కర్ణాటకలోని జుమా మసీదు కోసం పోరాడతాం : ప్రమోద్ ముతాలిక్

ABN , First Publish Date - 2021-10-19T22:50:45+05:30 IST

కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఉన్న జుమా మసీదును

కర్ణాటకలోని జుమా మసీదు కోసం పోరాడతాం : ప్రమోద్ ముతాలిక్

బెంగళూరు : కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఉన్న జుమా మసీదును హిందువులకు తిరిగి ఇచ్చే విధంగా పోరాడతామని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ చెప్పారు. ఇది మొదట్లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమని, ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్ కూల్చేసిన అనేక దేవాలయాల్లో ఇదొకటని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 


ముతాలిక్ గడగ్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను హిందుత్వవాచ్ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అయోధ్యలోని రామాలయం కోసం 72 సంవత్సరాలపాటు పోరాడామని ముతాలిక్ ఈ వీడియోలో చెప్పారు. 72 ఏళ్ళ తర్వాత దానిని (బాబ్రీ మసీదును) కూల్చేసి, దివ్యమైన రామాలయాన్ని నిర్మించుకోగలుగుతున్నామని తెలిపారు. అదే విధంగా గడగ్‌లోని జుమా మసీదుగా చెప్తున్న ప్రదేశం వాస్తవానికి వేంకటేశ్వర దేవాలయమని చెప్పారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్ కాలంలో కూల్చివేసిన దేవాలయాల్లో ఇదొకటని చెప్పారు. ఇందుకు అవసరమైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. దీని కోసం తాము పోరాడతామని చెప్పారు. 


‘‘ఇది (జుమా మసీదు) ఓ దేవాలయమని తెలిపే రెండు దస్తావేజులు మా వద్ద ఉన్నాయి. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ప్రకారం మేం దస్తావేజుల కోసం దరఖాస్తు చేశాం. అక్కడి నుంచి మా పోరాటాన్ని ప్రారంభిస్తాం’’ అని ముతాలిక్ మీడియాకు మంగళవారం చెప్పారు. గడగ్ నుంచి ప్రారంభిస్తామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బలవంతంగా మసీదులుగా మారిన దేవాలయాల కోసం కూడా పోరాడతామని తెలిపారు. 


Updated Date - 2021-10-19T22:50:45+05:30 IST