ప్రజాకవి వంగపండు ప్రసాదరావు

ABN , First Publish Date - 2020-08-05T06:32:56+05:30 IST

వంగపండు ప్రసాదరావు వెళ్లిపోయారు. తెలుగు సమాజాలకు ఉత్తరాంధ్ర అందించిన ఉత్తమకళాకారులలో ఆయన ఒకరు. ఏదో ఒక కళను మాత్రమే సాధనచేసిన వాడు కాదు...

ప్రజాకవి వంగపండు ప్రసాదరావు

వంగపండు ప్రసాదరావు వెళ్లిపోయారు. తెలుగు సమాజాలకు ఉత్తరాంధ్ర అందించిన ఉత్తమకళాకారులలో ఆయన ఒకరు. ఏదో ఒక కళను మాత్రమే సాధనచేసిన వాడు కాదు. అతడొక కవి, గాయకుడు, నాటకకర్త, ప్రదర్శనకారుడు. అట్టహాసపు ఆర్భాటపు కచేరీ కళాకారుడు కాదు. ప్రజాకళాకారుడు. మార్పు కోసం తూర్పు కొండల్లో నిప్పు పుట్టినప్పుడు, అతని గొంతులోనుంచి పాట పుట్టింది. ఆదివాసుల ఆగ్రహాన్ని అతని అడుగులు అనువదించాయి. జనం గుండెల చప్పుడుతో కలసి అతను యుగళగీతం పాడాడు. ‘నేను కాదు, ఇతను మీ కవి, ప్రజాకవి’ అంటూ శ్రీశ్రీ నిండుసభలో అతడిని అభిమానించాడు. మూడు వందల పాటల సృజనతో, ఎడతెగని ప్రదర్శనలతో, ఏళ్ల తరబడి ఆడిన నాటకాలతో వంగపండు తన సాహిత్య, కళా, ప్రజాజీవితాన్ని సుసంపన్నంగా గడిపాడు. 


కాలం విసిరిన పసిడిరెక్క. ఒక కాలాన్ని, ఆ కాలంలో జనం నడిచిన కవాతులను అక్షరాలలో, గానంలో బంధించగలిగాడు. కష్టజీవుల సృజనకీ, ఫలితానికీ ఉండే తార్కిక సంబంధాసంబంధాలను అత్యంత సులువుగా, సహజంగా పాటగట్టాడు. నిజమైన అర్థంలో కార్మిక కవి. ప్రజల స్మృతిలో, నోళ్లలో ఉన్న బాణీలను ప్రజాసాహిత్యానికి అనువర్తించిన గొప్ప ప్రజాసాహిత్య కారులలో వంగపండు ఒకరు. తెలంగాణ నుంచి వాగ్గేయకారుడు, ప్రజాప్రదర్శకుడు గద్దర్ మొత్తం తెలుగు సమాజాలను ఉర్రూతలూగించారు. పోయిన సంవత్సరం కన్నుమూసిన అరుణోదయ రామారావు, నాటక, లలిత సంగీతాల బాణీలను విప్లవ సాంస్కృతిక శిబిరంలో ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు, స్వయంగా కవి కూడా. యాభై ఏళ్ల కిందట తెలుగు సమాజం ప్రజా ఉద్యమాలతో ఎంతగా కల్లోలితం, సంక్షుభితం అయ్యిందో, అంతగా మహోన్నత సృజనాత్మకతను ప్రజా ఆచరణలనూ, సాంస్కృతిక రంగంలోనూ వ్యక్తీకరించింది. అటువంటి వ్యక్తీకరణలలో ఒక మేలి గొంతు వంగపండు.


జజ్జనకరి జనారే -పాట సినిమాలోకి రాకముందు కూడా తెలుగునేల మీద సుప్రసిద్ధం. గద్దర్ ఆధ్వర్యంలో జరిగిన జననాట్యమండలి కార్యక్రమాలలో సైతం వంగపండు పాటలు, బాణీలు కలనేతలాగా కలసిపోయేవి. ‘‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవా..’’ పాట- శ్రీకాకుళంలోని సీమకొండకు పిలుస్తూ మొదలయినా, తెలుగు నేల మీది పోరాట కేంద్రాలన్నిటికి పిల్లడిని, పిల్లలనీ ఆహ్వానిస్తుంది. ‘‘చిలకలు కత్తులు దులపరస్తియట’’ అన్న వ్యక్తీకరణ, శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటానికి అందమైన ఉపమారూపకం. ‘‘యంత్రమెట్టా నడుత్తు ఉందంటే’’ అన్న పాట, యంత్రం ప్రతి కదలికలోనూ మానవశ్రమ, ప్రమేయం ఎంత ఉన్నదో చెబుతుంది. ‘ఓడా నువ్వెళ్లిపోకే’ అన్న పాట, నౌకా నిర్మాణకార్మికులు ఎంత కష్టపడి, ఒక్కొక్క విడిభాగం చేర్చి ఓడను చేశాక, దానిని నీటిలో వదిలేటప్పుడు కలిగే దుఃఖాన్ని పలికిన పాట. కార్మికుడి శ్రమ అతడి నుంచి అపహృతమై, పరాయిగా మారిపోతుంది. కానీ, ఉత్పాదకప్రక్రియలో కార్మికులు అనుబంధాలను పెంచుకుంటారు. మానవులుగానే మిగిలిపోతారు. ప్రేమిస్తారు, దుఃఖిస్తారు. ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్’ అన్న పాట - శ్రామికుల అల్పసంతోషం అనంతరం యథాతథ విషాదమే శేషంగా మిగులుతుందని చెబుతుంది. ఉందర్రా మాలపేట- అన్నది, వంగపండు దళితసంవేదనను పలికిన పాట. కుల నిర్మూలన భావజాలం ఇంకా విప్లవశ్రేణులను సున్నితీకరించడానికి ముందే వంగపండు ఈ పాట రాయడం విశేషం. 


