వ్యవసాయ విద్యుత్‌తో.. యూనిట్‌కు 8.14 నష్టం!

ABN , First Publish Date - 2022-01-20T07:03:51+05:30 IST

‘‘వ్యవసాయానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ను అందించడానికి అయ్యే వ్యయం రూ.9.20 కాగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల డిస్కమ్‌లకు వచ్చేది యూనిట్‌కు రూ.1.06. అంటే వ్యవసాయ..

వ్యవసాయ విద్యుత్‌తో.. యూనిట్‌కు 8.14 నష్టం!

ప్రభుత్వ విధానంతో డిస్కమ్‌లకు కష్టాలు.. యూనిట్‌ విద్యుత్‌కు వ్యయం రూ.9.20

 ప్రభుత్వ సబ్సిడీతో వచ్చేది రూ.1.06

 ఏటేటా పెరుగుతున్న సరఫరా వ్యయం

 అదే నిష్పత్తిలో సబ్సిడీ పెంచని ప్రభుత్వం

 డిస్కమ్‌లు ఇచ్చిన నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘వ్యవసాయానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ను అందించడానికి అయ్యే వ్యయం రూ.9.20 కాగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల డిస్కమ్‌లకు వచ్చేది యూనిట్‌కు రూ.1.06. అంటే వ్యవసాయ పంపుసెట్లకు ఒక యూనిట్‌ విద్యుత్‌ను అందించడం వల్ల రూ.8.14 నష్టం వస్తుంది’’ ఇవి సాక్షాత్తూ దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌) తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ)కి అందించిన నివేదికలోని వాస్తవాలు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించిన నేపథ్యంలో ఏ వర్గాల నుంచి ఏ మేర ఆదాయం వస్తుంది? ఏ వర్గాలకు విద్యుత్తు అందించడానికి అయ్యే వ్యయం ఎంత? అనే లెక్కలు తీయగా.. ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2022-23లో వ్యవసాయ పంపుసెట్లకు 11182 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను అందించాల్సి ఉంటుందని అంచనా వేసిన ఎస్పీడీసీఎల్‌.. దీనివల్ల ప్రభుత్వం నుంచి రూ.1130 కోట్ల మేర సబ్సిడీ వస్తుందని గుర్తు చేసింది. వాస్తవానికి వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరిగినా.. ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇక ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీల్‌)లో 2022-23లో వ్యవసాయ విద్యుత్‌కు 7525 మిలియన్‌ యూనిట్లు అవసరమని అంచనా వేశారు. దీనికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.3285 కోట్లు కాగా.. వినియోగదారుల నుంచి చార్జీల రూపంలో మరో రూ.56 కోట్లు రానుంది. ఈ లెక్కన ఎన్పీడీసీఎల్‌లో వ్యవసాయానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ అందించడానికి రూ.8.96 అవుతుండగా.. ఆదాయం సబ్సిడీ కలుపుకొని యూనిట్‌కు రూ.4.44 మాత్రమే రానున్నాయి. అంటే ఒక యూనిట్‌కు రూ.4.52 నష్టం వస్తుంది.  


వ్యయం ఎందుకు పెరిగినట్లు?

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్పీడీసీఎల్‌లో వ్యవసాయ పంపుసెట్లకు ఒక యూనిట్‌ విద్యుత్‌ అందించడానికి రూ.5.05 అయిన వ్యయం మూడేళ్లలో రూ.9.20కు చేరింది.  ఎన్పీడీసీఎల్‌లో 2018-19లో ఇందుకు యూనిట్‌కు రూ.5.57 కాగా, 2022-23లో రూ.8.96 అవుతుందని లెక్క తేల్చారు. వ్యవసాయ విద్యుత్‌ వ్యయం ఇంతగా పెరగడానికి.. ఇతర అన్ని రకాల విద్యుత్‌ పంపిణీ, వాణిజ్య నష్టాలను కూడా ఈ ఖాతాలో వేయడమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి వ్యవసాయ విద్యుత్‌ వినియోగం గడిచిన ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2013-14లో 9.78 లక్షల పంపుసెట్లు ఉంటే.. ప్రస్తుతం 23 లక్షల దాకా ఉన్నాయి. 2013-14లో వ్యవసాయానికి 7 గంటలే కరెంట్‌ ఇవ్వడంతో వినియోగం 4361.35 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉండేది. కానీ, 2022-23లో వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటుకు 18,707 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని డిస్కమ్‌లు లెక్కగట్టాయి. ఇదే నిష్పత్తిలో ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందాల్సిన మొత్తం పెరగాల్సి ఉండగా.. రూ.4415 కోట్లు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఆశించిన మేర సబ్సిడీ అందకపోవడం కూడా డిస్కమ్‌లపై తీవ్రంగా ప్రభావం చూపించే అంశాల్లో ఒకటి అవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగానికి తగ్గట్టుగా ప్రభుత్వం సబ్సిడీ పెంచాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


సబ్సిడీ పెంచాల్సిందే

డిస్కమ్‌ల నష్టాలకు ప్రభుత్వ విధానమే ప్రధాన కారణం. విద్యుత్‌ వినియోగం పెరిగే కొద్దీ ప్రభుత్వం సబ్సిడీ కూడా పెంచాలి. 2018-19లో రూ.5940 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని ఈఆర్‌సీ ఆదేశాలు ఇస్తే.. ప్రభుత్వం రూ.4984 కోట్లే ఇచ్చింది. మొత్తం సబ్సిడీ ఇవ్వకపోతే కమిషన్‌ను సంప్రదించాలని ఆదేశాలిచ్చినా డిస్కమ్‌లు పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల విద్యుత్‌ కొనుగోలు వ్యయం పెరగడం, రెన్యువబుల్‌ విద్యుత్‌ను మస్ట్‌ పవర్‌ జాబితాలో పెట్టిన కారణంగా థర్మల్‌ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేసి, స్థిర చార్జీలు చెల్లించడం వంటి కారణాలతోనే విద్యుత్‌ సరఫరా వ్యయం కూడా పెరుగుతోంది.  

-వేణుగోపాల్‌రావు, విద్యుత్‌ రంగ విశ్లేషకులు 

Updated Date - 2022-01-20T07:03:51+05:30 IST