Abn logo
Sep 20 2021 @ 12:26PM

పీకే టీం ఎంట్రీతో.. వైసీపీలో కలకలం..!

రాజకీయాల్లో తలలు పండిన నేతలు సైతం ఆయన కోసం ఎందుకు క్యూకడుతున్నారు? ఆయన వ్యూహరచన చేయకపోతే తాము అధికారంలోకి రాలేమనే ఆందోళనే కారణమా? పార్టీ గెలుపు కోసం నాయకులు.. వ్యూహకర్తలను నమ్ముకోవడం మంచిదేనా? సిద్ధాంతాలను పక్కన పెట్టి, కిరాయి వ్యూహకర్తలను నియమించుకోవడం.. పార్టీ ప్రయోజనాల కోసమేనా? మళ్లీ పీకే టీమ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఏపీలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం. 


ఏపీ రాజకీయాల్లోకి మళ్లీ పీకే టీమ్

రాష్ట్రంలో ఉన్న కుల ద్వేషాలను రెచ్చగొట్టడం, మతాలు, కులాల వారీగా ప్రజలను విడదీయటం, ఆర్ధిక అసమానతలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా.. వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే టీం మళ్లీ ఏపీ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా పీకే టీం ప్రస్తావన సీఎం నోటి నుంచి వెలువడటంతో మళ్లీ ప్రశాంత్ కిషోర్ బృందం పై రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్ లోటస్ పాండ్ తో పాటు ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా పీకే టీం పని చేస్తోంది. జిల్లా స్థాయిలో కూడా పీకే టీం సభ్యులు పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు సీఎంకు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.


అభ్యర్దుల ఎంపిక వద్ద నుంచి క్షేత్రస్థాయి సర్వేలను కూడా ఈ బృందం నిర్వహించింది. చివరకు పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా ఈ బృందమే శాసించింది. ఐఐటీ నుంచి బయటకు వచ్చిన వారిని తాత్కాలికంగా ఎంపిక చేసుకుని అనుసరించాల్సిన వ్యూహాలు అప్పట్లో విజయవంతం అయ్యాయి. అప్పటి నుంచి కూడా పీకె బృందం జగన్‌తో టచ్‌లో ఉంది. ఐదు నెలల క్రితం పీకే, జగన్ ను కలిసి వెళ్లారు. ఎన్నికల తర్వాత కూడా వీరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది.

మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై పీకే టీం సర్వే

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీకె బృందం సర్వే చేస్తుందని, అందరూ ఎన్నికల క్యాంపెయిన్ వైపు షిప్ట్ కావాలని.. సీఎం, తన క్యాబినేట్ సహచరులకు హిత బోధ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై పీకే టీం సర్వే చేస్తుందని చెప్పడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులలో కలకలం ప్రారంభమైంది. తాజాగా పీకే బృందం ఇటీవల ముంబాయి ఐఐటీకి వెళ్లి, తమకు సుమారు 150 మంది గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న వారు కావాలని, వారిని తాము రిక్రూట్ చేసుకుంటామని ప్రిన్సిపాల్‎ను కోరారు. నెలకు లక్షన్నరకు తగ్గకుండా జీతాలు ఇస్తామని కూడా చెప్పారు. అవసరమైతే మరో 150 మందిని వేరే ఐఐటీల నుంచి తీసుకుంటామని పీకే బృందంలో కీలక వ్యక్తి రిక్రూట్ మెంట్‎కు సిద్దమవడం.. ఏపీ అవసరాల కోసమేనని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యూహరచన చేయకపోతే తాము అధికారంలోకి రాలేమన్న అభిప్రాయానికి పలు పార్టీలు వచ్చారు. సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు నడిచిన మన దేశంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? తనను నియమించుకున్న నాయకులు అధికారంలోకి రావడానికి పీకే ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తున్నాడా? 

