న్యాయవాదుల నోట్లో గుడ్డలు కుక్కుతారా?: ప్రశాంత్ భూషణ్

ABN , First Publish Date - 2020-09-23T21:46:36+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించిన ప్రముఖ న్యాయవాది..

న్యాయవాదుల నోట్లో గుడ్డలు కుక్కుతారా?: ప్రశాంత్ భూషణ్

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇవాళ ఢిల్లీ బార్ కౌన్సిల్ అసోసియేషణ్ (బీసీడీ) ఇచ్చిన నోటీసులపై ట్విటర్ వేదికగా స్పందించారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ సైతం న్యాయవాదుల నోట్లో గుడ్డలు కుక్కేందుకు ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీడీలో తన సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రశాంత్ భూషణ్ నుంచి బీసీడీ వివరణ కోరింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. ‘‘నన్ను ‘దోషిగా’ తేల్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇప్పుడు బార్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చింది. న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ 24ఎ కింద ఈ నోటీసులు జారీ చేసింది. నైతిక దుష్ర్పవర్తన నేరానికిగానూ ఓ న్యాయవాది దోషిగా తేలితే, అతనికి సభ్యుత్వం లేకుండా చేసే అధికారం ఈ చట్టం ద్వారా ఉంటుంది. అయితే బార్ కౌన్సిల్ ఉద్దేశ్యంలో, విమర్శనాత్మక వ్యాఖ్యలు కూడా నైతిక దుష్ప్రవర్తనే కాబోలు..!’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్లో ఆయన స్పందిస్తూ.. ‘‘అంటే, బార్ కౌన్సిల్ ఇప్పుడు న్యాయవ్యవస్థ గురించి విమర్శలు చేయకుండా న్యాయవాదుల నోట్లో గుడ్డలు కుక్కుతోందా?’’ అని ఆయన ప్రశ్నించారు. 


కోర్టు ధిక్కరణ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు భూషణ్‌ను దోషిగా నిర్ధారించి రూ.1 శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన తమ ముందు హాజరు కావాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ (బీసీడీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. భూషణ్‌పై చట్టపరంగా తీసుకోవాల్సిన తప్పనిసరి చర్యలు తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తన ఢిల్లీ విభాగాన్ని ఆదేశించిన నేపథ్యంలో బీసీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 





Updated Date - 2020-09-23T21:46:36+05:30 IST