వైసీపీలో పదవుల లడాయి

ABN , First Publish Date - 2021-07-17T05:59:10+05:30 IST

అధికార వైసీపీలో కార్పొరేషన్‌ పదవుల లడాయి తీవ్రమైంది. జిల్లాలోని నాయకులు చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తు న్నారు.

వైసీపీలో పదవుల లడాయి

మహిళలకే సగం ఇవ్వాలంటున్న జగన్‌

బ్రహ్మానందరెడ్డికి చెక్‌?

ముందుకొచ్చిన సత్యనారాయణరెడ్డి 

జూపూడి, కాకుమానుకు  అవకాశం

ఇన్‌చార్జ్‌లలో చైతన్యకు ఖాయం

వెంకయ్య, రాంబాబులకు పాత పదవులు 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

అధికార వైసీపీలో కార్పొరేషన్‌ పదవుల లడాయి తీవ్రమైంది. జిల్లాలోని నాయకులు చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తు న్నారు. కార్పొరేషన్‌ పదవులలో సగం మహిళలకే ఇవ్వాలన్న నిబంధన ఇబ్బందిగా మారింది. జిల్లాలో పదవులు ఇవ్వాలనుకున్న పలువురు స్థానంలో వారి భార్యలు లేక కుటుంబంలోని మహిళలకు కట్టబెట్టే దిశగా అడుగులేస్తున్నారు.  జాబితాను రేపోమాపో అధికారికంగా ప్రకటించనున్నారు. గత మూడు,నాలుగు రోజులుగా కార్పొరేషన్‌ పదవులను ఇచ్చే ప్రతిపాదనల్లో పలు మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న బత్తుల బ్రహ్మానందరెడ్డి పేరు వెనక్కిపోయింది. ఆయన స్థానంలో జిల్లా నుంచి కనిగిరి నియోజకవర్గానికి చెందిన సత్యనారాయణ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. తొలుత బ్రహ్మానందరెడ్డికి శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్‌ పదవి ఖాయమనుకున్నారు. ఆయన స్థానంలో ముందుకొచ్చిన సత్యనారాయణ రెడ్డికి ఆ పదవి కేటాయించాలనుకోగా ఆయన కోరిక మేరకు రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పీఠాన్ని కేటాయించినట్లు తెలిసింది. హెచ్‌ఎంపాడు మండలం సీతారామపురానికి చెందిన సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. కాంగ్రెస్‌, ఆ తర్వాత వైసీపీలోను యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. దీంతో బ్రహ్మానందరెడ్డికి అవకాశాలు సన్నగిల్లాయి.  అయితే విజయసాయి రెడ్డిలాంటి సీనియర్‌ నాయకులు జోక్యం చేసుకుని బ్రహ్మానందరెడ్డికి పదవి ఇవ్వాలని మంత్రి బాలినేనిని కోరినట్లు తెలుస్తోంది. ఎస్‌సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావుకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకోవైపు ఒంగోలుకి చెందిన కాకుమాను రాజశేఖర్‌ని లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పదవికి ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇన్‌చార్జ్‌ల విషయానికి వస్తే బాచిన కృష్ణచైతన్యకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. పర్చూరు ఇన్‌చార్జ్‌ రామనాథం బాబుని తిరిగి డీసీఎంఎస్‌ చైర్మన్‌గాను, కొండపి ఇన్‌చార్జ్‌ వెంకయ్యను సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌గాను కొనసాగించాలని నిర్ణయించారు.


మహిళా కోటాతో ఇబ్బంది 

మొత్తం పదవుల్లో సగం పదవులకు మహిళలనే ఎంపిక చేయాలన్న సీఎం నిర్ణయం తలనొప్పిగా మారినట్లు తెలిసింది. దీంతో ఆయా పదవులు ఇవ్వాలని భావించిన నాయకులకు ఫోన్‌ చేసి వారి సతీమణులు లేక వారి కుటుంబంలోని మహిళల పేర్లు, వారి బయోడేటాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. అవకాశం ఉన్నమేరకు ఒంగోలు నియోజకవర్గం నుంచి అధిక మందికి అలాంటి అవకాశం కల్పించాలని మంత్రి బాలినేనికి సీఎం నేరుగా సూచించినట్లు తెలుస్తోంది. ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఒడా) చైర్మన్‌ పదవికి ఆయన సింగరాజు వెంకటరావు పేరు సూచించగా ఆయన సతీమణి పేరుని కూడా తీసుకున్నారు. అలాగే డైరెక్టర్‌ పదవులు, జిల్లాస్థాయి నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్న మరికొందరి నుంచి కూడా వారి స్థానంలో మహిళల పేర్లని స్వీకరిస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. టైలర్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ పదవికి మంత్రి బాలినేని ఒంగోలుకి చెందిన ఒక మహిళ పేరుని ప్రతిపాదించారు. మహిళల కోటాను దృష్టిలో ఉంచుకుని ఆమెకే చైర్మన్‌ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. విషయం తెలిసి ఒంగోలులో ప్రతిపక్షంలోనూ బాలినేనితో నడిచిన టైలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఉలిచికి చెందిన ట్రేడ్‌ యూ నియన్‌ నేత రాజేశ్వరరావుకి ఎస్‌సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఖరారైంది. అలాగే మార్కాపురం నియోజకవర్గంలో విద్యాసంస్థల అధిపతులుగా ఉన్న ఆలీబేగ్‌, వెన్నా హనుమారెడ్డి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు పదవికి హనుమారెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్‌లో ఒక దాంట్లో ఆలీబేగ్‌కి అవకాశం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 


Updated Date - 2021-07-17T05:59:10+05:30 IST