మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిపై భార్య స్పందన

ABN , First Publish Date - 2021-10-15T17:16:07+05:30 IST

ప్రకాశం: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) మృతిపై భార్య శిరీష స్పందించారు.

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిపై భార్య స్పందన

ప్రకాశం: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) మృతిపై భార్య శిరీష స్పందించారు. ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజంగా భావిస్తామన్నారు. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని, ఆర్కే మృతి చెందారని  ఛత్తీస్ ఘడ్ డీజీపీ ప్రకటించారని... ఆయనకు ఈ సమాచారం ఎవరిచ్చారో చెప్పలేదన్నారు. ఆయన జీవితం ప్రజల కోసం ధార పోశారని, ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడని, నిస్వార్థ విప్లవకారుడని కొనియాడారు. ఉద్యమంలో ఆయన బిడ్డను కూడా పోగొట్టుకున్నారన్నారు. ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహాన్ని తాము అక్కడ నుంచి తెచ్చుకునేలా సహకరించాలని ఆ ప్రభుత్వాన్ని, అక్కడి గ్రామాల ప్రజలకు ఆర్కే భార్య శిరీష విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె టంగుటూరు మండలం, ఆలకూరపాడులో నివాసం ఉంటున్నారు.


మావోయిస్టు పార్టీ అగ్రనేత, చర్చల రామకృష్ణగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే(65) మరణించినట్లు తెలుస్తోంది. దండకారణ్యం పరిధిలోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఆయన మరణించినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తుండగా.. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆయన మరణించారన్న వార్తను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ‘ఆర్కే ఆనుపానులు తెలుసుకునేందుకు పోలీసులు పన్నిన కుట్ర ఇది’ అని ఆరోపిస్తున్నాయి. మోకాళ్ల నొప్పులు సహా పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మరణాన్ని కలిగించే స్థాయిలో లేవని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-15T17:16:07+05:30 IST