ఏం పిల్లడో.. ఎల్లిపోనవా!

ABN , First Publish Date - 2020-08-05T10:32:10+05:30 IST

అమయాకత్వానికి ప్రతిరూపం. మర్మం తెలియని మనిషి . ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప... ఫలానా కావాలని

ఏం పిల్లడో.. ఎల్లిపోనవా!

మూగవోయిన ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక

విశాఖతో వంగపండుకు వీడని అనుబంధం

ఉపాధి కోసం ఐదున్నర దశాబ్దాల క్రితం నగరానికి రాక

జన నాట్యమండలి ప్రదర్శనలకు ఆకర్షణ 

శ్రీశ్రీ, రావిశాస్ర్తి, చలసాని వంటి ప్రముఖులతో పరిచయం

షిప్‌యార్డులో ఫిట్టర్‌గా ఉద్యోగ జీవితం 

ఆరేళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ

ప్రజా చైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం

శ్రీశ్రీ చేతుల మీదుగా తొలి రచన ‘ఏరువాక’ ఆవిష్కరణ


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): అమయాకత్వానికి ప్రతిరూపం. మర్మం తెలియని మనిషి . ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప... ఫలానా కావాలని నోరు విడిచి అడగడం తెలియని కళాభిమాని. అదే నోటితో అన్యాయాలను ఎదిరించాలంటూ జనాల్ని జాగృతం చేయడానికి ప్రాణం ఉన్నంతవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘‘ఏం పిల్లడో ఎల్దమొత్తవా!’’ అంటూ ఆయన రాసి, పాడిన పాట జనాల్లోకి చొచ్చుకొని పోయింది. అదొక్కటే కాదు... 400 పాటలు రాస్తే.. వాటిలో 200 వరకు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. తన  పాటల్లో ఉత్తరాంధ్ర మాండలికం ప్రతిధ్వనిస్తుంది. పదాల్లో ఆ ప్రాంతాల ప్రత్యేకత కనిపిస్తుంది.  వంగపండు... అంటే ఉత్తరాంధ్రాలో తెలియని వారు ఉండరు. నాటి తరం నుంచి నేటి తరం వరకు అందరికీ ఆయన పాటలు సుపరిచతమే. వాటిని వింటే.. ఆవేశం తన్నుకొస్తుంది. అన్యాయం కళ్ల ముందు కదలాడుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏదో చేసేయాలన్న కసి పుట్టుకొస్తుంది. అదీ ఆయన పాటల్లోని శక్తి. అయితే ఆయన మాత్రం సాధారణ వ్యక్తి. ఇటువంటి ప్రజా గొంతుక శాశ్వతంగా మూగ బోయింది. ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మంగళవారం తన సొంతూరు పార్వతీపురంలో కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న విశాఖ ప్రజా సంఘాలు, జానపద కళాకారులు, కవులు, రచయితలు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. 


విశాఖతో విడదీయని అనుబంధం

వంగపండు ప్రసాదరావు 1962లో చైనాతో యుద్ధం జరిగిప్పుడు ఆర్మీలో శిక్షణ కోసం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ శిక్షణ పూర్తయ్యేసరికి యుద్ధం ముగిసిపోయింది. దీంతో ఉపాధి కోసం విశాఖలో అడుగు పెట్టారు. ఐటీఐలో ఫిట్టర్‌ కోర్సు చేసినా... సరైన ఉద్యోగం దొరక్క తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డారు. కిరాణా దుకాణంలో పొట్లాలు కట్టారు. స్ర్పింగ్‌ రోడ్డు వర్కుషాపులో పనిచేశారు. ఉండడానికి గది అద్దెకు తీసుకొనేంత స్థోమత లేక టర్నర్‌ చౌల్ర్టీలో తన వద్ద ఎంత ఉంటే అంత ఇచ్చి అక్కడ పెట్టింది తినేవారు. రాత్రిపూట హాల్ట్‌ చేసే ప్రైవేటు బస్సుల్లో పడుకునేవారు. అందుకు ప్రతిఫలంగా నిద్ర లేచాక... వాటిని కడిగేవారు. అదే సమయంలో జన నాట్యమండలి ప్రదర్శనలకు వెళ్లేవారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ, రావిశాస్ర్తి, చలసాని ప్రసాద్‌ వంటి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తరువాత హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ఫిట్టర్‌గా ఉద్యోగం సాధించారు. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం పనిచేయలేదు. నెలకు పది రోజులే డ్యూటీ చేసేవారు. మిగిలిన 20 రోజులు ప్రదర్శనలు అంటూ ఊళ్లు పట్టుకు తిరిగేవారు. అలా ఎంతో కాలం సాగించలేక ఆరేళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.


తరువాత పూర్తికాలం ప్రజా చైతన్యానికే కేటాయించారు. ఆ క్రమంలో శ్రీశ్రీతో కలిసి ప్రయాణం చేశారు. తన మొదటి రచన ‘ఏరువాక’ను ఆయన చేతులు మీదుగానే గురజాడ కళాక్షేత్రంలో ఆవిష్కరింపజేసుకున్నారు. శ్రీశ్రీకే ప్రజాకవి అని పేరు ఉండేది. ఆ ప్రజాకవితోనే ‘నిజమైన ప్రజాకవి వంగపండు’ అని ఓ సభలో ప్రజలకు పరిచయం చేయించుకున్న ఘనత వంగుపండుది. షిప్‌యార్డులో పనిచేసినప్పుడు ఎన్నో ఏళ్లు కష్టపడి పనిచేసిన నౌకలు వెళ్లిపోతుంటే... వాటితో విడదీయరాని అనుబంధంపై కూడా ‘‘ఓడ నువ్వెళ్లిపోకే...!’’ అంటూ పాట రాసి పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత సినీ రంగానికి చెందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి టి.కృష్ణ, ఆర్‌.నారాయణమూర్తి వంటి దర్శకుల చిత్రాలకు అనేక పాటలు రాసి ఆలపించారు. కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. మూడేళ్ల క్రితం ‘వంగపండు పాటకు 50 ఏళ్లు’ పేరిట విశాఖ రైటర్స్‌ అకాడమీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తదితరులు హాజరయ్యారు.


 గెస్ట్‌ లెక్చరర్‌గా....

వంగపండు ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నాక... ఏయూ వీసీగా పనిచేసిన జీఎస్‌ఎన్‌ రాజు ప్రత్యేకంగా పిలిచి థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో గెస్ట్‌ లెక్చరర్‌గా అవకాశం కల్పించి గౌరవ వేతనం అందించారు. ఏయూలో క్వార్టర్‌ కూడా ఇచ్చారు. అలా నాలుగేళ్లు విశాఖలో ఉన్న ఆయన ఎక్కువగా సాహితీ కార్యక్రమల్లో పాల్గొని నగర ప్రజలకు మరింత చేరువయ్యారు. 

Updated Date - 2020-08-05T10:32:10+05:30 IST