కన్నుల పండువగా ప్రభల ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-01-16T06:32:46+05:30 IST

కనుమ పండుగ రోజున ప్రభల తీర్థం కనువిందుగా సాగింది. యువకులు ఉత్సాహం తో, కేరింతలతో ప్రభలను ఎత్తుకుని ఊరేగింపు నిర్వహిం చారు.

కన్నుల పండువగా ప్రభల ఉత్సవాలు

ముమ్మిడివరం, జనవరి 15:  కనుమ పండుగ రోజున ప్రభల తీర్థం కనువిందుగా సాగింది. యువకులు  ఉత్సాహం తో, కేరింతలతో ప్రభలను ఎత్తుకుని ఊరేగింపు నిర్వహిం చారు.  పల్లిపాలెం, క్రాపచింతలపూడి, కొత్తలంక గ్రామాల్లో ప్రభల తీర్థం  వైభవంగా నిర్వహించారు. ప్రభలపై ఆయా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపు నిర్వ హించారు. పల్లిపాలెంలో జరిగిన ప్రభల తీర్థానికి ప్రత్యేకత సంతరించు కుంది.  కొబ్బరితోటలు, పంటపొలాలు,  పంట కాల్వలు, చెరు వులను దాటుకుంటూ అచ్ఛెరభ శరభ.. అల్లాల వీర.. అంటూ వివిధ గ్రామాల నుంచి  ప్రభలను బాణసంచా కాల్పులతో తీర్ధస్థలికి తీసుకువచ్చారు.  పల్లిపాలెంలోని ప్రభల తీర్ధానికి కొమానపల్లి, కొత్తలంక, నడిమిలంక, ముమ్మిడివరం అగ్రహారం, వడ్డిగూడెం, రాజుపాలెం, చింతలమెరక గ్రామాల ప్రభలను తీసుకువచ్చారు. పల్లిపాలెంలో  అధికసంఖ్యలో ప్రజలు తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకున్నారు. ప్రభల తీర్థం నిర్వాహకులు పెన్మెత్స జగ్గప్పరాజు, పెన్మెత్స చిట్టిరాజులు  ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముమ్మిడివరం సీఐ ఎస్‌.జానకీరామ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేవీ నాగార్జున, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
రావులపాలెం రూరల్‌: దేవరపల్లి జడ్పీ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ప్రభలతీర్ధాన్ని వైభవంగా నిర్వహించారు.  దేవ రపల్లి పరిసర గ్రామాల నుంచి ప్రభలను బ్యాండు మేళాలు, డప్పువాయిద్యాలు, గరగనృత్యాలతో ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ప్రభలకు ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. అనం తరం  తీర్థం జరిగింది.  గ్రామోత్సవం నిర్వహించారు.
అల్లవరం: పలు గ్రామాల్లో కనుమ పండుగ సందర్భంగా  ప్రభల తీర్థాలు ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి, కొమ రగిరిపట్నం, మొగళ్లమూరి, ఇతర గ్రామాల్లో ప్రభలను ఊరే గింపుగా లక్ష్మణేశ్వరం తీసుకువచ్చారు. లక్ష్మణేశ్వరం శివాల యం వద్ద శుక్రవారం ప్రభల తీర్థం జరిగింది. బెండమూర్లంక గ్రామంలో ఉత్సవప్రభను పూజల అనంతరం ఊరేగించారు.
 అమలాపురం టౌన్‌: అమలాపురం వంటెద్దువారి వీధిలో  ప్రభల తీర్థం వైభవంగా నిర్వహించారు. శ్రీగణపతి, శ్రీగని కమ్మ అమ్మవారి ప్రభల తీర్థ మహోత్సవానికి పలువురు ప్రముఖలు హాజరయ్యారు.  ఊరేగింపులో ఈదరపల్లి ప్రభలు, శ్రీశేషశయన, శ్రీగనికమ్మ, శ్రీకనకదుర్గ, శ్రీమెట్లకాలనీ ప్రభలు పాల్గొన్నాయి. టీడీపీ పార్లమెంటు ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధర్‌, మాజీ మున్సిపల్‌ యాళ్ల నాగసతీష్‌లు బళ్లపూజ నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఎడ్ల బండిపై తిరిగారు. భట్నవిల్లి, గున్నేపల్లి అగ్రహారం, సాకుర్రు, బండారులంక  గ్రామాల్లో ప్రభల ఊరేగింపులు, తీర్థాలు నిర్వహించారు.  
ఐ.పోలవరం: కనుమరోజున ప్రభలతీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. పెదమడి తీర్థమహోత్సవ ప్రాంతానికి పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రభలు కొలువుదీరాయి. అధికసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పెదమడి మొక్కతోట తీర్థమహోత్సవం ఘనంగా జరిగింది.  పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
