విద్యుత్‌షాక్‌కు ముగ్గురు బలి

ABN , First Publish Date - 2021-10-18T05:24:29+05:30 IST

విద్యుత్‌షాక్‌కు ముగ్గురు బలి

విద్యుత్‌షాక్‌కు ముగ్గురు బలి
ప్రమాదస్థలంలో విపిన్‌ కుమార్‌ మృతదేహం

సత్తుపల్లి, తల్లాడ, నేలకొండపల్లి మండలాల్లో ఘటనలు

సత్తుపల్లిరూరల్‌/ తల్లాడ/ నేలకొండపల్లి, అక్టోబరు 17 : విద్యుత్‌షాక్‌ ఖమ్మం జిల్లాలో ముగ్గురిని బలితీసుకుంది. ఆదివారం నేలకొండపల్లి, సత్తుపల్లి, తల్లాడ మండలాల్లో జరిగిన ఈ వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు చేసేందుకు జార్ఘండ్‌ రాష్ర్టానికి చెందిన విపిన్‌కుమార్‌ (21) అనే యువకుడు ఏవీఆర్‌ క్యాంప్‌లో కూలీగా పనికి కుదిరాడు. ఈ క్రమంలో ఆదివారం విద్యుత్‌ సమస్య తలెత్తడంతో సమీపంలోని స్తంభం ఎక్కి తీగను సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై విపిన్‌కుమార్‌ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఏవీఆర్‌ కంపనీ మేనేజర్‌ ప్రేమ్‌సుందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారుడైన ఓబుల రామనరసింహారెడ్డి (32) విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రామనరసింహరెడ్డి పుణ్యస్నానమాచరించి తడి వస్ర్తాలను తీగపై ఆరవేస్తుండగా దానికి విద్యుత్‌ ప్రసాదం జరిగి.. షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి భార్య శిరీష ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఆరు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కుమారులుండగా.. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఇక నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం గ్రామానికి చెందిన తోట పద్మ(40) చికెన్‌ షాపు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం డ్రెస్సింగ్‌ చేసేందుకు కోళ్లను మిషన్‌లో వేసి నీళ్లు పోయగా.. విద్యుత్‌ ప్రసారం జరిగి షాక్‌కు గురై.. ఆమె డ్రెస్సింగ్‌ మిషన్‌పై పడి స్పృహకోల్పోయింది. ఆ తర్వాత బయటనుంచి వచ్చిన భర్త మృతురాలి భర్త విశ్వనాథం విద్యుత్‌ సరఫరాను నిలిపివేపి పద్మను బయటకు తీయగా.. అప్పటికే పద్మ మృతి చెందింది. ఈ ఘటనపై ట్రెయినీ ఎస్‌ఐ కుశకుమార్‌ కేసు నమోదు చేశారు. మృతురాలికి భర్త, ఇరువురు కుమారులున్నారు.

Updated Date - 2021-10-18T05:24:29+05:30 IST