Abn logo
Oct 13 2021 @ 10:58AM

ఏసీలు ఆపేయండి..!

బొగ్గు నిల్వలు తగ్గాయన్న ప్రచారంతో రానున్న రోజుల్లో కరెంట్‌ కోతలు తప్పవన్న భావన వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పొదుపు మంత్రం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. మన వంతు ప్రయత్నం చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని అంటున్నారు.


బొగ్గు నిల్వల కొరతతో కరెంట్‌ కోతల భయం

డిమాండ్‌ పెరుగుతూ పోతే...

యూనిట్‌ రూ.20కి కొనాల్సిన దుస్థితి

విద్యుత్‌ ఆదాపై నిపుణుల సూచనలు

విద్యుత్‌ పొదుపు చేద్దాం.. కోతల బాధ తప్పించుకుందాం

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ జోన్‌లో మొత్తం 55 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా 5.5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. వేసవిలో అయితే 7 కోట్ల యూనిట్లకు చేరుతుంది. ఇదే తరహాలో విద్యుత్‌ డిమాం డ్‌ కొనసాగితే సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు వస్తాయని విద్యుత్‌ రంగ నిపుణులు సూచిస్తున్నా రు. విద్యుత్‌ పొదుపు అత్యవసరం అని చెబుతున్నారు.


30 శాతం ఆదాకు చాన్స్‌

నగరంలో కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడినా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గలేదు. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,587 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. గ్రేటర్‌జోన్‌లో 60 శాతం డిమాండ్‌ గృహ విద్యుత్‌దే. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో ఏసీల వాడకం పూర్తిగా తగ్గిస్తే 25 నుంచి 30 శాతం విద్యుత్‌ పొదుపు అయ్యే అవకాశాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. వాషింగ్‌ మెషీన్లు రోజూ కాకుండా 2, 3 రోజులకు ఒకసారి వాడాలని, లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఐరన్‌ బాక్స్‌, రైస్‌ కుక్కర్‌, బోరు మోటర్ల వినియోగంలో కూడా పొదుపు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ర్టికల్‌ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటే వినియోగించుకోవాలని చెబుతున్నారు. లేకుంటే వినియోగదారులకు సబ్సిడీలో అందిస్తున్న ఒక్కో యూనిట్‌ కరెంట్‌ పీక్‌ అవర్‌లో రూ. 15 నుంచి 20కు కొనాల్సిన పరిస్థితులున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భవిష్యత్‌లో యూనిట్‌ కరెంట్‌ ధర రూ. 20 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. 

ఐలాండ్‌ స్కీమ్‌తో ఊరట

ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. ఐలాండ్‌ స్కీమ్‌ (ప్రణాళికాబద్ధ సరఫరా) లో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక విద్యుత్‌ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంటున్నారు. దీని వల్ల ఇప్పటికైతే పెద్దగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. 2012లో నార్త్‌ ఇండియాల్లో గ్రిడ్‌ కుప్పకూలిపోయిందని, దాంతో రెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఐలాండ్‌ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రిడ్‌ కుప్పకూలినా నాలుగు అంచెల తర్వాత కానీ నగరాల్లో సరఫరా నిలిచిపోయే అవకాశాలుండవని చెబుతున్నారు. అయితే, బొగ్గు కొరత దృష్ట్యా విద్యుత్‌ను  పొదుపుగా వాడాల్సిన అవసరం ఉందని సీనియర్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. సమస్యలు రాకముందే మేల్కొంటే మంచిదని సూచిస్తున్నారు.  

పవర్‌కట్‌ అవకాశం లేదు

రాష్ట్రంలో పవర్‌కట్‌ విధించే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అవసరమైన విద్యుత్‌ పూర్తి స్థాయిలో జనరేషన్‌ స్టేషన్లలో అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్‌, గ్రిడ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ బాగుంది. సరఫరా వ్యవస్థపై ట్రాన్స్‌కో ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 

- రత్నాకర్‌ రావు, తెలంగాణ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


పొదుపు తప్పనిసరి

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు ఆపేయండి. ఉన్నప్పుడు కూడా అందరూ ఒకేచోట ఉండేలా ప్రయత్నించండి. రిఫ్రిజిరేటర్‌ పెట్టిన ప్రదేశానికి, గోడకు మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉండాలి. వాషింగ్‌ మెషీన్‌లో లోడుకు తగ్గట్టుగా దుస్తులు వేయాలి. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే పొదుపు తప్పనిసరి.

- నక్కా యాదగిరి, ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్‌ బోర్డు సభ్యుడు

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...