Abn logo
Sep 19 2021 @ 16:14PM

గాంధీ కుటుంబం మౌనమేల? : ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉందని సీనియర్ బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు దేశ వ్యతిరేకి అని కెప్టెన్ సింగ్ అన్నారని, దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ స్పందిస్తుందా? చర్యలు తీసుకుంటుందా? అని అడిగారు. 


ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పార్టీ (కాంగ్రెస్) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూను దేశ వ్యతిరేకి అని ఆరోపించారని అన్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ అని చెప్పారు. కాంగ్రెస్‌ను బీజేపీ ఒకే ఒక ప్రశ్న అడుగుతోందన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే ఆ ప్రశ్న అని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ మాట్లాడాలని, తమ వాదనను వినిపించాలని అన్నారు. కాంగ్రెస్ ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుందా? చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో, ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వాతో సంబంధాలు ఉన్నాయని, ఇమ్రాన్, సిద్ధూ స్నేహితులని అన్నారు. కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించినపుడు ఇమ్రాన్‌ను సిద్ధూ ప్రశంసల్లో ముంచెత్తారన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి సిద్ధూను ప్రతిపాదిస్తే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు.


ఇవి కూడా చదవండిImage Caption