‘వంగపండు’ మృతికి సంతాపం

ABN , First Publish Date - 2020-08-05T10:47:15+05:30 IST

ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని పలువురు నాయకులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

‘వంగపండు’ మృతికి సంతాపం

సమైక్యాంధ్ర ఉద్యమంలో వంగపండు ప్రముఖ పాత్ర: 

 సినీ నిర్మాత బలగ ప్రకాష్‌ 


నందిగాం, ఆగస్టు 4: ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని పలువురు నాయకులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు మంగళవారం మృతి చెందిన విషయం తెలుసుకుని వెన్నెల క్రియేషన్స్‌ అధినేత, నిర్మాత బలగ ప్రకాష్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  సమైక్యాంధ్ర ఉద్యమంలో వంగపండు ప్రధాన పాత్ర పోషించి ప్రజలను జాగృతం చేయడం మరువలేనిదన్నారు. సామాన్య జనాల కోసం కలం పట్టి, గళం విప్పి, గజ్జి కట్టి ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు.


నరసన్నపేట: ప్రముఖ విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద రావు మృతి తీరని లోటని మంగళవారం కోమర్తి గ్రామంలో ప్రజా సంఘాలు ప్రతినిధులు నివాళులు అర్పించారు. తన సాహిత్యం, పాటల ద్వారా గిరిజన, రైతాంగ కూలీల సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేశారని ఇప్య్టూ జిల్లా అధ్యక్షుడు నేతింటి నీలంరాజు అన్నారు. నాటి పరిస్థితులపై తన గళం, కలం ద్వారా పోరాటం చేసిన విప్లవకవి వంగపండు అని అన్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు పి.దాలినాయుడు, గణేష్‌, శ్రీను, యోగంద్ర రావు పాల్గొన్నారు. 


జలుమూరు: ఉత్తరాంధ్ర వాగ్గేయకారుడు, సినీ రచయిత, గాయకుడు వంగపండు మృతి ఉత్తరాంధ్రకు తీరని లోటని ప్రజా నాట్యమండలి సభ్యుడు మామిడి సత్యనారాయణ అన్నారు. వంగపండు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


 మెళియాపుట్టి: ప్రజా గాయకుడు వంగపండు మృతికి మండల కళాకారుల సంఘం నాయకులు కప్పా భానుప్రకాశరెడ్డి, బసవ బాస్కరరెడ్డి, మల్లేశ్వరావు, జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు వై.నాగేశ్వరావు, జగది ప్రసాద్‌, నాగిరెడ్డి, చాణుక్య తదితరులు సంతాపం తెలిపారు.  ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుతెచ్చుకున్న వంగపండు మృతి తీరనిలోటన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మెళియాపుట్టిలో జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రజలను చైతన్యం చేశారని గుర్తుచేసుకున్నారు. 


టెక్కలి: వంగపండు.. ఉత్తరాంధ్ర గళమని, ఐదు దశాబ్దాల పాటు ప్రజల కష్టాలను పాటల రూపంలో వినిపించిన గొప్ప కళాకారుడు అని, ఆయన మృతి తీరని లోటని సీనియర్‌ పాత్రి కేయుడు, రచయిత పేడాడ పరమేశ్వ రరావు, కేఎన్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకరరావు వేర్వేరు ప్రకట నల్లో సంతాపం తెలిపారు.


వజ్రపుకొత్తూరు:  ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి తీర ని లోటని పల్లిసారధి గ్రామానికి చెందిన యువజన నటసమాఖ్య ప్రతినిధు లు యు.ఉదయకుమార్‌, అంగ ఆనందరావు అన్నారు. పల్లిసారధిలో  వంగపండు ప్రదర్శనను గుర్తుచేసుకున్నారు. 


రాజాం:  ప్రముఖ విప్లవ గాయకుడు వంగపండు ప్రసాదరావుకు రాజాంతో అనుబంధం ఉంది.  తూర్పుకాపు సంక్షేమ సంఘం, వన మహోత్సవం, పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఆయన గజ్జికట్టి నృత్యం చేస్తే ప్రజలు చప్పట్ల వర్షం కురిపించే వారు.  ఆయన మృతి చెందిన విషయం తెలిసి కళాకారులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.   

Updated Date - 2020-08-05T10:47:15+05:30 IST