వంగపండు ప్రసాదరావు రాసిన రావణా సెందునాలో రాజా నీకొందనాలో, సంగం పెడదాము సంగతేమొ చూద్దాము, ఓట్ల జీపీ వత్తోంది వంటి పాటలు ఆయన ప్రత్యేక బాణీని తెలియజేస్తాయి. ఉత్తరాంధ్ర భాష ఉన్నట్టే, వంగపండు పాట కూడా లలిత లలిత పదాలతో సాగుతుంది. వేగవంతమైన లయ విన్యాసం, పెద్ద శబ్దాలు ఆయన పాటకు అమిరేవి కావు. పదలాలిత్యం ఉన్నంత మాత్రాన, భావంలో తీవ్రత లేకుండా పోదు. చెప్పదలచుకున్న సందేశంలో ఎటువంటి రాజీ ఉండదు. దాదాపు 30 సినిమాలకు వంగపండు రాసిన పాటలు కూడా ఆయన సుప్రసిద్ధమైన కోవలోనివే తప్ప, దారి తప్పినవి కావు. బయట ఉద్యమాల్లో బాగాప్రాచుర్యంలోకి వచ్చిన పాటలే సినిమాల్లోకీ వచ్చాయి. ఆర్. నారాయణమూర్తి మూడున్నర దశాబ్దాల కిందట తన మొదటి సినిమాలోనే, వంగపండు ‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవా’ పాటను చిత్రీకరించారు. భూమిభాగోతం- వంగపండు రాసిన నృత్యరూపకం. ఈ రూపకాన్ని తెలుగుదేశంలో ఎన్ని వందల వేల ప్రదర్శనలు ఇచ్చారో తెలియదు. అంతగా ఇది ప్రాచుర్యం పొందింది. మరొక నాటకం ‘అడివి దివిటీలు’ - రోజుకు అనేక ప్రదర్శనల చొప్పున సినిమా లాగా ఆడిందని చెబుతారు.


1970 దశకం ఆరంభంలో ఉన్నట్టు, వంగపండు చివరి సంవత్సరాలలో లేరు. తొలినాటి ప్రయాణం దశాబ్దాల తరబడి ఎడతెగకుండా సాగినప్పటికీ, రెండు దశాబ్దాలుగా ఆయన ప్రయాణం భిన్నంగా సాగింది. ఆయన అభిమానించిన ఉద్యమం ఆయనను నిలుపుకోలేకపోయిందో, ఆయనే ఆ ఉద్యమంతో నడవలేకపోయారో- చర్చించవలసిందే కానీ, ఆర్థిక దారిద్ర్యం ఆయనకు చాలా కఠినమైన పరీక్షలే పెట్టింది. తరువాత తరువాత నడిచిన దారులు ఆయన గత కీర్తిని కొనసాగించగలిగేవి కావు. అనేక పురస్కారాలు, అవార్డులు ఆయనకు లభించాయి కానీ, అవేవీ వంగపండు స్థాయికి సరితూగేవి కావు. నిబద్ధతకు కొంత కాలం లోటు వచ్చిందనుకున్నా, వంగపండు గడిపిన సుదీర్ఘప్రజా జీవితం, ఆయన అద్భుతమైన సృజన చరిత్రలో నిలిచిపోయేవే. ఒక వెనుకబడిన ప్రాంతానికి, అదే సమయంలో సాహిత్య కళా రంగాలలో గొప్ప వారసత్వమున్న ప్రాంతానికి, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వంగపండు, అనేక నమూనాలను బద్దలు కొట్టారు. చరిత్రలో చిరస్థానాన్ని సాధించుకున్నారు. n

Updated Date - 2020-08-05T06:32:56+05:30 IST