ప్రణబ్‌ నిష్క్రమణ

ABN , First Publish Date - 2020-09-01T06:35:59+05:30 IST

భారత రిపబ్లిక్‌ 13వ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ నిష్క్రమణతో ఒక తరహా రాజకీయవాదుల తరం ముగిసి పోయిందనుకోవచ్చు. జాతీయోద్యమంలో...

ప్రణబ్‌ నిష్క్రమణ

భారత రిపబ్లిక్‌ 13వ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ నిష్క్రమణతో ఒక తరహా రాజకీయవాదుల తరం ముగిసి పోయిందనుకోవచ్చు. జాతీయోద్యమంలో పాల్గొని స్వాతంత్ర్యానంతర తొలి దశాబ్దాలలో ప్రజాజీవితంలో, అధికారంలో ఉన్న తొలి తరం వేరు. పూర్వపు తరానికి, అనంతరపు నేతలకు మధ్యస్థంగా, కొన్ని విలువలూ కొంత వ్యూహరచనల కలబోతగా మెలిగినవారు ప్రణబ్‌ ‘దా’. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు రాజకీయాలలోకి వచ్చారాయన.  బెంగాలీ మూలం, జర్నలిస్టుగా పనిచేయడం, మంచి చదువరి కావడం– ఆయన రాజకీయ ప్రయాణానికి పునాదిబలాన్ని సమకూర్చాయి. రాజకీయాల నిర్వహణలోని చాకచక్యం   ఆయనను శీఘ్రంగా ఉన్నత స్థానాలకు చేర్చింది. బాధ్యతలను నిర్వహించే సామర్థ్యం, విధేయత, తగవులను పరిష్కరించే లౌక్యం– ఇవీ ప్రణబ్‌ వ్యక్తిత్వంలోని విజయసోపానాలు. వాటితో పాటు ఆయనలో వ్యక్తమయిన, ‘పైపైకి ఎదగాలన్న ఆకాంక్ష’ ప్రతికూల అంశంగా మారింది. అందువల్లనే ఆయన రాష్ట్రపతి భవన్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది.


1969లో వి.కె. కృష్ణమీనన్‌ బంగ్లా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తుంటే, ఆయన వద్ద ప్రచార నిర్వాహకుడిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ కీర్తి ఇందిరాగాంధీ దాకా వెళ్లింది. ఆమె ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారు, త్వరలోనే రాజ్యసభ సభ్యుడిని చేశారు, నాలుగేళ్లలోనే ఉప మంత్రిని చేశారు. ఆ పైన మరో పదేళ్లకు ఆర్థికమంత్రిని చేశారు. ఇందిర హత్యకు గురయ్యేనాటికి ఆమె కేబినెట్‌లో సీనియర్‌ మంత్రిగా ప్రణబ్‌ ఉన్నారు. నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చనిపోయినప్పుడు, అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ సీనియర్‌ మంత్రి అయిన గుల్జారీలాల్‌ నందాను తాత్కాలిక ప్రధానిగా నియమించారు. ఇందిర చనిపోయినప్పుడు రాష్ట్రపతి జైల్‌సింగ్‌ కూడా అట్లాగే చేస్తారని ప్రణబ్‌ ఆశించారు. ఆశించడమే కాదు, నోరు తెరిచి అడిగారు కూడా. కథ వేరుగా సాగింది. రాజీవ్‌ గాంధీ ప్రధాని అయ్యారు, ఘనవిజయంతో కొనసాగారు. ప్రణబ్‌ వేరుగా వెళ్లవలసి వచ్చింది. సొంత పార్టీ పెట్టుకున్నారు. మళ్లీ 1989లో కాంగ్రెస్‌లోనే కలసిపోయారు. ప్రణబ్‌ గురించి ఇందిరకు భయాలేమీ లేవు కానీ, రాజీవ్‌కు, ఆ తరువాత సోనియాకు చాలా భయమే ఉండింది. ఆ భయమే లేకపోతే, 1991లో  పి.వి. నరసింహారావుకు అవకాశం దక్కేది కాదేమో? సోనియా విముఖంగా ఉన్నా, పి.వి. ప్రణబ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. పి.వి. హయాం తరువాత సోనియాను కాంగ్రెస్‌ అధ్యక్షురాలిని చేయడానికి ప్రణబే పావులు కదిపారు. 2004లో మొదటి యుపిఎ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ప్రణబ్‌ కాకుండా, మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అభ్యర్థి కావడం వెనుక కూడా ఈ చరిత్ర ఉన్నది. ప్రణబ్‌ మనసులో ఉన్న ఆశ తెలుసు. చురుకుదనం అంతగా కనిపించని పి.వి. నరసింహారావు వంటి వ్యక్తే ఎదురుతిరిగినప్పుడు ప్రణబ్‌ని ప్రధాని చేయడం శ్రేయస్కరం కాదని సోనియా భావించారు. ప్రధాని ఆశను సమూలంగా చిదిమివేయడానికే 2012లో ఆయనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారంటారు. 


