Abn logo
Oct 29 2020 @ 01:28AM

పంచాయతీలకు ’’పవర్‌’’ షాక్‌

Kaakateeya

వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ ఏజెన్సీకి

గడువు ముగిసినా పూర్తికాని అగ్రిమెంటు

ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న సర్పంచ్‌లు


మంచిర్యాల, అక్టోబరు 28: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు తెలం గాణ ప్రభుత్వం ’’పవర్‌’’ షాక్‌ ఇచ్చింది. వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలను తప్పించింది. ఈ నిర్ణయంతో పంచాయతీల పాలక వర్గాలు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. పంచాయతీల నిర్ణయాధికారాలపై ప్రభుత్వ పెత్తనమేంటని మండిపడు తున్నాయి. కరెంట్‌ బిల్లుల భారం తగ్గించుకోవడానికి ప్రత్నామ్నాయ మార్గాలను పంచాయత్‌రాజ్‌ శాఖ అన్వేశించింది. ఈ మేరకు మున్సిపా లిటీల మాదిరి పంచాయతీల్లోనూ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఈడీ దీపాల సరఫరా, నిర్వహణలో సమర్థవం తంగా పని చేస్తున్న ఇంధన పొదుపు సేవా సంస్థ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు వీఽధి దీపాల నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు అప్ప గించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), గ్రామ పంచాయతీలు, ఈఈఎస్‌ఎల్‌ సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకొనేందుకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో కమాం డ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  


నిర్వహణ బాధ్యత ఈఈఎస్‌ఎల్‌పైనే..

ఒప్పంద కాలంలో ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఈఈ ఎస్‌ఎల్‌ సంస్థపైనే ఉండనుంది. బల్బుల బిగింపు, నిర్వహణతోపాటు ఇంధన పొదుపులో భాగంగా టైమర్లను కూడా సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈఈఎస్‌ఎల్‌ సంస్థ పనితీరును క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలు మదింపు చేయాలని, నేషనల్‌ లైట్స్‌ కోడ్‌ ప్రమాణాలకు అనుగుణంగా వీధి దీపాలను ఏర్పాటు చేశారో లేదో పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కరెంటు బిల్లులను మాత్రం స్థానిక పంచాయతీలు సంస్థకు క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. అసలే సరిపడా బడ్జెట్‌లేక అంగలారుస్తున్న పంచాయతీ లకు నెలవారీ కరెంటు బిల్లుల చెల్లింపు భారం కానుంది. జిల్లాల్లో సింహభాగం గ్రామ పంచాయతీ లకు సరిపడా బడ్జెట్‌ లేదు. నిధుల కొరతతో బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో డీపీవో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో గ్రామ పంచాయతీల పరిస్థి తి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న అరకొర నిధులను కరెంటు బిల్లుల రూపంలో చెల్లిస్తే పంచాయతీల పరిధిలో పారిశుధ్య నిర్వహణ, ఇతరత్రా పనులకు ఆదాయం ఎక్కడ నుంచి తీసుకు వచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు..

ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు పంచాయతీల్లోని వీధి దీపాల బాధ్యతలను కట్టబెట్టడాన్ని సర్పంచ్‌లు తప్పుబడుతున్నారు. పంచాయతీ రాజ్‌ చట్టం సెక్షన్‌ -32 ప్రకారం పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అధికారాలు సర్పంచ్‌లకు ఉంటాయని, వీటికి కత్తెర పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సర్పంచ్‌లు చెబుతున్నారు.  ఈ క్రమంలో ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు పనులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ తీర్మానం చేసేందుకు ససేమిరా అంటున్నారు. కాగా తమ పదవీకాలం నాలుగేళ్లలో ముగియనుందని, అనంతరం మూడేళ్ల పాటు కొనసాగే కార్యక్రమానికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నా రు. కాగా ఈ నెల 28 లోపు ఒప్పందాలు చేసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ డైడ్‌లైన్‌ విధించింది. దీంతో తీర్మానం కోసం సర్పంచ్‌లకు నచ్చజెప్పడం అధికారులకు తలనొప్పిగా మారింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 311 గ్రామ పంచాయతీలకుగాను ఒక్క జైపూర్‌ మండలంలో 20 పంచాయతీల్లో 14 పంచాయతీలు మాత్రమే తీర్మానాల ప్రక్రియ ముగించాయి. మిగతా పంచాయతీల్లో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


సర్పంచ్‌లకే నిర్వహణ బాధ్యతలు ఉండాలి..డేగ బాపు, సర్పంచ్‌ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు

ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమే అయి నా నిర్వహణ బాధ్యతలు మాత్రం సర్పంచ్‌లకే ఉండాలి. ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు అప్పగిస్తే గ్రామాల్లో బల్బులు మాడిపోయిన సందర్భంలో సంస్థ ప్రతినిధులు వచ్చే వరకు ఆగాల్సిందే. సంస్థ ప్రతినిధులు జిల్లా అంతటా పర్యవేక్షించాల్సి రావడంతో సేవలు అందడంలో అలస్యం అవుతుంది. దీంతో ప్రజలు సర్పంచ్‌లను నిలదీసే అవకాశం ఉంటుంది. 


ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలి..నారాయణరావు, మంచిర్యాల డీపీవో

ప్రభుత్వ నిర్ణయాన్ని పంచాయతీలు అమలు చేయాలి. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో విద్యుత్‌ వినియోగంలో చాలా వరకు ఆదా అవుతుంది. గ్రామాల్లో విద్యుత్‌ బిల్లుల రూపంలో ఖర్చులు సైతం అదా అవుతాయి. సర్పంచ్‌లు తీర్మానాలు పూర్తి చేసేందుకు సహకరించాలి.

Advertisement
Advertisement