పెన్నాలో ఇద్దరు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2021-09-18T04:39:42+05:30 IST

చిన్నారుల ఈత సరదా రెండు నిరుపేద గిరిజన కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చింది.

పెన్నాలో ఇద్దరు చిన్నారుల మృతి
పెన్నాలో నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన కల్పన, చందులు

ప్రాణం తీసిన ఈత సరదా


నెల్లూరు రూరల్‌, సెప్టెంబరు 17 : చిన్నారుల ఈత సరదా రెండు నిరుపేద గిరిజన కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చింది. స్నేహితులతో కలిసి పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి నీటిమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నెల్లూరు శివారు ప్రాంతం నవలాకులతోట పరిధిలోని సుభాననగర్‌లో శుక్రవారం వెలుగు చూసింది.  అందిన సమాచారం మేరకు.. సుభాననగర్‌కు చెందిన దినసరి కూలీలు కొట్లపాటి పోలయ్య, పోలమ్మల కుమార్తె కల్పన (10), ఈగ చెంచయ్య, ఆదిలక్ష్మిల కుమారుడు చందు (8) స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం వారి ఇళ్ల సమీపానున్న పెన్నా నదిలో ఈతకు వెళ్లారు. కల్పన, చందులు నదిలో లోతుకెళ్లి నీటమునిగిపోయారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు హుటాహుటిన వారి ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులతోపాటు, చుట్టుపక్కల వారు వెళ్లి నీట మునిగిన ఇద్దరి మృతదేహాలు బయటకు తీశారు. కన్నవారి రోదనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

బిడ్డలు పోయినా బయటకు చెప్పేందుకు భయం


సగటు సమాజానికి దూరంగా జీవించే గిరిజనులు తమ భయాన్ని మరోసారి చాటుకున్నారు. రెండు కుటుంబాల్లోని ఇద్దరు చిన్నారులు పెన్నాలో మునిగి మృత్యువాతపడినప్పటికీ ఆ సమాచారాన్ని బయటకు తెలియజేయకుండా భయంతో నే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చిన వార్తతో ప్రముఖులు సైతం మృతదేహాలను చూసేందుకు వెళ్లగా వారికి కూడా సమాచారం ఇచ్చేందుకు ఆ గిరిజనులు జంకడం ఆశ్చర్యాన్ని కలిగించింది.  చిన్నారుల మృతిపై ఫిర్యాదు ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి వీలు లేకుండాపోయింది. కాగా, మంత్రి అనిల్‌కుమార్‌ సూచన మేరకు నుడా చైర్మన ముక్కాల ద్వారకానాథ్‌ చిన్నారుల మృతదేహాలను సందర్శించారు. దహన సంస్కారాల కోసం రూ.10 వేలు అందజేశారు. బాధిత కుటుంబాలను మంత్రి ఫోనలో పరామర్శించారు. 


పెన్నాలో బాలుడి గల్లంతు


నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 17: స్నేహితులతో కలిసి పెన్నానదిలో ఈతకెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. సేకరించిన వివరాల మేరకు... నెల్లూరులోని రంగనాయకులపేట పెద్దతోటలో హయద్‌ బాషా, యజ్దానీ దంపతుల కుమారుడు సుభాన(13) స్థానిక పీఎంఆర్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులు ఇబ్రహీం, మస్తానతో కలిసి ఈతకొట్టేందుకు పెన్నానదికి వెళ్లాడు. వారధి సమీపంలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు. స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు డయల్‌ 100కు సమాచారం అందించారు. సంతపేట ఇనస్పెక్టర్‌ అన్వర్‌బాషా సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో  గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు బోట్ల సాయంతో వెతికినా బాలుడి ఆచూకీ తెలియలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపి వేశారు. శనివారం ఉదయం గాలింపును కొనసాగించనున్నారు.


Updated Date - 2021-09-18T04:39:42+05:30 IST