ప్రణోదేవీ సరస్వతీ

ABN , First Publish Date - 2020-10-09T09:10:55+05:30 IST

‘శరదృతువులో పౌర్ణమి వెన్నెలలా వికసించిన చిరునగవు కలిగినది, వెన్నెలవంటి చల్లని చూపులతో ప్రకాశించేది, పద్మమువంటి ..

ప్రణోదేవీ సరస్వతీ

శరదిందు వికాస మందహాసాం

స్ఫురదిందీవర లోచనాభిరామాం

అరవింద సమాన సుందరాస్యాం

అరవిందాసన సుందరీముపాసే!


‘‘శరదృతువులో పౌర్ణమి వెన్నెలలా వికసించిన చిరునగవు కలిగినది, వెన్నెలవంటి చల్లని చూపులతో ప్రకాశించేది, పద్మమువంటి సుందరమైన ముఖము కలిగినది, పద్మము ఆసనముగా కలిగిన బ్రహ్మకు భార్య అయిన సరస్వతీ మాతను ఉపాసిస్తున్నాను.’’ అని దీని అర్థం. దేవీ సప్తశతిలో ప్రస్తావించిన ముగ్గురు (మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి) దేవతా మూర్తులలో మహాసరస్వతికి ప్రాధాన్యత ఎక్కువ. సకల చరాచర సృష్టికి మూలమైన ఆదిశక్తియే వివిధ రూపాలలో భక్తులను అనుగ్రహించేందుకు అవతరిస్తుంది. ఒక్కొక్క అవతారానికీ ఒక్కొక్క ప్రయోజనం ఉంది. మొదటగా ఆదిశక్తి తనలోని సత్వగుణం చేత మహాసరస్వతిని కల్పించినట్లుగా చెబుతారు. సరస్వతి అంటే ప్రవహించేది. ప్రవహించేదేది? జ్ఞానం. తాము దర్శించిన జ్ఞానానికి అధిదేవతగా ప్రాచీన ఋషులు సరస్వతిని పేర్కొన్నారు. ఈ సరస్వతినే.. శరత్కాలంలో ఉద్భవించడం వల్ల ‘శారద’గా, విచక్షణాయుత బుద్ధిని ప్రకాశింప చేస్తుంది కాబట్టి భారతిగా వ్యవహరిస్తారు.


ఉన్నత లోకాలను ఆశించే వారు సరస్వతీ దేవిని నిష్ఠతో, భక్తితో ఉపాసిస్తుంటారు. ఉన్నతమైన మనోభూమికలే ఉన్నతలోకాలు. అవే ఆనందమయ లోకాలు. అక్కడి నుండి జీవితమనే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోగలిగిన విద్యను ప్రసాదించే తల్లి సరస్వతి. ఆమెయే వాక్కును ప్రసాదిస్తుంది కాబట్టి వాక్కుకు అధి దేవత. మనలోని మనోమాలిన్యాలను తొలగించి భగవదనుగ్రహ రసానుభూతిని హృదయంలో పదిలపరిచే రసాధిదేవత సరస్వతి. ఋషిపరంపరకు సత్యాన్ని దర్శింపజేసిన జ్ఞానప్రకాశిని. అపౌరుషేయంగా ప్రకటింపబడిన వేదవాజ్ఞ్మయానికి మూలరూపం సరస్వతీమాత. శబ్దమయిగా, జ్ఞాన వాహినిగా విశ్వవ్యాప్త చైతన్యమై జిజ్ఞాసువుల మనస్సులలో తేజోరూపంలో వెలుగొందేది, సరస్వతియే. నాభి వద్ద అవ్యక్తంగా ఉన్న ‘పరా’వాక్కు, హృదయస్థానంలో ‘పశ్యన్తీ’గా మారి, కంఠస్థానంలో ‘మధ్యమా’గా రూపుదాల్చి, ముఖం గుండా ‘వైఖరి’గా ప్రకటితమౌతుందని యోగులు చెపుతారు. ఆ పరిణామమే సరస్వతీ ప్రవాహం.


 ‘‘ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్వాజినీవతీ ధీనామ విత్య్రవతు’’ అంటుంది సరస్వతీ సూక్తం. త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో ప్రణమిల్లే మాయొక్క వాక్శక్తులను ప్రేరేపించి, మాలోని చైతన్యాన్ని జాగృతం చేసి సరస్వతీమాత కాపాడుగాక. నిజానికి ఉన్నత తత్వాలలోనూ, మన నిత్య జీవితంలోనూ ‘వాక్‌ శక్తి’ మహాశక్తిగా కనిపిస్తుంది. అసంకల్పితంగా ఈ శక్తిని మనం నిత్యమూ వినియోగిస్తుంటాము. ఈ శక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడమూ, దానిని సరైన మార్గంలో సమర్థంగా వినియోగించుకోవడమూ కర్మ యోగమే అంటారు, వివేకానంద. ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళతామో తెలుసుకునే క్రమంలో సృష్టి, స్థితి, లయలకు మూలమైన ముగురమ్మల మూలపుటమ్మను ఆరాధించి మన జీవితాలను సార్థకం చేసుకునేందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదించి సరస్వతీమాత మనందరినీ కాపాడుగాక.



- పాలకుర్తి రామమూర్తి

Updated Date - 2020-10-09T09:10:55+05:30 IST