ప్రాణాయామంతో మనసుకు పగ్గం

ABN , First Publish Date - 2020-03-17T09:54:03+05:30 IST

ప్రాణవాయువును నియంత్రించడం వల్ల మనసు.. వలలో చిక్కిన పక్షిలాగా లయమైపోతుంది. ఇదే మనసును అరికట్టే ఉపాయమని దీని అర్థం. రమణమహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని 11వ

ప్రాణాయామంతో మనసుకు పగ్గం

వాయురోధనాత్‌ లీయతే మనః

జాల పక్షివత్‌ రోధ సాధనం

ప్రాణవాయువును నియంత్రించడం వల్ల మనసు.. వలలో చిక్కిన పక్షిలాగా లయమైపోతుంది. ఇదే మనసును అరికట్టే ఉపాయమని దీని అర్థం. రమణమహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని 11వ శ్లోకమిది. ముందు చెప్పిన 10 శ్లోకాల్లోని తొలి మూడు శ్లోకాల్లో కర్మయోగం గురించి, తర్వాత ఏడు శ్లోకాల్లో భక్తి యోగం గురించి చెప్పిన రమణులు.. చంచలమైన మనసును నియంత్రించే ప్రక్రియలతో కూడిన రాజయోగం గురించి ఈ శ్లోకంతో మొదలుపెట్టి చెప్పారు. సద్గురువు చెప్పిన వేదాంత బోధను చక్కగా అర్థం చేసుకోవాలంటే మనసు ఎటువంటి అలజడులు, ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. కర్మలను ఈశ్వరార్పితంగా చేస్తే చిత్తశుద్ధి కలిగి ముక్తికి మార్గమవుతుంది. ఇది కర్మయోగం. అలాగే భక్తియోగం ద్వారా మనసును పరిపరి విధాల పరుగులు తీయకుండా చేసుకోవచ్చు.


ఈ రెండే కాక.. యోగ, జ్ఞానాలు హృదయస్థానంలో  మనసును నిలుపుతాయని రమణులు చెప్పారు. యోగమార్గం అంటే.. రాజయోగం. మనసెప్పుడూ చంచలంగా ఉంటుంది. కదలడం దాని స్వభావం. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. మనకు సుఖాన్నిచ్చే వస్తువుల గురించి, భోగాలను గురించి, భవిష్యత్‌ ప్రణాళికల గురించి, గతించిపోయిన విషయాల గురించి, వర్తమానంలోని కర్తవ్యాల గరించి ఎప్పుడూ ఆలోచనలు సాగిపోతూనే ఉంటాయి. కానీ, అలా ఉంటే.. మనసు లేనట్లే. అలాగని మనసును గుప్పెటలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది గాలిలాగా ఎగిరిపోతుంది. అందుకే భగవద్గీతలో అర్జునుడు ‘‘మనసు చంచలమైనది, గయ్యాళిది, గట్టిది.


దాన్ని నిగ్రహించడం అంటే గాలిని మూటకట్టడంలాంటిదే’’ అన్నాడు. భగవానుడు కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తూ.. ‘ఓ అర్జునా.. మనసు చంచలమైనది, నిగ్రహించడం చాలా కష్టం అనే మాటలో ఎలాంటి సంశయం లేదు. అయినప్పటికీ.. అభ్యాసం, వైరాగ్యం అనే రెండు ఆయుధాలతో దాన్ని వశపరచుకోవాలి’’ అని చెప్పాడు. అంతకష్టమైన మనో నిగ్రహాన్ని సాధించడానికి రమణులు ఒక ఉపాయాన్ని చెప్పారు. అదే.. ‘వాయురోధనాత్‌..’ అంటే ప్రాణవాయువును నియంత్రించే పద్ధతి. దీన్నే ప్రాణాయామం అంటారు. ఇందులో శ్వాసను అదుపులో ఉంచడాన్ని అభ్యాసం చేస్తారు. మనసును నిగ్రహించడం ఎందుకింత కష్టం? అంటే.. మనసును నిగ్రహించాల్సింది మనసే కావడం ఇందుకు కారణం. అందుకు ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అయితే అది పతంజలి మహర్షి చెప్పిన ప్రాణాయామం కాదు. దాన్ని గురువు వద్ద ప్రత్యక్షంగా నేర్చుకుని, గురువుల పర్యవేక్షణలో సాధన చేయాలి. నేర్చుకోకుండా స్వయంగా చేస్తే ప్రమాదకరం. రమణులు చెప్పిన ప్రాణాయామం.. ప్రత్యేకమైనది. దాన్ని ‘ప్రాణేక్షణ’ అంటారు. దాన్ని ఎవరైనా చేయొచ్చు. గురువుతో పని లేదు. అందులో చేయవలసిందంతా ఏమిటంటే.. మనసును మన ఉచ్ఛ్వాస, నిశ్వాసలపై లగ్నం చేయడమే. రోజూ ఇలా చేస్తుంటే మనసులో ప్రశాంతత పెరుగుతుంటుంది. అలాంటి ప్రశాంతత మళ్లీమళ్లీ కావాలని మనసు ఆరాటపడుతుంది. ప్రాణాయామం సహజంగా జరిగిపోతూ.. మనసు హృదయస్థానంలో నిలిచిపోవడానికి (హృత్‌స్థలే మనః) సాధనమవుతుంది.

 దేవిశెట్టి చలపతిరావు,care@srichalapathirao.com

Updated Date - 2020-03-17T09:54:03+05:30 IST