రైతు భరోసా కేంద్రాల్లో పాలఉత్పత్తిదారుల ఆక్రందన

ABN , First Publish Date - 2021-02-24T15:10:05+05:30 IST

ప్రకాశం జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలలో పాలు పోసే పాలఉత్పత్తిదారుల ఆక్రందన వర్ణణాతీతంగా ఉంది.

రైతు భరోసా కేంద్రాల్లో పాలఉత్పత్తిదారుల ఆక్రందన

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలలో పాలు పోసే పాలఉత్పత్తిదారుల ఆక్రందన వర్ణణాతీతంగా ఉంది. గత నెల రోజులుగా పాలు పోస్తున్న పాడి రైతులకు ఎటువంటి చెల్లింపులు చేయకుండా అమూల్ సంస్ధ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రతీ పది రోజులకు ఒకసారి పాలఉత్పత్తిదారులకు అమూల్ సంస్థ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామంటూ  ప్రభుత్వం తరఫున అధికారులు రోజులు గడుపుతున్నారు. రైతు భరోసా కేంద్రాల నుండి వచ్చిన పాలకు వచ్చే రేటుకు.. అక్కడ రైతులకు ఇస్తున్న రేట్లకు తేడాలు ఉన్నాయంటూ వచ్చిన బిల్లుల్లో కూడా అమూల్ నిర్వాహకులు భారీ కోత విధించారు. వచ్చే బిల్లులు రాకపోవటంతో పాటు రావాల్సిన మొత్తం బిల్లుల్లో కూడా కోత విధించటంతో పాల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎన్ఎఫ్ తగ్గుతుందనే సాకుతో ఇప్పటికే భారీగా రేట్లను తగ్గించారని వారు ఆవేదన చెందుతున్నారు.


ఏదైనా సమస్య వస్తే గంటల్లో పరిష్కరిస్తామంటూ తమ వద్ద పాలు పోయించుకున్న అధికారులు పత్తాలేకుండా పోయారని పాలఉత్పత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తామంటూ  ప్రభుత్వ యంత్రాంగం రోజులు గడుపుతున్న వైనం నెలకొంది. చెల్లింపుల విషయంలో తమ పాత్ర ఏమి ఉండదంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించకుంటే గ్రామాల్లోనే అధికారులను నిలదీయాల్సి వస్తుందని అధికారులకు పాలఉత్పత్తిదారుల అల్టిమేటం జారీ చేశారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా జిల్లాలో పాల వ్యాపారం చేస్తూ 25 వేల లీటర్ల పాలను  అమూల్ సంస్థ సేకరిస్తోంది. మరోవైపు ఒంగోలు డెయిరీ ఉద్యోగుల సమస్యలు ఇప్పటి వరకూ పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. 


Updated Date - 2021-02-24T15:10:05+05:30 IST