ప్రాక్టీస్‌ కోసం తహతహ

ABN , First Publish Date - 2020-06-13T10:00:21+05:30 IST

ఏ ఆటగాడికైనా పోటీలున్నా, లేకపోయినా ప్రతీ రోజు మైదానంలో ప్రాక్టీస్‌ చేయడం అత్యవసరం. కానీ లాక్‌డౌన్‌ కారణంగా...

ప్రాక్టీస్‌ కోసం  తహతహ

బీసీసీఐ నిర్ణయం కోసం క్రికెటర్ల ఎదురుచూపులు

న్యూఢిల్లీ: ఏ ఆటగాడికైనా పోటీలున్నా, లేకపోయినా ప్రతీ రోజు మైదానంలో ప్రాక్టీస్‌ చేయడం అత్యవసరం. కానీ లాక్‌డౌన్‌ కారణంగా మూడు నాలుగు నెలల పాటు దేశంలోని ఆటగాళ్లంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఇటీవల కేంద్రం ప్రకటించిన వెసులుబాటుతో కొందరు అథ్లెట్లు వ్యక్తిగతంగా అవుట్‌డోర్‌ ప్రాక్టీస్‌ను ఆరం భించారు. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఇంకా మైదానాల్లో కనిపించడం లేదు. ఎందు కంటే బీసీసీఐ ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తు తానికైతే జట్టు ట్రెయినర్‌ నిక్‌ వెబ్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌ సూచించిన రొటీన్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను క్రికెటర్లు అనుసరిస్తున్నారు. ‘కరోనా కారణంగా మేమంతా చాలా జాగ్రత్త గా ఉంటూ మా సహాయక సిబ్బంది సూచించిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు ఇప్పుడున్న వాటిని వారు మారుస్తారు. అప్పటివరకు అంతా ఓపిగ్గా ఉండాల్సిందే’ అని ఓ కాంట్రాక్ట్‌ ఆటగాడు తెలిపాడు. కొవిడ్‌-19 ప్రభావంతో అంతర్జాతీయంగా క్రికెట్‌ కార్యకలాపాలన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. 

నెట్‌ సెషన్స్‌ అవసరం: వాస్తవానికి ఆటగాళ్లంతా ఇన్నాళ్లూ ఇంటికే పరిమితం కావడంతో తిరిగి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ పొందేందుకు వారికి మూడు నుంచి నాలుగు వారా ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇందుకు అవుట్‌డోర్‌ శిక్షణ తప్పనిసరి. ‘మేమం తా తిరిగి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలంటే నెట్‌ సెషన్స్‌లో పాల్గొనాలి. అప్పుడే మా శరీర కండరాలు పూర్వ స్థితికి చేరతాయి. నెట్స్‌లో చాలా రోజుల తర్వాత బ్యాట్‌ పట్టుకో వాల్సి రావడంతో పాటు గంటకు 140కి.మీ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాలి. ఈ సందర్భంగా ఎప్పటిలాగే తిరిగి బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. అందుకే పలు నెట్‌ సెషన్స్‌ అవసరమవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన మానసిక పరిస్థితి తిరిగి యథాస్థితికి రావాలి. అయితే మేమంతా ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం కావడంతో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు’ అని శ్రేయాస్‌ అయ్యర్‌ తెలిపాడు. అలాగే తమకు ఫిట్‌నెస్‌ సాధించేందుకు గరిష్టంగా రెండు వారాల సమయం పట్టవచ్చని పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఆశించాడు. ‘చాలా రోజులుగా శరీరం విశ్రాంతిలో ఉండడంతో పూర్వపు ఫిట్‌ నెస్‌ అందుకోవాలంటే సమయం పడుతుంది. మా బౌలర్లకు తిరిగి లయ అందుకోవడం కష్టం కాబోదు. శిక్షణతో పాటు వామప్‌ మ్యాచ్‌లు ఆడితే కుదురుకోవచ్చు’ అని చాహర్‌ అన్నాడు.

Updated Date - 2020-06-13T10:00:21+05:30 IST