అసత్యాలను సత్యాలుగా నమ్మించడం పెరిగిపోయింది

పెళ్లిళ్లు, పేరంటాలకు ఈవెంట్‌ మేనేజర్లను నియమించుకున్నట్టుగా.. ఎన్నికల సమయంలో పార్టీలు సైతం, పీకేలాంటి వారిని నియమించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అసత్యాలను సత్యాలుగా నమ్మించడం పెరిగిపోయింది. తనను నమ్ముకున్న క్లయింట్ల గెలుపు కోసం మాత్రమే పీకే టీమ్ పనిచేస్తుంది. ఎలాగైనా వారిని గెలిపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే విషయాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. గతంలోనే కొత్తపలుకులో ప్రస్తావించారు. స్థానిక పరిస్థితులను బట్టి కులం, మతం కార్డులను ప్రయోగించడం పీకే స్ట్రాటజీ. ప్రజల బలహీనతలను గుర్తించి, వాటినే అస్ర్తాలుగా మలచి తన క్లయింట్‌ కోసం పని చేస్తారు.


ప్రజలను సొంతంగా ఆలోచించలేని స్థితిలోకి నెట్టి.. హిస్టీరిక్‌ సైకాలజీ ద్వారా తన క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చేలా వ్యూహరచన చేయడంలో ప్రశాంత్‌ కిశోర్‌ దిట్ట. ఇలాంటి ఎత్తులతోనే దేశంలోని పలు రాష్ర్టాలలో రాజకీయాలను భ్రష్ర్టు పట్టించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కులాల కుంపట్లతో అప్పటికే రగిలిపోతున్న రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి విషం ఎక్కించారు. అన్ని వర్గాల ప్రజల్లో విద్వేషాలు వ్యాపించాయి. ఒక కులానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకృతం చేశారు. ఫలితంగా జగన్‌ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ దశ తిరిగింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్లు సైతం పీకేలాంటి వారి కోసం పోటీపడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మరచిపోయారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి, పోరాటాలు చేయడం మరచిపోయారు. తలలు పండిన నేతలు సైతం నిస్సహాయులు అవుతున్నారని ఆర్కే కొత్తపలుకులో పేర్కొన్నారు.  

రాజకీయాల్లో ఆవిరైపోయిన సిద్ధాంతాలు, విలువలు 

ఈవెంట్‌ మేనేజర్ల తరహాలో ఎన్నికల వ్యూహకర్తలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు ఆవిరైపోయాయి. పీకేలాంటి వారి కుయుక్తులతో అధికారంలోకి వచ్చినవారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తమదైన శైలిలో ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో దారిద్య్రం పెరిగిపోయేట్టుగా అడ్డగోలు సంక్షేమానికి తెర తీస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలతో మొదలైన ఈ సంతర్పణ ఇప్పుడు ఉత్తరాది రాష్ర్టాలకు కూడా పాకింది. దీంతో రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఇందుకు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నిదర్శనం. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌లాంటి వ్యూహకర్తల కృషి ఫలితంగా ఏర్పడే ప్రభుత్వాలలో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. సంక్షేమ రాజ్యం అంటే అప్పులు చేసుకుంటూ పోవడమనే నిర్వచనం కాదేమో! అని జగన్‌ అండ్‌ కో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాదూ కూడదూ అనుకుంటే అధికారంలోకి రావాలనుకుంటున్న మరొకరు ఇంతకన్నా ఎక్కువగా పంచిపెడతామని చెప్పి ప్రశాంత్‌ కిశోర్‌ను తలదన్నే వాడిని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటని.. ఆర్కే కొత్తపలుకులో నిలదీశారు.

చంద్రబాబు నో చెప్పడంతో.. జగన్ వైపు పీకే టీమ్ ..

నిజానికి జగన్‌ రెడ్డిని ఆశ్రయించడానికి ముందు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తరఫున పని చేయడానికి కూడా ప్రశాంత్‌ కిశోర్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. పీకే ప్రతిపాదనను చంద్రబాబు వద్దనడంతో ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్‌ తరఫున పని చేసింది. ఇప్పుడు పీకె టీం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై వ్యూహాలు రూపొందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ను తిరిగి అధికారంలోకి తీసుకు రావడంలో పీకె టీం క్రియాశీలకంగా వ్యవహరించడంతో.. ఇప్పుడు అటువంటి వ్యూహాలే ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. అయితే చైతన్యవంతమైన సమాజం ఉన్న ఏపీలో వీటిని ఎంతవరకు ప్రజలు ఆమోదిస్తారు? కళ్ళ ముందు గుంతలు పడిన రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగించడం, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే పీకే బృందం ఎలా ముందుకు వెళుతుందనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. 

ఇవి కూడా చదవండిImage Caption