హిమపాతం దెబ్బతో విలవిల్లాడుతున్న టెక్సాస్ !

ABN , First Publish Date - 2021-02-20T16:39:15+05:30 IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హిమపాతం దెబ్బతో విలవిల్లాడుతోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

హిమపాతం దెబ్బతో విలవిల్లాడుతున్న టెక్సాస్ !

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హిమపాతం దెబ్బతో విలవిల్లాడుతోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, శీతలగాలులు వీస్తుండడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, విద్యుత్తు పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవడం అక్కడి ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగించే విషయం. అయితే, టెక్సాస్​లో దాదాపు 3.25 లక్షల నివాసాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఇంకా విద్యుత్తుకు దూరంగానే ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నాటికి వరుసగా ఐదో రోజు ప్రజలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే మగ్గుతున్నారు. 


ఇదిచాలదంటూ టెక్సాస్​లోని ప్రజలకు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సురక్షిత తాగునీరు, ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతల వాతావరణ పరిస్థితులతో పైపులైన్లలో నీరు గడ్డకట్టుకుపోవడం వల్ల తాగునీరు సరఫరా ఆగిపోయింది. అటు రహదారులను మంచు కప్పివేయడంతో ఆహార పదార్ధాల రవాణా నిలిచిపోయింది. దీంతో మంచి నీరు, ఆహార పదార్థాలు దోరుకుతున్న కొన్ని ప్రాంతాలలో వాటి కోసం జనాలు భారీగా బారులు తీరుతున్నారు. 


ఆహారం, త్రాగునీటి కోసం టెక్సాస్ ప్రజలు పడుతున్న పాట్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ టెక్సాస్‌లోని సుమారు వందకు పైగా కౌంటీలలోని ప్రజలకు మంచినీరు అందడం లేదు. ఇక మంచు తుఫాన్ ధాటికి ఇప్పటివరకు యూఎస్ వ్యాప్తంగా 40 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. టెక్సాస్, మిస్సిసిప్పీ, లూసియానాలో కలిపి సుమారు 5.80 లక్షల మంది విద్యుత్, త్రాగునీరు లేక అల్లాడుతున్నట్లు సమాచారం.  



Read more