ప్రధాని కాలేకపోయినా, యుపిఎ మొదటి, రెండో పదవీకాలాలలో ప్రధాన కార్యనిర్వహణ అంతా ఆయన చేతుల మీదే సాగిందని చెబుతారు. పార్టీలో, ప్రభుత్వంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ఆయన నిష్ణాతులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆయన పాత్ర కీలకం. పైకి ఎప్పుడూ ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోయినా, తెలంగాణ ఏర్పాటుపై నియమించిన పార్టీ కమిటీ నాయకుడిగా ఆయన సమస్యను అధ్యయనం చేసి, అధిష్ఠానానికి తగిన మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగా ప్రణబ్‌ను తెలంగాణవాదులు, ప్రభుత్వం స్మరించుకుంటారు. అట్లాగే, ఆయన ఆధ్వర్యంలోని అనేక మంత్రుల కమిటీలు వేర్వేరు అంశాలపై ప్రభుత్వ నిర్వహణకు దోహదం చేసి ఉంటాయి. 


రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ యుపిఎ కంటె ఎన్‌డిఎ ప్రభుత్వంతో ఎక్కువ కాలం వ్యవహరించారు. ఎక్కడా ప్రభుత్వానికి సమస్య లేకుండానే లౌక్యంగా ఆయన వ్యవహారసరళి సాగింది. ఉపరాష్ట్రపతిగా ఉండిన హమీద్‌ అన్సారీ విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వం బాహాటంగానే వ్యతిరేకత ప్రకటించేది కానీ, ప్రణబ్‌ అంటే గౌరవ భావనతోనే వ్యవహరించేది. 


ప్రణబ్‌ ముఖర్జీ నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ వేదికపై ప్రసంగించడం వివాదాస్పదం అయింది. ఆయన ఆ వేదిక మీద నుంచి మాట్లాడిన మాటలు సంఘ్‌ను, దాని వ్యతిరేకులను ఇద్దరినీ మెప్పించడానికి ప్రయత్నించినట్టు ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని కాంగ్రెస్‌ పార్టీతో సహా, అనేక వర్గాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. అభిప్రాయభేదాలు ఉండవచ్చునని, వాటిని సహించకుండా ద్వేషభావం కలిగి ఉండడం మంచిది కాదని ప్రణబ్‌ ఆ సందర్భంగా ఇచ్చిన సందేశం సంఘ్‌ పెద్దలు, ఇతరులు కూడా ఆలకిస్తే దేశం మరింత ప్రజాస్వామికంగా ఉంటుంది. ఆయన నాగపూర్‌ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికీ, తరవాతి సంవత్సరం ఆయనకు భారతరత్న ఇవ్వడానికీ సంబంధం ఉన్నదన్న విమర్శ మాత్రం ఎవరూ చేయలేదు. 


ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, జాతీయవాదం– ఈ మూడు ప్రణబ్‌ విశ్వాసాలలో భాగమని ఆయన రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే అర్థమవుతుంది. వీటన్నిటికి తోడు, చదువు అనుభవం అందించిన వివేకం ఆయన నడవడిలో ఉండేది. భౌతికంగా కురచ మనిషి అయినా, ఆయన పెద్దమనిషిగా కనిపించేవారు. విలువలూ ఆదర్శాలూ సామర్థ్యాలూ నశించిపోతున్న కాలంలో ఆయన లేని లోటు పెద్దదే.

Updated Date - 2020-09-01T06:35:59+05:30 IST