కృష్ణమ్మ మహోగ్రం

ABN , First Publish Date - 2020-09-28T09:26:11+05:30 IST

కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు

కృష్ణమ్మ మహోగ్రం

ఎగువ నుంచి భారీగా వరద

శ్రీశైలానికి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

పులిచింతల నుంచి 6 లక్షల క్యూసెక్కులు విడుదల

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక జారీ

రెండో హెచ్చరికకు చేరువగా ప్రవాహం

లంక గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు

సహాయ చర్యలకు కంట్రోల్‌ రూముల ఏర్పాటు


గ్రామం చుట్టూ వరద. కాలు బయటపెట్టే దారి లేదు. ఇంతటి విపత్తులో ఓ ఇంటి యజమానికి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని ట్రాక్టర్‌పై తీసుకుని బయలుదేరారు. ఓ రెండు కిలోమీటర్లు వెళ్లేసరికి దారీతెన్నూ లేదు. మంచంపై పడుకోబెట్టి ఓ రెండు కిలోమీటర్లు మోసుకుంటూ నడిచారు. అక్కడ 108 వాహనంలోకి ఎక్కించగా.. అప్పటికే చనిపోయాడని సిబ్బంది చెప్పారు.  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వరద సహాయక చర్యలకు పలు ప్రాంతాల్లో కంట్రోల్‌ రూములనూ ఏర్పాటు చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం సాయంత్రం 5,10,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, కాగా, ప్రస్తుతం 884 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.0320 టీఎంసీలు ఉన్నాయి. భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,65,040 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 29,540 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 5,94,580 క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్‌కు వెళుతోంది.  కాగా, జూరాల నుంచి 4,21,869 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి మరో 13,447 క్యూసెక్కులు వదులుతున్నారు. సుంకేసుల నుంచి 94,648 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతోంది. 

ప్రకాశం బ్యారేజీకి 5.81 లక్షల క్యూసెక్కులు..

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 5.81 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను క్లియర్‌ స్థాయికి ఎత్తి 5.06 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా, కీసర వాగు నుంచి 50 వేలు, పాలేరు వాగు నుంచి 13,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. సోమవారానికి వరద మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. 


రాత్రికి రెండో హెచ్చరిక: కన్నబాబు

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటి విడుదల ఈ సీజన్‌లో తొలిసారిగా ఐదు లక్షల క్యూసెక్కులు దాటింది. వరద ప్రవాహం మరికొంత పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక  జారీ చేస్తామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరద పెరుగుతున్నందున ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందిగా గుంటూరు జిల్లా యంత్రాంగం రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కాగా, ఆదివారం సాయంత్రానికే పులిచింతల డ్యాం నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం తెల్లవారుజాముకు ప్రకాశం బ్యారేజీ దిగువకు ఏడు లక్షల క్యూసెక్కులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. పరీవాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద సహాయక చర్యల కోసం పలుచోట్ల కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు సూచించారు. ఆదివారం రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిపారు. 


మరో 3 రోజులు భారీ వర్షాలు 

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తూర్పు బిహార్‌ పరిసరాల్లోని అల్పపీడనం బలహీనపడింది. తూర్పు బిహార్‌ను అనుకుని ఉన్న సబ్‌-హిమాలయాస్‌, సిక్కిం, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి గ్యాంగ్‌టక్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసా కోస్తా ప్రాంతం మీదుగా ఏపీ తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే ఏపీ దక్షిణ ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో 28న ఉత్తరాంధ్ర, యానాం, 29, 30 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

 

బుగ్గవంకలో ఇద్దరు బాలురు గల్లంతు

కడప నగరంలోని బుగ్గవంకలో పడి నాగరాజుపేటకు చెందిన సునీల్‌కుమార్‌(12), షేక్‌ పాషావలి(10) అనే చిన్నానరులు గల్లంతయ్యారు. 


నిల్వకు సాధ్యం కానంత నీరు (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెండు నెలల కిందట రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులన్నీ నీటి కోసం ఎదురు చూశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. చుక్క నీటిని కూడా నిల్వ చేసుకోలేనంతగా రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఎగువ రాష్ట్రాల నుంచి ఒక్కసారిగా కృష్ణా నదిలోకి భారీగా ప్రవాహం వచ్చేస్తుండటంతో వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగానే సాగు నీటి ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేసి కిందకు వదిలేస్తున్నారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం 865.64 టీఎంసీలకు గాను,  ప్రస్తుతం 773.67  టీఎంసీల(89.38 శాతం) నీటి నిల్వలున్నాయి.  బేసిన్‌ వారీగా గమనిస్తే.. గోదావరిలో 12.56 టీఎంసీలకుగాను 9.64 టీఎంసీలు కృష్ణా బేసిన్‌లో 601.13 టీఎంసీలకు గాను 590 టీఎంసీల(97.98 శాతం) నిల్వలున్నాయి. 


రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో ఆదివారం సాయంత్రం నీటి నిల్వలు ఇలా ఉన్నాయి

ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో అవుట్‌ ఫ్లో

సామర్థ్యం (టీఎంసీలలో) (టీఎంసీలలో) (క్యూసెకులలో) (క్యూసెక్కులలో)

శ్రీశైలం 215.81 211.61 510750 597440

నాగార్జునసాగర్‌ 312.05 312.05 632155 632155

పులిచింతల 45.77 43.54 664531 607504

గోరకల్లు 12.44 9.77 10545 8920

గాజుల దిన్నె 4.5 4.42 200 1020

బుగ్గవాగు 3.46 3.43 8380 7765

ప్రకాశం బ్యారేజీ 3.07 3.07 486752 483204

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ 2.93 2.93 387515 387283

గుండ్లకమ్మ 3.86 3.12 19997 22311

Updated Date - 2020-09-28T09:26:11+05:30 IST