విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-08-14T07:06:57+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉంది. 13 ఏళ్ల క్రితం నాటి ఓ రోడ్డు ప్రమాదంలో మెదడులో గడ్డగట్టిన రక్తం.. ఇప్పుడు ప్రభావం చూపినట్లు ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఈ నెల 10న ప్రణబ్‌ ఆస్పత్రిలో చేరగా...

విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

  • 13 ఏళ్ల కిందటి ప్రమాదం ప్రభావం
  • ఆయన చనిపోయారంటూ వదంతులు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉంది. 13 ఏళ్ల క్రితం నాటి ఓ రోడ్డు  ప్రమాదంలో మెదడులో గడ్డగట్టిన రక్తం.. ఇప్పుడు ప్రభావం చూపినట్లు ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఈ నెల 10న ప్రణబ్‌ ఆస్పత్రిలో చేరగా.. కొవిడ్‌-19 కూడా పాజిటివ్‌గా తేలింది. మెదడులో ఉన్న రక్తం గడ్డను తొలగించామని వైద్యులు చెప్పారు. ఆయన కోమాలో ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వివరించారు. కాగా.. ప్రణబ్‌ ముఖర్జీ చనిపోయారంటూ గురువారం ఉదయం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అదంతా అబద్ధమంటూ ప్రణబ్‌ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్లో మండిపడ్డారు. ‘‘మా నాన్న సజీవంగానే ఉన్నారు. వెంటిలేటర్‌ సాయంతో వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తోంది. కీలక అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి’’ అని వివరించారు. ప్రణబ్‌ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ సైతం తన తండ్రికి ఏమీ కాలేదని ట్విటర్‌లో తెలిపారు.


13 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

2007లో ప్రణబ్‌ ముషీదాబాద్‌ నుంచి కోల్‌కతాకు కారులో వెళ్తుండగా.. నాదియా జిల్లాలో ఆయన కారును ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొంది. ఆ ప్రమాదంలో ప్రణబ్‌ తలకు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం కృష్ణానగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ సీటీ స్కాన్‌, ఎక్స్‌రే సదుపాయాలు లేకపోవడంతో.. తన నర్సింగ్‌హోంకు తీసుకువచ్చినట్లు ఆ సమయంలో ప్రణబ్‌కు చికిత్స అందించిన డాక్టర్‌ బాసుదేవ్‌ మండల్‌ వెల్లడించారు. అప్పట్లో ఆయన మెదడులో ఎలాంటి క్లాట్‌ (రక్తం గడ్డకట్టుకుపోవడం) గుర్తించలేదని.. అదే 13 ఏళ్ల తర్వాత బయటపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-08-14T07:06:57+05:30 IST