Jul 24 2021 @ 13:43PM

Prabhas: ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం.. బిగ్ బిపై డార్లింగ్ క్లాప్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభ‌మైంది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌, బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ తొలి షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఆయ‌న‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన ఫొటోను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ‘‘ప్రత్యేకమైన గురు పూర్ణిమ రోజున సినిమా ప్రారంభమైంది. ఇండియన్ సినిమా గురువు అయిన అమితాబ్ బచ్చన్‌పై ప్ర‌భాస్ క్లాప్ కొట్టాడు’’ అని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.  ఈ సినిమాకు ‘ప్రాజెక్ట్ కె’ అనే ఆస‌క్తిక‌ర‌మైన వ‌ర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. క్లాప్ బోర్డ్‌లో ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె ప్ర‌భాస్ జోడీగా న‌టిస్తుంది. వైజయంతీ మూవీస్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమంటే.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర‘ రిలీజ్ రోజునే..ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం కావడం.