా అధికారులు నా సమస్యను పరిష్కరించాలి.


ఒకే నెలకు ఇంత బిల్లా..: సోమయ్య, పోరుమామిళ్ల

మార్చిలో విద్యుత్తు బిల్లు రూ.490 చెల్లించాను. అయినా ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.3602 వచ్చింది. పోరుమామిళ్లలో దాదాపు 12 సంవత్సరాలుగా నివాసం ఉన్నాను. అప్పటి నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నాను. మేము ఇంట్లో రెండు బార్‌లైట్లు, రెండు ఫ్యాన్లు, ఫ్రిజ్‌ మాత్రమే ఉపయోగిస్తున్నాము. ఒకే నెలలో ఇంత అదనపు బిల్లు రావడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

Updated Date - 2020-05-18T22:44:24+05:30 IST