Tokyo Paralympics: బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి ప్రమోద్ భగత్

ABN , First Publish Date - 2021-09-03T00:06:30+05:30 IST

పారాలింపిక్స్‌లో నిన్న (బుధవారం) భారత అథ్లెట్లు తీవ్ర నిరాశ పరచగా, నేడు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

Tokyo Paralympics: బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి ప్రమోద్ భగత్

టోక్యో: పారాలింపిక్స్‌లో నిన్న (బుధవారం) భారత అథ్లెట్లు తీవ్ర నిరాశ పరచగా, నేడు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ప్రమోద్ భగత్, తరుణ్ ధిల్లాన్, సుహాస్ యతిరాజ్, పాలక్ కోహ్లీ సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించారు.


గ్రూప్ ఎ మ్యాచ్‌లో ఉక్రెయిన్ ఆటగాడు ఒలెక్సాండర్ చిర్‌కోవ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ప్రమోద్ భగత్ 21-12, 21-9తో వరుస సెట్లలో విజయం సాధించాడు. 33 ఏళ్ల భగత్ ప్రపంచ చాంపియన్ కూడా. ఈ విజయంతో భగత్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.


మరోవైపు, మిక్స్‌డ్ డబుల్స్‌లో భగత్, పాలక్ కోహ్లీ తమ తర్వాతి మ్యాచ్‌లో వరుసగా సిరిపోంగ్ టీమర్‌రామ్, నిపాడ సేన్సుపాతో శుక్రవారం తలపడతారు. కాగా, సుహాస్ యతిరాజ్, తరుణ్ ధిల్లాన్, కృష్ణా నాగర్‌లు పురుషుల సింగిల్స్‌లో విజయం సాధించారు. 


మహిళల సింగిల్స్ క్లాస్ ఎస్‌యూ5లో జెహ్రాపై కోహ్లీ విజయం సాధించగా, మహిళల డబుల్స్‌లో 19 ఏళ్ల కోహ్లీ, పారుల్ పర్మార్ జంట సెకండ్ సీడ్ చైనీస్ జంట చెంగ్ హెఫాంగ్, మా హుయిహుయి చేతిలో ఓటమి పాలైంది.  

Updated Date - 2021-09-03T00:06:30+05:30 IST