ప్రగ్యా జైస్వాల్‌కి మళ్లీ కరోనా...

క్రమక్రమంగా కరోనా కల్లోలం తగ్గుముఖం పడుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవటంతో జనం మళ్లీ రోడ్ల మీదకు పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నారు. కానీ, ఇంకా మాస్కులు, శానిటైజర్ల శకం పూర్తిగా పోలేదా? ఖచ్చితంగా పోలేదనే చెప్పొచ్చు. అందరం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజా సొషల్ మీడియా పోస్టే ఉదాహరణ...  


ముంబై బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ మళ్లీ కోవిడ్ బారిన పడింది. ఈ విషయం ఆమే స్వయంగా తన సొషల్ మీడియా అకౌంట్లో ప్రకటించింది. ఆదివారం ఉదయం తన ఫాలోయర్స్‌తో హెల్త్ అప్‌డేట్ పంచుకుందామె. ఇదేమంత ఎగ్జైటింగ్ న్యూస్ కాదంటూనే తనకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించింది. అంతే కాదు, తాను పూర్తిగా వ్యాక్సినేట్ అయినప్పటికీ వైరస్ బారిన పడక తప్పలేదని చెప్పింది. గతంలోనూ ప్రగ్యాకు ఓ సారి కరోనా వచ్చింది. ఇప్పుడు రెండోసారి ఆమె మహమ్మారి బారిన పడటం నెటిజన్స్‌ను షాక్‌కు గురి చేసింది. 


ప్రస్తుతం తాను డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు క్వారంటైన్ అయ్యానని చెప్పిన ప్రగ్యా, గత పది రోజుల్లో, ఆమెని కలిసిన అందర్నీ తగిన జాగ్రత్తలు తీసుకోమని కోరింది. ప్రగ్యా జైస్వాల్ నెక్ట్స్ బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో కనిపించనుంది.    

Advertisement