 ఉప్పలగుప్తం: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రభల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. యువత ఆధ్వర్యంలో ప్రభలను సంప్రదాయ రీతిలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివాలయాల వద్ద పూజ అనంతరం ప్రభలను గ్రామాల్లో ఊరేగించారు. గొల్లవిల్లి, వాడపర్రు, చల్లపల్లి, ఎస్‌.యానాం, విలసవిల్లి, ఎన్‌.కొత్తపల్లి, సన్నవిల్లి గ్రామాల్లో జరిగిన ప్రభల ఉత్సవాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గొల్లవిల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాకు చెందిన బ్యాండు కళాకారుడు వీరబాబును సన్మానించారు.
పి.గన్నవరం: ఈశ్వరుని ప్రతిరూపంగా భావించే ప్రభలు పచ్చని పంటపొలాలు, పంటకాలువలను దాటుకుని ఒక చోట కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చాయి. కనుమ పండుగ రోజు అంబాజీపేట మండలం చిరతపూడి, కొత్తపేట మండలం అవిడి, మోడేకుర్రు, పి.గన్నవరం మండలం నరేంద్రపురం, కుందాలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 35 ప్రభలు ప్రత్యేక పూజలు అనంతరం ఆయా గ్రామాలు నుంచి ఉరేగింపుగా సుమారు 2కిలోమీటర్లు మేర పంటపొలాలు, పంటకాలువలు దాటుకుని కుందాలపల్లి డ్యాంమ్‌ సెంటర్‌కు చేరుకుని భక్తులకు దర్శనమిచ్చాయి.  ముంగండపాలెం శివారు గాజులగుంట ప్రభలదిబ్బలో ఊలిశెట్టివారిపాలెం, కారుపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రభలు కొలువుతీరాయి. నాగుల్లంక, మానెపల్లి గ్రామాల్లో ప్రభల తీర్ధ్థమహోత్సవాలు ఘనంగా జరిగాయి.  నాగుల్లంకలో వివిధ దేవుళ్ల చిత్రాలతో ఏర్పాటుచేసిన ప్రభలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయినవిల్లి:  సంక్రాంతి పండుగ సందర్భంగా అయినవిల్లి శ్రీసిద్ధివినాయకుడికి ధూపసేవ నిర్వహించి స్వామివారిని మూషిక వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. కోలాటం, సన్నాయి బృందం, గంగిరెద్దులు, చిలుకజోస్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా ప్రభల తీర్థం నిర్వహించారు. శివనా మస్మరణతో ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి ముక్తికాంత క్షణముక్తేశ్వరస్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. కమిటీ సభ్యులు మేళతాళాలతో ప్రభలకు ఆహ్వానం పలికారు. అయినవిల్లి శ్రీసిద్ధివినాయకుని ఆలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్బిబాబు పూజలు నిర్వహించారు. శ్రీసిద్ధివినాయక ప్రభను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.తారకేశ్వ రరావు, కొండేటి వెంకటేశ్వరరావు, గుత్తుల నాగబాబు, గన్నవరపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
మామిడికుదురు: ప్రభలతీర్థాన్ని మామిడికుదురు శివారు కొర్లగుంటలో కనులపండువగా నిర్వహించారు. పెదపట్నం నుంచి 12ప్రభలు, మామిడికుదురు, పాశర్లపూడి, ఈదరాడ, నగరం తదితర గ్రామాల నుంచి భక్తులు ప్రభలను భారీ ఊరేగింపుగా తీర్థ స్థలికి తీసుకువచ్చారు. పెదపట్నం  నుంచి  ప్రభలను ప్రధాన పంటకాల్వలో గుండెల్లోతు నీటిలో ప్రభను మోసుకువచ్చిన దృశ్యాలు  గగుర్పాటుకు గురిచేశాయి. పచ్చని పంట పొలాల మధ్య నుంచి యువకులు ప్రభలను భుజాలపైకెత్తుకుని తీసుకువచ్చిన దృశ్యాలు  కనులవిందుగా చేశాయి.  గ్రామాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ప్రభల్లో కొలువైన స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  తీర్థం వైభవంగా జరిగింది.  

Updated Date - 2021-01-16T06:32:46+05:30 IST